దుబాయ్(Dubai)లో స్థిరాస్తి (Real Estate) కొంటున్నవాళ్లలో దాదాపు నాలుగో వంతు మంది ప్రవాస భారతీయులే (Non Resident Indians) ఉన్నారు. ఈ వాటా ప్రస్తుతం 23 శాతంగా ఉండగా 30 శాతానికి దూసుకుపోతోందని స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. కొవిడ్(Covid)కు ముందు ఈ షేరు కేవలం 18 శాతమేనని పేర్కొన్నారు. దుబాయ్ ప్రభుత్వం.. ఆస్తి యాజమాన్య నిబంధనల్లో మార్పులు తెచ్చింది. కొత్త రూల్స్ ప్రకారం విదేశీయులు (Foreigners) కూడా అక్కడ నివాస, వాణిజ్య ఆస్తులను ఫ్రీహోల్డ్ (Free Hold) ప్రాతిపదికన కొనుక్కొని సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో దుబాయ్‌లోని రియల్ ఎస్టేట్ మార్కెట్ సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఆ నగర దేశంలోని ప్రాపర్టీల పట్ల ఎన్ఆర్ఐలు అమితాసక్తి చూపుతున్నారు.
సుమారు నాలుగో వంతు మంది నాన్ రెసిడెంట్ ఇండియన్సే అక్కడ ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు. మనవాళ్ల తర్వాత యూరోపియన్లు రెండో స్థానంలో ఉన్నారు. అందులో బ్రిటిషర్లు పెద్ద సంఖ్యలో ఉండటం గమనార్హం. దుబాయ్‌లోని స్థిరాస్తి వ్యాపారంలో డానుబే గ్రూప్ చెప్పుకోదగ్గ సంస్థగా ఎదిగింది. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. ఈ కంపెనీని రిజ్వాన్ షాజన్ నడిపిస్తున్నారు. ఈ సంస్థ తాజాగా కమర్షియల్ ప్రాపర్టీ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. షారుఖ్జ్ బై డానుబే పేరుతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. దీనికి హిందీ నటుడు షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) పేరు పెట్టారు. ప్రపంచంలో మరే రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఇప్పటివరకు ఒక సెలబ్రిటీ (Celebrity) పేరు మీద బిజినెస్ పెట్టలేదని షాజన్ కుమారుడు ఆదిల్ షాజన్ చెప్పారు.
