- ఆందోళన తగ్గుతుందన్న నిపుణులు..
సాధారణంగా సంగీతం వినడం మనసుకు శాంతినిస్తుందని అందరికీ తెలిసిందే. కానీ కేవలం 24 నిమిషాల పాటు ప్రత్యేకంగా రూపొందించిన సంగీతాన్ని వినడం ద్వారా ఆందోళనను గణనీయంగా తగ్గించవచ్చని తాజా క్లినికల్ ట్రయల్ వెల్లడించింది. ఔషధాలు లేకుండానే ఒత్తిడిని నియంత్రించేందుకు ఇది సులభమైన మార్గమని పరిశోధకులు చెబుతున్నారు. కెనడాలోని టొరొంటో మెట్రోపాలిటన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ పరిశోధనలో, సంగీతాన్ని ఆడిటరీ బీట్ స్టిమ్యులేషన్ (ABS) అనే పద్ధతితో కలిపి ఉపయోగించారు. ఇందులో ప్రతి చెవికి కొంచెం భిన్నమైన శబ్ద తరంగాలను వినిపించడం ద్వారా మెదడు ఒక రిథమ్‌ను సృష్టిస్తుంది.
ఈ రిథమ్ మెదడు తరంగాలను ప్రభావితం చేసి, విశ్రాంతి, ఏకాగ్రత లేదా నిద్రకు అనుకూలమైన స్థితిని కలిగిస్తుంది. పరిశోధనలో భాగంగా పాల్గొన్న వారికి వివిధ సమయాల పాటు ప్రత్యేకంగా రూపొందించిన ఆడియోలను వినిపించారు. ఈ పరీక్షల్లో 24 నిమిషాల వినికిడి సమయం అత్యుత్తమ ఫలితాలను ఇచ్చిందని తేలింది. ఈ వ్యవధి తరువాత పాల్గొన్నవారు తాము మరింత ప్రశాంతంగా, ఒత్తిడి తగ్గినట్లుగా, భావోద్వేగంగా సమతుల్యంగా ఉన్నట్లు తెలిపారు.
