Wednesday, March 18, 2026
HomeజాతీయంAtmanirbharta Mission | రైతు క్షేమమే ధ్యేయంగా బెజవాడ ఎంపీ ప్రశ్నావళి

Atmanirbharta Mission | రైతు క్షేమమే ధ్యేయంగా బెజవాడ ఎంపీ ప్రశ్నావళి

  • పప్పుధాన్యాల సాగులో ‘ఆత్మనిర్భర్త’: ఎంపీ కేశినేని చిన్ని అడిగిన ప్రశ్నకు కేంద్రం కీలక సమాధానం

దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి స్పష్టం చేశారు. మంగళవారం లోక్‌సభలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, ఈ లక్ష్య సాధన కోసం 2025 అక్టోబర్ 1న ‘పప్పు దినుసులలో ఆత్మనిర్భర్త మిషన్’ అనే ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు.

2025-26 నుంచి 2030-31 వరకు ఆరు సంవత్సరాల కాలానికి రూ.11,440 కోట్లు కేటాయించి, దేశీయంగా పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించడమే కాకుండా రైతులకు లాభదాయకమైన ధరలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నాఫెడ్ (NAFED), ఎన్‌సీసీఎఫ్ (NCCF) సంస్థల ద్వారా నమోదిత రైతుల నుంచి నేరుగా పప్పు దినుసుల సేకరణకు ఈ మిషన్ పూర్తి మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు.

- Advertisement -

2025-26 గణాంకాల ప్రకారం దేశంలోనే అత్యధికంగా రాజస్థాన్ 1,63,311 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో అగ్రస్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ 1,01,172 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధించిందని మంత్రి వెల్లడించారు. ఏపీలో జిల్లాల వారీగా పరిశీలిస్తే అనంతపురం (21,575 మెట్రిక్ టన్నులు) మొదటి స్థానంలో నిలవగా, కర్నూలు (19,449 మెట్రిక్ టన్నులు), ప్రకాశం (13,837 మెట్రిక్ టన్నులు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయని వివరించారు.

కేవలం ఉత్పత్తి పెంచడమే కాకుండా, వాతావరణ మార్పులను తట్టుకునే మేలు రకపు విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావడం, ప్రత్యేక శిక్షణ ఇవ్వడం మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఆర్థిక సహాయం అందించడం ద్వారా పప్పుధాన్యాల సాగును లాభసాటిగా మారుస్తున్నట్లు మంత్రి భగీరథ్ చౌదరి ఎంపీ కేశినేని చిన్నికి వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News