బీఆర్ఎస్ పార్టీకి నైతికత లేదని విమర్శ
శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత
ప్రసంగం మధ్యలో భావోద్వేగంతో కన్నీరు
బీఆర్ఎస్ పార్టీ(BRS Party)కి రాజ్యాంగ స్ఫూర్తి, నైతికత లేవని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Mlc Kalvakuntla Kavitha) విమర్శించారు. ఆ పార్టీ రాజ్యాంగం ఒక జోక్ అని ఎద్దేవా చేశారు. ఎనిమిది పేజీలు మాత్రమే ఉంటుందని చెప్పారు. నైతికత లేని బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు రావటం సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ కోసం కుటుంబాన్ని వదిలి కష్టపడ్డానని, పార్టీ నుంచి తనను కుట్ర చేసి బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా, వివరణ అడగకుండా సస్పెండ్ చేశారని వెల్లడించారు.
తన పోరాటం ఆస్తుల కోసమంటూ కాంగ్రెస్ పార్టీ(Congress Party) తప్పుడు ప్రచారం(False Propaganda) చేస్తోందని ధ్వజమెత్తారు. ‘లక్ష్మీ నరసింహా స్వామి మీద, నా పిల్లల మీద ఒట్టు. ఆత్మగౌరవం కోసమే నా పోరాటం’ అని కవిత స్పష్టం చేశారు. ఓ వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్నానని, భవిష్యత్‌లో శక్తిగా మీ ముందుకు వస్తానని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ పంథాను నిర్మిస్తానని, ఒక ఆడబిడ్డగా ముందడుగు వేస్తున్నానని చెప్పారు. తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
శాసన మండలిలో కవిత ప్రసంగం(Speech in Legislative Council)..
‘గత సంవత్సరం సెప్టెంబర్ 3న నేను నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఇచ్చాను. పూర్తిగా ఛైర్మన్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖ ఇచ్చినప్పటికీ మీరు ఆలోచించుకోవాలని కోరారు. నేను పూర్తి కాన్షియస్‌గానే నా రాజీనామా నిర్ణయం తీసుకున్నాను. నా రాజీనామాకు కారణాలను సభలో చెప్పేందుకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాష్ట్రంలో 4 కోట్ల మంది జనాభా ఉంటే 40 మందికి మాత్రమే పెద్దల సభలో ఉండే అవకాశం ఉంటుంది. ఆ గౌరవం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి అదే విధంగా నాకు ఓటు వేసిన నిజామాబాద్ ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ధన్యవాదాలు. ఏ బీఆర్ఎస్ పార్టీ ద్వారా పదవి వచ్చిందో ఆ పార్టీలోనే నేను చేయాల్సిన పనులకు కట్టుబాట్లు ఎదురయ్యాయి. అలాంటి సందర్భంలో ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవిలో కొనసాగటం నైతికత కాదు. మన రాష్ట్రంలో మహిళా ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది.
17 ఎంపీ స్థానాలు ఉంటే ఒక మహిళ ఎంపీ మాత్రమే ఉన్నారు. 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే మహిళ ఎమ్మెల్యేలు 8 మంది మాత్రమే. ఇక మండలిలో 40 మందిలో ముగ్గురు మాత్రమే మహిళ సభ్యులు. నేను వెళ్లిపోతే ఇద్దరే ఉంటారు. ఈ రాష్ట్రంలో మహిళల ప్రాతినిథ్యం 0.0003 శాతం మాత్రమే ఉంది. నేను కచ్చితంగా ఓ కొత్త రాజకీయ వ్యవస్థను నిర్మిస్తాను. తెలంగాణ కోసం పనిచేసే పొలిటికల్ పార్టీ అవసరం ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల పక్షాన పోటీ చేసే శక్తిగా మేము నిలబడుతాం. లెప్ట్ పార్టీల సింపథైజర్లు, మావోయిస్టులను నాకు మద్దతివ్వాలని కోరుతున్నా. విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళల కోసం పనిచేయటానికి ఈ రాష్ట్రంలో ఓ పార్టీ రాబోతోంది. ఒక ఆడబిడ్డగా నేను ముందడుగు వేస్తున్నా. నాకు మద్దతుగా నిలవండి’ అని కవిత అన్నారు.
