మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు
రైతుల పట్ల జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులంటే ఏమాత్రం ప్రేమలేదని ధ్వజమెత్తారు. రైతాంగం అభివృద్ధిపై చిత్తశుద్ధిలేని జగన్ అబద్ధపు సానుభూతి నటన కనపరుస్తున్నారని మండిపడ్డారు. అమరావతి వేదికగా మీడియాతో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. జగన్ పాలనలో రైతులు కంటతడి పెట్టారని విమర్శించారు. జగన్‌కు పంట మద్దతు ధర విధానం తెలుసా అని ప్రశ్నించారు. రైతులకు అండగా నిలబడటం అంటే డ్రామాలు కాదని, క్షేత్రస్థాయిలో ఫలితాలు చూపించాలని సవాల్ విసిరారు. ఉల్లి, టమాటా రైతుల దీనస్థితి అంటూ జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.
రైతుల కష్టాలను నిజంగా పట్టించుకునే హృదయం జగన్‌కి ఉంటే.. తన పాలనలో రైతులను ఎందుకు దోపిడీకి గురి చేశారని ప్రశ్నించారు మంత్రి అచ్చెన్నాయుడు. రైతుల పట్ల కనీసం చిత్తశుద్ధి లేని జగన్ ఇప్పుడొచ్చి అబద్ధపు సానుభూతి నటన కనపరుస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉల్లి, టమాటా రైతుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు- చేసి, మద్దతు ధర చెల్లించిందని గుర్తు చేశారు. మద్దతు ధరలు, రైతుల గురించి మాట్లాడే కనీస అర్హత జగన్‌కు లేదని ఫైర్ అయ్యారు. రైతులకు అండగా నిలబడటం అంటే డ్రామాలు కాదని.. క్షేత్ర స్థాయిలో ఫలితాలు చూపించడమేనని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.