- డబ్బు రాజకీయాల దుష్పరిణామాలు..
- ప్రజాస్వామ్యంపై పడుతున్న ..మచ్చ…
- సోషల్ మీడియా ప్రచారాలకు మోసపోకండి
- నిజానిజాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి…
- ఒక ఫార్వర్డ్ మెసేజ్ ఆధారంగా అభిప్రాయం ఏర్పరచుకోవడం తప్పు
- అవగాహనతో కూడిన ఓటే మార్పుకు నాంది.ప్రజా సంక్షేమానికి పునాది..
- మీ ఓటును డబ్బుతో కొనాలనుకునే నేతలకు ఓటుతోనే జవాబు చెప్పండి..
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కేవలం హక్కే కాదు, వెలకట్టలేని బాధ్యత కూడా. ఓటు అనే ఆయుధాన్ని సరైన దిశలో ఉపయోగించనప్పుడు అదే ఆయుధం తిరిగి ప్రజలపైనే అభివృద్ధి పేరిట ప్రయోగించబడుతుంది. ఓటర్ల అవగాహన లోపాన్ని అవకాశంగా మలుచుకునే కొందరు నాయకులు ప్రజా సమస్యలను పక్కనపెట్టి స్వార్థ పూరిత రాజకీయాలకు తెరలేపుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం అనే మాటలు నేడు ఎన్నికల మేనిఫెస్టోలకు మాత్రమే పరిమితమవుతున్నాయి.. ప్రజల జీవితం మాత్రం మార్పు లేని చక్రంలోనే బొంగరంలా తిరుగుతూనే ఉంది..

మహబూబాబాద్‌లో బహిరంగ బెదిరింపులు
మహబూబాబాద్ జిల్లా సోమ్లాతండాలో చోటుచేసుకున్న ఘటన ప్రజాస్వామ్య విలువలను సిగ్గుపడేలా చేసింది. ఎమ్మెల్యే మురళీనాయక్ సొంత గ్రామంలో, ఆయన సోదరుడు దల్‌సింగ్ తన భార్య సర్పంచ్‌గా ఓడిపోయిందని తండావాసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.మాకు ఓటు వేయలేదని దేవుడి మీద ప్రమాణం చేయాలి… లేదా మేమిచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలి.. అంటూ జెండాలు పట్టుకొని గ్రామంలో తిరగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.ఓటు అనేది రహస్యమని, తాము డబ్బులు అడగలేదని తండావాసులు స్పష్టంగా చెప్పినా, నాయకుల ఒత్తిడి తగ్గలేదు. అంతేకాదు, తండాలోని వాటర్ ట్యాంక్‌కు తాళం వేసి నీళ్లు తీసుకెళ్లొద్దని ఆంక్షలు విధించడం, గుడిలో ఉన్న అయ్యప్ప స్వాములను ఖాళీ చేయాలని బెదిరింపులకు పాల్పడటం పరిస్థితులు దిగజారాయి అనడానికి నిదర్శనం… చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది..

ఓటమి తర్వాత ‘రికవరీ రాజకీయాలు’
ఇది ఒక్క ఘటన మాత్రమే కాదు.గతంలో మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లింగయ్యపల్లెలో ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి, ఎన్నికల ముందు పంచిన డబ్బులను తిరిగి ఇవ్వమంటూ ప్రజల వద్దకు వెళ్లడం సంచలనంగా మారింది.గెలవడానికి లక్షలు ఖర్చు పెట్టాను… ఇప్పుడు నా డబ్బు నాకు ఇవ్వండి… అంటూ ఆయన కోరడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. విచిత్రమేమిటంటే, కొందరు ఓటర్లు సానుభూతితో డబ్బులు తిరిగి ఇవ్వడం!
ఇది ఓటు విలువ ఎంత దిగజారిందో చెప్పే ప్రమాదకర సంకేతం.

డబ్బు రాజకీయాల అసలు ముఖం
నేటి ఎన్నికలు ఆలోచనలపై కాదు… ఖర్చులపై నడుస్తున్నాయి.పోస్టర్లు, ర్యాలీలు, సోషల్ మీడియా ప్రచారాలు, విందులు..సర్దుబాట్లు ..అన్నీ కోట్ల రూపాయల వ్యవహారాలే. గెలిచినవారు అధికారంలోకి వచ్చాక ఆ ఖర్చును కాంట్రాక్టులు, కమిషన్లు, అక్రమ వసూళ్ల రూపంలో తిరిగి రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఓడిపోయినవారు కూడా తక్కువేమీ కాదు..ఖర్చు చేసిన డబ్బును వసూలు చేసుకునే మార్గాల్లో పడుతున్నారు. చివరికి నష్టపోయేది మాత్రం ఓటరే ..

ఓటర్లు చేసే పెద్ద పొరపాటు
ఎన్నికల ముందు వచ్చే డబ్బు, మద్యం, బహుమతులు ఆ రోజు సంతోషం ఇవ్వవచ్చు. కానీ అవే ఐదేళ్ల పాటు రోడ్లు లేని గ్రామాలు, నీళ్లు లేని కాలనీలు, ఉద్యోగాలు లేని యువతగా మారుతాయి.ఎన్నికల వేళ చూపిన కరుణ, అధికారంలోకి వచ్చాక కనిపించదు..మిగిలేది అధికార దర్పమే.
ప్రశ్నించాల్సిన బాధ్యత ఓటర్లదే
అభ్యర్థి గతంలో ఎం చేశాడు? ప్రజలకు ఎంతమేరకు అందుబాటులో ఉన్నాడు? తాను చెప్పిన మాటలకు, పనులకు మధ్య ఎంత తేడా ఏంటనే విషయాన్ని గ్రహించాలి..? పార్టీ కాదు…వ్యక్తి కాదు.ప్రజా ప్రయోజనం ముఖ్యమని ఓటు వేసే ప్రతీ ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి… జాతి, మతం, కులం, ప్రాంతం పేర్లతో రెచ్చగొట్టే రాజకీయాలకు దూరంగా ఉండాలి. అభివృద్ధి, నిజాయితీ, బాధ్యతాయుత పాలన..ఇవే ఓటు వేయడానికి ప్రమాణాలుగా ఉండాలి.
యువత పాత్ర కీలకం
దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. సోషల్ మీడియా ప్రచారాలకు మోసపోకుండా నిజానిజాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఒక ఫార్వర్డ్ మెసేజ్ ఆధారంగా అభిప్రాయం ఏర్పరచుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. అవగాహనతో కూడిన ఓటే మార్పుకు నాంది.క్షణిక లాభాలకు తమ ఓటును తాకట్టు పెట్టడం. ఎన్నికల ముందు ఇచ్చే డబ్బు, మద్యం, బహుమతులు ఆ రోజు సంతోషం కలిగించవచ్చు. కానీ ఆ తాత్కాలిక లాభాలే ఐదేళ్ల పాటు శాశ్వత నష్టాలుగా మారుతాయి. రోడ్లు, నీళ్లు, విద్య, వైద్యం, ఉపాధి..ఈ మౌలిక అవసరాల కోసం ప్రజలు మళ్లీ అదే నాయకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అప్పుడు ఎన్నికల వేళ చూపిన కరుణ కనిపించదు..అధికార దర్పమే మిగులుతుంది.
కళ్లుమూసుకుని కాదు..కళ్లు తెరిచి ఓటు వేయండి.
లేనిపక్షంలో గెలిచినవారు అధికార మత్తులో, ఓడిపోయినవారు వసూళ్ల దౌర్జన్యాలలో నష్టపోయేది సామాన్య ప్రజలే. ప్రజాస్వామ్యంలో నాయకులు ప్రజల వల్లే నాయకులవుతారు. కానీ అదే ప్రజలు నిర్లక్ష్యంగా ఓటు వేస్తే, ఆ నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించాల్సింది కూడ ఆ ప్రజలే..ఎన్నికల రోజు వేసే ఓటు ఐదేళ్ల భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది.అందుకే చెబుతున్నాం కళ్లుమూసుకుని కాదు..కళ్లు తెరిచి ఓటు వేయండని..
