- సమస్యల పరిష్కారానికి హామీ
పట్టణంలోని YSN గార్డెన్‌లో మున్సిపల్ చైర్‌పర్సన్ బీజన బాలమణి, కమిషనర్ కే. శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపారస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వ్యాపారస్తులు మాట్లాడుతూ రోడ్లపై వాహనదారులు, పాదచారులకు ఇబ్బందిగా ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమానికి తాము పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. అలాగే వర్షపు నీరు రోడ్లపై నిల్వ కాకుండా డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని, మెయిన్ రోడ్డుపై దుమ్ము తగ్గించేలా నిరంతర స్వీపింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన వ్యాపార బోర్డులు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నాయని, వాటిని స్వచ్ఛందంగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టణంలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచాలని, చెత్త సేకరణను సమయానికి నిర్వహించాలని కూడా సూచించారు.
దీనికి స్పందించిన చైర్‌పర్సన్, కమిషనర్‌లు వ్యాపారస్తులు లేవనెత్తిన సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలోని ప్రతి వ్యాపారి తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ పొందాలని, ఆక్రమణల తొలగింపు కార్యక్రమానికి సహకరించాలని సూచించారు. రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన బోర్డులను స్వచ్ఛందంగా తొలగించాలని కమిషనర్ ప్రత్యేకంగా కోరారు.
ప్రజలకు ఇబ్బంది కలిగించే సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని, పట్టణ అభివృద్ధిలో వ్యాపారుల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జగన్ మోహన్, ఇంచార్జ్ ఎస్‌ఐ ఎస్. స్వామి, పట్టణ వ్యాపారస్తులు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
