- ఆహ్వానం పలుకుతున్న ములుగు మున్సిపల్ పోలింగ్ కేంద్రం
- ములుగు పట్టణ మున్సిపల్ లో బుధవారం ఎన్నికల సందడి కోలాహలంగా కొనసాగుతోంది.
ములుగు జిల్లా కేంద్రం లో నూతనంగా ఏర్పడ్డ ములుగు పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో ఉదయం నుంచి స్థానిక ఓటర్ల ఉత్సాహం వెల్లివిరుస్తోంది.ఆయా వార్డుల ల్లో తమ,తమ ప్రజాప్రతినిధులను ఓటు హక్కు తో ఎన్నుకునేందుకు పట్టణ వాసులు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. అయితే ఈసారి పోలింగ్ కేంద్రాలు కేవలం ఒకనాటి “బూత్” బంగ్లాలో ఓటింగ్ బూత్‌ల్లా కాకుండా,అక్కడ ఏదో ఒక పెద్ద “శుభకార్యం” జరుగుతున్న వేదికల్లా కనిపిస్తున్నాయి.
అక్కడి అధికారులు పోలింగ్ కేంద్రాలను మామిడి తోరణాలు, అరటి బోదెలు, కొబ్బరి మట్టలతో తెలుగింటి సంప్రదాయబద్ధంగా కొత్తగా కళకళలాడుతూ అలంకరించారు. పచ్చని తోరణాల మధ్య ఓటు వేయడానికి వచ్చిన ప్రజలతో పోలింగ్ కేంద్రాలన్నీ కళకళలాడుతున్నాయి. ఈ ఆహ్లాదకరమైన వాతావరణం పట్టణ ఓటర్లలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.
ఇక ఓటు వేసిన తర్వాత వేలికి ఉన్న సిరా గుర్తును చూసుకుని మురిసిపోవడమే కాదు.. ఆ జ్ఞాపకాన్ని పదిలపరుచుకునేందుకు ప్రత్యేకంగా ‘సెల్ఫీ పాయింట్లు’ ఏర్పాటు చేశారు. ఓటు హక్కు వినియోగించుకున్న యువత, మహిళలు ఈ సెల్ఫీ పాయింట్ల వద్ద ఫోటోలు దిగుతూ తమ ఆనందాన్ని,ఆహ్లాదకరంగా వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య ఓటు పండుగలో తాము కూడా పెద్ద ఎత్తున భాగస్వాములయ్యామని సగర్వంగా చెబుతున్నారు.
మొత్తానికి ములుగులో పోలింగ్ సరళి ఉల్లాసంగా, ఉత్సాహభరితంగా కొన సాగుతోంది. ఒకవైపు సాంప్రదాయ అలంకరణలు, మరోవైపు సెల్ఫీ పాయింట్ల సందడితో ఎన్నికల ప్రక్రియ ఓ సంక్రాంతి పండుగలా మారింది. సాయంత్రం వరకు ఓటర్లలో ఇదే నవ చైతన్యం తో మరింత జోష్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
