Wednesday, February 11, 2026
Homeసాహిత్యంSomasunder | సహజ అభ్యుదయ కవి ఆవంత్స

Somasunder | సహజ అభ్యుదయ కవి ఆవంత్స

ఆవంత్స సోమసుందర్(Avantsa Somasunder) అభ్యుదయ కవి(Progressive Poet), విమర్శకుడు(Critic), రచయిత(Writer). తెలంగాణ ఉద్యమాన్ని (Telangana Movement) కోస్తా ప్రాంతం నుంచి సమర్ధించి కవిత్వం వెలువరించిన నిష్పక్షపాత వ్యక్తిత్వం ఆయనది. “ఖబడ్దార్ హే నిజాం పాదుషా.. ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురు” అని గర్జించిన సాహసి. జీవితమే కవిత్వం అని నమ్మి, జీవితాన్నే కవిత్వానికి అంకితం చేసిన వ్యక్తి, శతాధిక గ్రంథకర్త. కవిగా, కథకుడిగా, నవలా రచయితగా, నాటక కర్తగా, అనువాదకుడిగా భిన్న రూపాలతో గత 74 ఏళ్లుగా సాహితీ సేవ చేశాడు.

సోమసుందర్ తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సమీపంలోని శంఖవరం గ్రామంలో కాళ్ళూరి సూర్యప్రకాశరావు, వెంకాయమ్మ దంపతులకు 1924 నవంబరు 18న అష్టమ సంతానంగా జన్మిం చాడు. ఆయన ప్రాథమిక విద్యాభాసం అంతా పిఠాపురంలోనే జరిగింది. 1943లో పెద్దాపురం ఎం.ఆర్.కళాశాలలో చేరి ఉన్నత విద్య అభ్యసించాడు.

- Advertisement -

సోమసుందర్ క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొని 1942లో విద్యార్థులను కూడదీసి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేశానని చెప్పేవాడు. 1944లో అభ్యుదయ రచయితల సంఘం(అరసం)లో చేరి 1945లో రాయల్ ఇండియన్ నేవీ నిర్వహించిన ధర్నాను ప్రోత్సహిస్తూ తన మొట్టమొదటి అభ్యుదయ కవిత “ఇంక్విలాబ్ జిందాబాద్”ను ప్రకటించాడు.

నిజాం పాలనకు వ్యతిరేకంగా దాశరథి వంటి కవులు సాగిస్తున్న పోరాటానికి ఉత్తేజితుడై తెలంగాణ పోరాటానికి మద్దతుగా అనేక కవితలు వెలువరించాడు. యువతను ఉద్యమించమని పిలుపునిస్తూ వజ్రాయుధం అనే కవితను రాశాడు. ఆ కాలంలో నిజాం వ్యతిరేక పోరాటానికి మద్దతుగా రాసిన కవితలన్నింటినీ ఒక సంకలనంగా వజ్రాయుధం పేరుతో విడుదల చేశారు.

సోమసుందర్ స్వాతంత్ర్య పోరాటంలో విద్యార్థి నాయకుడిగా, కమ్యూనిష్టు పార్టీ సభ్యుడిగా, 1954 వరకూ కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషించాడు. రాజకీయాలు, సాహిత్య వ్యాసంగం ఏకకాలంలో నిర్వహించటం సాధ్యం కాదని, రాజకీయాలకు స్వస్తి పలికాడు. సోమసుందర్ నాలుగో ఫారం చదువుతున్న రోజుల్లో పద్య ప్రక్రియపై మోజు కలిగి, ఛందస్సును క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. 1943 వరకూ భావ కవిత్వం ఈయనకు తారస పడలేదు. తర్వాత తనదైన వచనా శైలిని అలవరచుకున్నాడు. సోమసుందర్ కమ్యూనిష్టు భావజాలం ఆయన కవిత్వంలో అంతర్లీనంగా జాలు వారుతుంది. ఆయన కవిత్వానికి మానవుడే ప్రాతిపదిక, సమాజమే నేపథ్యం.

వజ్రాయుధం నుంచి ఆమ్రపర్ణి వరకూ సుమారు ఆరున్నర దశాబ్ధాల పాటు సోమసుందర్ చేసిన కవితాయానంలో సమాజ సంకుల సమరమే అన్ని కోణాల్లోనూ ప్రతిబింబిస్తుంది. ఈ కవి మానవుని విస్మరించి, ఆకాశంలో విహరించిన సందర్భాలు కనపడవు. ఆయన కవిత్వం రాయటం ఒక పూవు వికసించటం లాగా, చెట్లు వసంతాన్ని ధరించటం లాగా ప్రకృతి సహజమైన పనిగా పెట్టుకున్నారా అనిపిస్తుంది.

ఈయన 1969-73 మధ్య కాకినాడకు మకాం మార్చి “కళా కేళి” అనే సాహిత్య పత్రికను నడిపాడు. ఈ ప్రక్రియలో ఈయన కొంత ఆర్థికంగా నష్టపోయి, కొంత భూమిని కూడా అమ్ముకోవలసి వచ్చింది. ఆరున్నర దశాబ్ధాల సాహితీ యాత్రలో అనేక ఉద్యమాలు, పోరాటాలు, ప్రళయాలు, కరువులు, ఎన్నో కనిపిస్తాయి. జాతి చైతన్యాన్ని కవితా చైతన్యంగా సమర్ధవంతంగా తర్జుమా చేసిన అభ్యుదయ కవిగా వన్నె కెక్కారు.

సోమసుందర్.. ఓలేటి శశాంకతోపాటు రామకృష్ణ, మల్లిక్, చందు సుబ్బారావు, పెనుగొండ లక్ష్మీనారాయణ వంటి చాలా మందిని కవులను ప్రోత్సహించారు. మహాకవి శ్రీశ్రీ ఆయన కవిత్వానికి దాసుడనని చెప్పుకున్నారు. అప్పటి సమాజం అత్యంత నీచంగా చూసే దివాన్ దాసీ కులం వారితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. 1979లో సోవియట్ లాండ్ నెహ్రూ బహుమతి, రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, 2008లో ఎన్టీఆర్ స్మారక జాతీయ పురస్కారం పొందారు.

ఆవంత్స సోమసుందర్ 77 పుస్తకాలు రాశారు. చాలా పుస్తకాలు అనేక పునర్ముద్రణలు పొందాయి. వజ్రాయుధం పేరుతో నిజాం వ్యతిరేక పోరాటానికి మద్దతుగా రాసిన కవితా సంకలనం. 1946 అక్టోబరు 26న దొడ్డి కొమరయ్య మరణంపై రాసిన ఖబడ్ధార్ అనే కవితతో ఇది మొదలవుతుంది. ఈ పుస్తకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. 1956లో నీలం సంజీవరెడ్డి ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేసింది. ఇది ఇప్పటికి 5 ముద్రణలు పొందింది. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం వారు దీన్ని పాఠ్యపుస్తకంగా స్వీకరించారు.

జీవితాంతం ఏటా ఒకటో రెండో పుస్తకాలు రాస్తూనే ఉన్నారు. ఇంకా 10 పుస్తకాల వరకూ అముద్రితంగా ఉన్నాయి. సోమసుందర్ 1979లో అత్యంత ప్రతిష్ఠాకరమైన సోవియెట్ ల్యాండ్ నెహ్రూ బహుమతి పొందారు. రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, గౌరవ డాక్టరేట్ వంటివి పొందారు. 2008కి ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారాన్ని, 1986లో అ.ర.సం. గుంటూరు శాఖ కొండేపూడి సాహితీ సత్కారం అందుకున్నారు. అకాడమీ ప్రైజులు, అవార్డులు అనేకం పొందారు‌. ఆయనకు అనేక మంది రాజకీయ నాయకులతో, అధికార పీఠాల్లో ఉన్నవారితో మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి.

సోమసుందర్ తన సమకాలీనుల్లో ఎవరికైనా అవార్డు వస్తే, వారిని అభినందిస్తూ వ్యాసమో, పుస్తకమో రాసి ఆ అవార్డేదో తనకే వచ్చినంత ఆనందించటం ఆయన కల్మష రహిత వ్యక్తిత్వానికి నిదర్శనం. సోమసుందర్ లిటరరీ ట్రస్టును ఏర్పరచి ఏటా ఐదుగురు కవులకు రూ.6 వేల నగదు బహుమతిని అందచేస్తూ వస్తున్నారు. 2006లో ట్రస్టు ఆధ్వర్యాన రాష్ట్ర స్థాయి ఆధునిక మహిళా సాహిత్య సదస్సు జరిపారు. దానికి రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది కవయిత్రులు విచ్చేసి పాల్గొన్నారు. 2016 ఆగస్టు 12న కాకినాడలో మరణించారు.

(నవంబర్ 18.. సోమసుందర్ జయంతి సందర్భంగా)

  • రామకిష్టయ్య సంగనభట్ల
- Advertisement -
RELATED ARTICLES

Latest News