Tuesday, March 3, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంNamishree: నమిశ్రీ భూదందా

Namishree: నమిశ్రీ భూదందా

ఎస్టేట్ భూములకే ఎసరు!
లోకాయుక్త తీర్పు బేఖాతరు!
అబ్దుల్లాపూర్‌మెట్‌లో నకిలీ పత్రాలతో వేల గజాల అటవీ భూమి అన్యాక్రాంతం
కీలక దస్త్రాలు మాయం చేసి, బోగస్ పత్రాలతో ఎస్టేట్ భూమి రిజిస్ట్రేషన్
ప్రభుత్వ భూమిలోని నిర్మాణంలోనే ఓ రాజకీయ నేత కుమారుడి కార్యాలయం..
లోకాయుక్త తీర్పు, గవర్నర్‌కు ఫిర్యాదులు అందినప్పటికీ కొనసాగుతున్న అక్రమాలు
ఈడీ వంటి సంస్థలతో విచారణ జరిపి, దోషులను శిక్షించాలని ప్రజల డిమాండ్1

ఎం.కే.రావు ఫౌండేషన్ ట్రస్ట్ పేరిట బోగస్ పత్రాలు సృష్టించి, 1770 గజాల భూమిని అక్రమంగా రెగ్యులరైజ్ చేశారు. ఆపై ఏకంగా 10,000 గజాలకు పైగా భూమికి రిజిస్ట్రేషన్ పూర్తిచేశారు. ఈ అక్రమానికి సాక్ష్యాలుగా ఉన్న ఒరిజనల్ ఫైళ్లను భూ పరిపాలన ప్రధాన కమిషనర్ మరియు సికింద్రాబాద్ ఎస్టేట్ కార్యాలయాల నుంచి ఏకకాలంలో మాయం చేశారు.

- Advertisement -

ప్రభుత్వ అండతో, అధికారుల అండదండలతో కొందరు రియల్ ఎస్టేట్ మాఫియా డాన్లు చేస్తున్న భూదందాలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. చట్టాలను, న్యాయస్థానాల తీర్పులను సైతం బేఖాతరు చేస్తూ వేల కోట్ల ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్న వైనం విస్మయానికి గురిచేస్తోంది. ఈ అక్రమాల్లో ఆరితేరిన నమిశ్రీ నిర్మాణ సంస్థ బాగోతం మరోసారి బట్టబయలైంది. అటవీ భూముల కబ్జా నుంచి మొదలుపెట్టి, ఏకంగా సికింద్రాబాద్ ఎస్టేట్ భూములను సైతం కబళించడం వారి బరితెగింపునకు నిలువుటద్దం పడుతోంది.

అబ్దుల్లాపూర్‌మెట్ అక్రమం: అటవీ భూమిలో అక్రమ నిర్మాణం!

అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో సర్వే నం. 121/పి లో అనుమతులు పొంది, పక్కనే ఉన్న సర్వే నం. 117/6 లోని అటవీ భూమిలో నమిశ్రీ సంస్థ అక్రమ నిర్మాణం చేపట్టిన విషయాన్ని ‘ఆదాబ్ హైదరాబాద్’ ఇప్పటికే ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చింది. కేవలం 2 ఎకరాల 35 గుంటలకు నాలా కన్వర్షన్ పొంది, 6 ఎకరాల 15 గుంటలకు నకిలీ పత్రాలు సృష్టించిన ఈ మోసంపై ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయం పోలీసు కేసు నమోదు చేసింది. ఈ దొంగ పత్రాల వ్యవహారం, కేసు పూర్తి వివరాలతో ‘ఆదాబ్ హైదరాబాద్’ త్వరలోనే మరో సంచలన కథనాన్ని ప్రచురించనుంది.

సికింద్రాబాద్ భూకుంభకోణం: చట్టానికి అతీతులా?

సమిశ్రీ ఆక్రమాల పరంపరలో సికింద్రాబాద్ ఎస్టేట్ భూమి కుంభకోణం మకుటాయమానంగా నిలుస్తుంది. సికింద్రాబాద్ నడిబొడ్డున ఉన్న 10,200 గజాల అత్యంత విలువైన ప్రభుత్వ ఎస్టేట్ భూమిని కాజేయడంలో ఈ సంస్థ అనుసరించిన తీరు, అధికారుల అవినీతి, రాజకీయ అండదండలు వ్యవస్థల వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి.

లోకాయుక్త తీర్పును తుంగలో తొక్కి..

ఈ భూ వ్యవహారంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, ఈ అక్రమంపై లోకాయుక్త స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ, ఆ తీర్పును కాగితపు ముక్కలా పరిగణించిన ఎస్టేట్ కార్యాలయ అధికారులు, అక్రమార్కులతో చేతులు కలిపి ఈ దందాకు తెరలేపారు. న్యాయవ్యవస్థ ఆదేశాలనే ధిక్కరించారంటే, వారి వెనుక ఎంతటి శక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు.

అధికారుల కుమ్మక్కు, ఫైళ్ల మాయం:

ఎం.కే. రావు ఫౌండేషన్ ట్రస్ట్ పేరిట బోగస్ పత్రాలు సృష్టించి, 1770 గజాల భూమిని అక్రమంగా రెగ్యులరైజ్ చేశారు. ఆపై ఏకంగా 10,000 గజాలకు పైగా భూమికి రిజిస్ట్రేషన్ పూర్తిచేశారు. ఈ అక్రమానికి సాక్ష్యాలుగా ఉన్న ఒరిజనల్ ఫైళ్లను భూ పరిపాలన ప్రధాన కమిషనర్ మరియు సికింద్రాబాద్ ఎస్టేట్ కార్యాలయాల నుంచి ఏకకాలంలో మాయం చేశారు. ఈ ఫైళ్ల మాయం వెనుక అప్పటి సీసీఎస్ఏ అధికారిణి సత్య శారదా కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఓ పెద్ద నాయకుడి అంద ఉన్నట్లు బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నమిశ్రీ సంస్థ ప్రభుత్వ భూమిలో నిర్మించిన రాణిగంజ్‌లోని టి19 టవర్స్‌లోనే ఓ నాయకుడి కుమారుడి కార్యాలయం ఉండటం ఈ విమర్శలకు మరింత బలాన్నిస్తోంది.

ఫిర్యాదులు బుట్టదాఖలు!

ఈ భారీ భూ కుంభకోణంపై ఇప్పటికే పలువురు సామాజిక కార్యకర్తలు, బాధితులు ఆధారాలతో సహా గవర్నర్కు ఫిర్యాదులు అందజేశారు. అయినప్పటికీ, ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. లోకాయుక్త తీర్పు, గవర్నర్కు అందిన ఫిర్యాదులు ఉన్నప్పటికీ, అక్రమార్కులు తమ పని తాము చేసుకుపోతున్నారంటే వ్యవస్థలు ఎంతగా నిర్వీర్యమయ్యాయో అర్ధమవుతోంది. ఇప్పటికైనా గవర్నర్ ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకుని, తన పరిధిలోని భూములను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి, ఈ భూ కుంభకోణం వెనుక ఉన్న పెద్ద మనుషుల బండారాన్ని బయటపెట్టి, అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు. మరో కథనంలో, నమిశ్రీ అక్రమ వ్యవహారాలు, ఆ సంస్థ కారణంగా జాతీయ బ్యాంకులు ఏ విధంగా దివాలా తీస్తున్నాయి, దీనికి ప్రత్యక్ష, పరోక్ష కారకులు ఎవరు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఏ విధంగా సహకరిస్తోందన్న విషయాలను ‘ఆదాబ్ హైదరాబాద్’ పూర్తి ఆధారాలతో మీ ముందుకు తీసుకురానుంది.. “మా అక్షరం అవినీతిపై అస్త్రం”

- Advertisement -
RELATED ARTICLES

Latest News