Tuesday, March 3, 2026
Homeనల్లగొండKidnap | నల్గొండలో దారుణం..సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్‌!

Kidnap | నల్గొండలో దారుణం..సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్‌!

  • నామినేషన్ ఉపసంహరించుకోమని బెదిరింపులు, చిత్రహింసలు..
  • జనరల్ స్థానాలలో బీసీలు పోటీ చేయొద్దా పోటీ చేస్తే చంపుతారా..
  • మూత్రం తాగించి, యాదగిరి పై దాడి కాంగ్రెస్ నాయకులపై బాధితుడి ఆరోపణలు..

​నల్గొండ జిల్లా రాజకీయాల్లో కలకలం రేపే ఒక దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. తిప్పర్తి మండలం, ఎల్లమ్మగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాల్సిన మామిడాల యాదగిరి యాదవ్ ని శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కిడ్నాప్ చేసి, నామినేషన్ ఉపసంహరించుకోమని అత్యంత పాశవికంగా చిత్రహింసలకు గురిచేసినట్లు బాధితుడు ఆరోపించారు.ఎల్లమ్మగూడెం సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న మామిడాల యాదగిరి యాదవ్ ని కాంగ్రెస్ నాయకులు కత్తులతో బెదిరించి కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాప్‌లో గతంలో ఎల్లమ్మగూడెం గ్రామ మాజీ సర్పంచ్ భర్త విజయ్ రెడ్డి హత్య కేసులో నిందితుడైన వూట్కూరి సందీప్ రెడ్డి కూడా పాల్గొన్నట్లు యాదగిరి తెలిపారు.

అత్యంత దారుణంగా టార్చర్..

​నామినేషన్ ఉపసంహరించుకునే వరకు యాదగిరిని ఊరు రాకుండా, నామినేషన్ వేయకుండా కార్లు మారుస్తూ పలు ప్రాంతాల్లో తిప్పారు. ఈ క్రమంలోనే కిడ్నాపర్లు యాదగిరిపై అమానుషంగా దాడి చేశారు. గ్లాసులో మూత్రాన్ని పోసి బలవంతంగా తాగించారు అని యాదగిరి కన్నీటిపర్యంతమయ్యారు.

- Advertisement -

​అంతేకాక, ఆయన్ను బట్టలు విప్పదీసి నగ్నంగా మార్చి తీవ్రంగా కొట్టారని, పిడిగుద్దులు గుద్ది చుక్కలు చూపించారని తెలిపారు. “నీ భార్య నామినేషన్ వేయకుండా ఆపించు, లేదంటే నువ్వు చావడం పక్క” అంటూ కిడ్నాపర్లు బెదిరించారని యాదగిరి వెల్లడించారు. కిడ్నాపర్లతో కాంగ్రెస్ నాయకుడు బోళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడారని కూడా ఆయన ఆరోపించారు.

పోలీసుల పాత్రపై అనుమానం..

​కాంగ్రెస్ నాయకులు తనను బలవంతంగా కిడ్నాప్ చేశారని ఆరోపించిన యాదగిరి, విడుదలైన తర్వాత జరిగిన సంఘటనపైనా అనుమానం వ్యక్తం చేశారు. కిడ్నాపర్ల చెర నుంచి బయటపడి పోలీసుల వద్దకు రాగా, పోలీసులు తనపై బలవంతపు సంతకాలు చేయించుకున్నారని ఆయన ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఇలాంటి దారుణమైన కిడ్నాప్, చిత్రహింసల ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, కిడ్నాపర్లు, ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నాయకులపై ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News