ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోందని వెల్లడి
జూబ్లీహిల్స్ (Jubileehills) నియోజకవర్గంలోని యూసఫ్‌గూడ డివిజన్ శ్రీకృష్ణ నగర్, లక్ష్మీనరసింహ నగర్‌లలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అభ్యర్థి నవీన్ యాదవ్(Naveen Yadav)కు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ తదితర ముఖ్య నేతలు డోర్ టూ డోర్ ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్ళి నవీన్ యాదవ్‌ను ఆశీర్వదించి గెలిపించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. మహిళలు, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. తాము కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉన్నామని స్థానికులు చెప్పారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యాంశాలు.. ప్రజాపాలన ప్రభుత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(Free Bus), 200 యూనిట్ల ఉచిత విద్యుత్(Free Current), 500కి గ్యాస్, సున్నా వడ్డీ రుణాలు, సన్న బియ్యం పంపిణీ, నూతన రేషన్ కార్డుల (Ration Cards) పంపిణీ, ఉద్యోగాల నియామకాలు, త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు ఇలా ఎన్నో పథకాలు అమలుచేస్తున్నామని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అధికార కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి చేతి గుర్తుకు ఓటు వేసి నవీన్ యాదవ్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపు తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. రెండు సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి కాంగ్రెస్ ను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 10 సంవత్సరాలుగా ఇక్కడి శాసన సభ్యుడు అభివృద్ధికి దూరంగా ఉన్నారని విమర్శించారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని పేర్కొన్నారు. 10 ఏళ్లలో ఒక్క అభివృద్ధి చేయలేదని, నియోజకవర్గంపై నిరంకుశంగా వ్యవహరించారని మంత్రి పొన్నం దుయ్యబట్టారు .
