- ప్రతి దేవాలయం దీపాలతో అలకరించాలి
- ఎండోమెంటు అధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశం
- రాష్ట్రంలోని అన్ని ఆలయాల ఈవోలతో వీడియో కాన్ఫరెన్స్
కార్తీక దీపోత్సవాన్ని కన్నుల పండగలా నిర్వహించాలని… రాష్ట్రంలోని ప్రతి దేవాలయం దీపాలతో అలకరించాలని ఎండోమెంటు ఉన్నతాధికారులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ఆదేశించారు. ఈ సంవత్సరం కార్తీక దీపోత్సవం 22.10.2025 నుండి 19.11.2025 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో ఎండోమెంటు ఉన్నతాధికారులు శైలజ రామయ్యర్, హరీష్, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంటు కమిషనర్లు, ఈవోలతో శనివారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల ఈవోలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ… కార్తీక మాసం హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదని గుర్తు చేశారు. ఈ కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం చాలా శుభప్రదంగా ఉంటుందని అన్నారు. సామూహిక కార్తీక దీపోత్సవం అంటే అందరూ కలిసి దేవాలయ ప్రాంగణములో దీపాలను వెలిగించి భక్తి భావంతో పూజలు చేయాలని గుర్తు చేశారు. గతంలో నిర్వహించినట్లుగా ఈ సంవత్సరం కూడా సామూహిక కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించుటకు దేవాదాయ శాఖ చేసే ఏర్పాట్లను మంత్రికి అధికారులు వివరించారు.
ప్రతిరోజు సామూహిక కార్తీక దీపోత్సవం సాయంత్రం 6.00 గంటల నుండి జరపాల్సి ఉంటుందని… ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు మట్టి ప్రమిదలు, వత్తులు, నూనెతో పాటుగా పసుపు కుంకుమ తాంబూలాలను మహిళా భక్తులకు అందచేస్తున్నట్టు వివరించారు. కార్తీక సోమవారం నాడు సామూహిక కార్తీక దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు పైన పేర్కొన్న వస్తువులతో పాటు కుంకుమ, పసుపు, ఆకులు, వక్కలు, ఏదైనా పండు, కనుము ప్రధాన దేవాలయలలో భక్తులకు ఇస్తున్నట్టు తెలిపారు. సామూహిక కార్తీక దీపోత్సవంలో భక్తులు దీపాలు ఒదలటానికి అవసరమైనచోట తాత్కాలిక వాటర్ పాండ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.
నదీ పరివాహక ప్రాంతాలలోని దేవాలయాలలో నది హారతి నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సంవత్సరం సామూహిక కార్తీక దీపోత్సవంలో భాగంగా భక్తుల కొరకై బ్రహ్మశ్రీ నాగఫణిశర్మ, శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గార్లచే ప్రముఖ దేవాలయములలో ప్రవచనాలతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని నివేదించారు. కాగా, ఎక్కడైతే ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారో… అక్కడ స్థానికంగా రెవెన్యూ, పోలీసు, ట్రాఫిక్ విభాగాల సాయంతో చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ ఆదేశించారు. మహిళలు, ఇతర భక్తులకు మంచి నీటి వసతి నిర్వహించాలన్నారు.
శానిటేషన్ వర్కర్స్ సేవలు వినియోగించుకోని ఆలయ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలన్నారు. గత సంవత్సరం బాగా చేశారని మంత్రి ఎండోమెంటు శాఖ ఉన్నతాధికారులు, ఈవోలకు కితాబు ఇచ్చారు. అయితే, చిన్న చిన్న ఇబ్బందులు జరిగాయని, ఈసారి అవి జరగకుండా చూసుకోవాలన్నారు. గత అనుభవాల ఆధారంగా ముందుకు వెళ్ళాలన్నారు. ఈ దఫా కుంకుమ అర్చన కార్యక్రమం మంచిగా నిర్వహించాలన్నారు. మహిళలకు ఇదొక సెంటిమెంటుంగా ఉంటుందని మంత్రి వివరించారు. అందుకే పసుపు, కుంకుమ నిర్వహణ ప్రతి టెంపుల్లో నిర్వహించాలన్నారు. తక్కువ టైం ఉన్నందున… అందరూ చాలా అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాలన్నారు.
మహిళలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. ఎక్కువ మంది హాజరు అయ్యేలా… ఎంత ఎక్కువ మంది వచ్చినా ఏర్పాటు సమగ్రంగా ఉండాలని… అందుకు తగిన ప్రచారం చేయాలని సూచన చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో నదీ హారతి నిర్వహించాలన్నారు. కార్తీక దీపం ఎప్పుడు ముట్టించాలో… కొన్ని సాంప్రదాయాలున్నాయని… వాటి ప్రకారం మందుకు వెళ్ళాలని సూచించారు. దీపాలు ముట్టించడంలో ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి టెంపుల్లో లైటింగ్ పక్కాగా ఉండాలన్నారు. ప్రవచనాలు చెప్పేటప్పుడు… కూడా ఏర్పాట్లు చూడాలన్నారు.
భజనమండలి, సాంప్రదాయ నాట్య మండలి సంఘాలను ఉపయోగించుకోవాలన్నారు. ఆధ్యాత్మిక కోణంలో ఈ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలన్నారు. టూరిజం డిపార్టుమెంటు సహకారంతో కల్చరల్ కార్యక్రమాలు ఘనంగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు కూడా ఏదో ఒక రోజు పాల్గొనే విధంగా ఆదేశాలు ఇవ్వాలని మంత్రి ఎండోమెంటు అధికారులను ఆదేశించారు. గత కంటే ఇంకా చాలా ఘనంగా చేయాలని సూచించారు. వయనాలు ఇచ్చి కార్యక్రమాన్ని నిర్వర్తించాలని సూచించారు. స్లోకాలను చిన్న చిన్న బుక్ లెట్ గా చేసి భక్తులకు ఇవ్వాలని సూచించారు.
దేవుడి ముందు కూర్చొని చదవడం… లేదా దైవచింతన చేసేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఏర్పాట్లపై ఈవోల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఏవైనా ఇబ్బంది ఉంటే… తమను సంప్రదించాలని మంత్రి సురేఖ సూచించారు. ఏర్పాట్ల సంబంధించిన అంశంలో జోగులాంబ టెంపుల్ ఈవో దీప్తీ చేసిన చర్యలకు మంత్రి సురేఖ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఎండోమెంటు ప్రిన్స్ పల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరెక్టర్ హరీష్, అడిషనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, సూపరిడెంట్ తదితరులు పాల్గొన్నారు.
