గత ప్రభుత్వం చేసింది తక్కువ.. చెప్పుకున్నది ఎక్కువ
అబద్దాల గురించి కేసీఆర్ మాట్లాడితే..
దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది
ఆయనలా అర చేతిలో స్వర్గం చూపించడం మాకు అసలే రాదు
మాజీ సీఎం కేసీఆర్‌కి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ పార్టీ అధినేత(Brs Party President), మాజీ సీఎం కేసీఆర్(Former CM Kcr) రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridharbabu) తిప్పికొట్టారు. ఆయనది ‘హైప్’ (Hype) క్రియేట్ చేసే వర్కింగ్ కల్చర్ అయితే మాది ‘హోప్’ (Hope) క్రియేట్ చేసే వర్కింగ్ కల్చర్ (Working Culture) అని చెప్పారు. గత ప్రభుత్వం చేసింది తక్కువ.. చెప్పుకున్నది ఎక్కువని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) చేసింది ఎక్కువ.. చెప్పుకునేది తక్కువ అని స్పష్టం చేశారు. కేసీఆర్‌లాగా తమకు గాల్లో మేడలు కట్టడం రాదని.. అర చేతిలో స్వర్గం చూపించడం అసలే రాదని అన్నారు. అబద్ధాల గురించి ఆయన మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని శ్రీధర్ బాబు దుయ్యబట్టారు.
‘రాష్ట్రానికి పరిశ్రమలు రావొద్దు. పెట్టుబడులు రావొద్దు. ఇక్కడి యువతకు ఉద్యోగాలు రావొద్దు. ఇదే బీఆర్ఎస్ పాలసీ. రాష్ట్రంలో పెట్టబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఎంవోయూలు చేసుకున్న దిగ్గజ కంపెనీలను కించపర్చడం మంచిది కాదు. ఒక సీనియర్ నాయకుడిగా మీకిది తగదు’ అని మంత్రి హితవు పలికారు.
కేసీఆర్ హయాంలో ఏ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా ఆయన కుటుంబం అనుమతి తప్పనిసరి అవునా? కాదా? చెప్పాలని కోరారు. తాము ఆ గేట్ పాస్ కల్చర్‌కు ఫుల్ స్టాప్ పెట్టామని, అందుకే ఈరోజు గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు తెలంగాణ బై ఛాయిస్ కాదు.. బై డెస్టినేషన్‌గా మారిందని తెలిపారు. ఇవాళ పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రానికి క్యూ కడుతున్నాయని చెప్పారు.
‘ఎక్కడో ఉండి పాలన సాగించిన మీకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు చేసుకోవడం హైప్ లాగే కనిపిస్తుంది. ఇది హైప్ కాదు. ఈ రాష్ట్రం కోసం, భావితరాల కోసం మా ప్రభుత్వం క్రియేట్ చేస్తున్న హోప్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో మేం కుదుర్చుకున్న రూ.5.75 లక్షల కోట్ల ఎంవోయూలు అబద్ధమైతే జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, వ్యాపార దిగ్గజాలు గ్లోబల్ సమ్మిట్‌కు రావడం కూడా అబద్ధమా?.
మీ హయాంలోనూ అనేక ఎంవోయూలు జరిగాయి. కానీ.. అన్ని కంపెనీలూ పెట్టుబడులు పెట్టాయా?. ఒక్కో ఎంవోయూ గ్రౌండింగ్ అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. అది తెలిసి కూడా రెండేళ్లలో రూ.3.4 లక్షల పెట్టుబడులు తీసుకొచ్చిన మాపై విమర్శలు చేయడం సరికాదు. ప్రతి ఎంవోయూను గ్రౌండింగ్ చేసేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది.
దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచేలా భారత్ ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టాం. కానీ.. మీరు మాత్రం రియల్ ఎస్టేట్ కోసమే అంటూ తప్పుడు ప్రచారం చేయడం తగదు. మేం రాష్ట్రంలో పెట్టబడులు పెట్టేందుకు ముందుకొచ్చేవారి అవసరాలకు అనుగుణంగా అన్నీ ఒకే చోట ఉండాలనే గొప్ప సంకల్పంతో ఫ్యూచర్ సిటీ ప్రణాళికలు రూపొందించాం.
మీ హయాంలో ఓ అధికారి మంచి పాలసీని రూపొందించారని చెప్పారు. బాగుంది. కానీ.. ఆ పాలసీలో ఉన్న నిబంధనలను మీరు అమలుచేశారా?. ఉత్తమ ఆఫీసర్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చి సెక్రటేరియట్‌కే వెళ్లకుండా పాలన సాగించిన చరిత్ర మీది. ఇవాళ మేము అధికారులకు స్వేచ్ఛనిచ్చి రాష్ట్రాభివృద్ధిలో వాళ్లను భాగస్వాములను చేస్తున్నాం.
వరంగల్ టెక్స్‌టైల్ పార్క్ మీద పేటెంట్ మీదా?. మరి మీ హయాంలో ఎందుకు పూర్తి చేయలేదు?. అసంపూర్తిగా మిగిలిపోయిన పార్క్‌ను మేము ఒక ప్రణాళికా ప్రకారం పూర్తి చేశాం. అక్కడికి దిగ్గజ కంపెనీలను తీసుకొచ్చాం. దేశంలో ఇదే మొట్టమొదటి ఫంక్షనల్ పీఎం మిత్ర పార్క్. కేంద్రం నుంచి మా హయాంలోనే రూ.30 కోట్లు ఈ పార్కు అభివృద్ధికి తీసుకొచ్చాం.
వాస్తవాలు మాట్లాడితే.. ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, లైఫ్ సైన్సెస్‌లో పేటెంట్ కాంగ్రెస్ పార్టీది. ఈ రంగాల్లో తెలంగాణ ఇప్పుడు టాప్‌లో ఉందంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎకో సిస్టం అభివృద్ధికి వేసిన పునాదులే కారణం. అవునా? కాదా?. మీరు తొమ్మిదేళ్లలో ఐటీ ఎగుమతులను రూ.54 వేల కోట్ల నుంచి రూ.2.43 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. మేం కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే రూ.2.43 లక్షల కోట్ల నుంచి రూ.3.23 లక్షల కోట్లకు తీసుకెళ్లాం.
2024–25లో తలసరి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి(జీఎస్డీపీ), తలసరి ఆదాయంలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తేల్చింది. 1.. తెలంగాణ–రూ.3.87 లక్షలు 2.. కర్ణాటక–రూ.3.8 లక్షలు. 3.. తమిళనాడు–రూ.3.61 లక్షలు. 4.. మహారాష్ట్ర–రూ.3.09 లక్షలు.
మీరు విమర్శలు చేసే ముందు ఒకసారి గతం కూడా చూసుకోండి. ఇది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం. ఇక్కడ పరదాలు లేవు. కేవలం ప్రగతి మాత్రమే ఉంది. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అబద్ధాలు ప్రచారం చేసినా తెలంగాణను ప్రపంచ పటంలో నంబర్ వన్ పారిశ్రామిక రాష్ట్రంగా నిలబెడతాం. ఇందులో రాజీ పడబోం’ అని శ్రీధర్ బాబు తేల్చిచెప్పారు.
