ESCIలో మైనింగ్‌పై 3 రోజుల జాతీయ సదస్సులో వక్తలు
ఈ విశాల విశ్వంలో అపార ఖనిజ (Mineral) సంపద ఉండటం ప్రకృతి (Nature) ఇచ్చిన వరప్రసాదమని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హరిసర్వోత్తమన్ అన్నారు. గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ESCI)లో జరుగుతున్న 3 రోజుల మైనింగ్ జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. “ఆపరేషనల్ ఎక్స్‌లెన్స్ ఇన్ మైన్స్ త్రూ ఇన్నోవేటివ్ టెక్నాలజీ” పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం రేపటి (22వ తేదీ) వరకు కొనసాగుతుంది. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న పరిశ్రమల రంగానికి ఖనిజాలు మూల సంపద అని చెప్పారు. గుండు పిన్ను (Pin) నుంచి రాకెట్ (Rocket) ప్రయోగాల వరకు ఖనిజ సంపద అవసరమని తెలిపారు.
ప్రపంచ పోటీని ఎదుర్కోవాలంటే..
ప్రపంచ పోటీని ఎదుర్కోవాలంటే మైనింగ్ రంగంలో ఇంకా ప్రపంచ స్థాయి టెక్నాలజీలు(Technology), ఆవిష్కరణలు అవసరమని పేర్కొన్నారు. ఆపరేషనల్ ఎక్స్‌లెన్స్ ద్వారా వృథా తగ్గి ఉత్పాదకత (Productivity), కార్మికుల భద్రత పెరుగుతుందని చెప్పారు. గౌరవ అతిథిగా హాజరైన ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. మైనింగ్ రంగం ప్రపంచవ్యాప్తంగా ఆటోమేషన్, డిజిటలైజేషన్, ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ వైపు వేగంగా పయనిస్తోందని తెలిపారు. ఆటోమేషన్, రోబోటిక్స్, రియల్ టైం మానిటరింగ్ సిస్టమ్స్, డేటా అనలిటిక్స్, ప్రిడిక్టివ్ మెయింటనెన్స్ తదితర ఆధునిక టెక్నాలజీల ద్వారా దేశ ఆర్థిక పురోగతిలో మైనింగ్ రంగం ప్రధాన పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.

ఇలాంటి సదస్సులతో ఎంతో ఉపయోగం
ఎన్ఐటీ సురత్కాల్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా పనిచేసిన డాక్టర్ డి.వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి జాతీయ వేదికలు ఇంజనీరింగ్ ప్రముఖులను ఒకే చోట కలుపుతాయని అన్నారు. అకడమిక్, పరిశ్రమలు, ప్రభుత్వ వర్గాలంతా ఆలోచనలను పంచుకునేందుకు ఈ తరహా కార్యక్రమాలు అవకాశం కల్పిస్తాయని తెలిపారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ జి.రామేశ్వర్ రావు మాట్లాడుతూ.. ఖనిజాలను పరిశ్రమలకు వెన్నెముకగా అభివర్ణించారు. మైనింగ్ ప్రొఫెషనల్స్, ఇంజనీర్లు, భద్రతాధికారులు, పాలసీ మేకర్లు పాల్గొంటున్న ఈ సదస్సులో స్మార్ట్ మైనింగ్ పరిష్కారాల అమలు, ప్రమాదాల తగ్గింపు, వనరుల నిర్వహణ, ఆప్టిమైజేషన్ తదితర అంశాలపై చర్చిస్తున్నారు.
ప్రపంచ స్థాయికి మన మైనింగ్
ESCI మైనింగ్ హెడ్ కె.జె.అమర్‌నాథ్ మాట్లాడుతూ.. దేశ మైనింగ్ రంగాన్ని గ్లోబల్ స్టాండర్డ్స్ వైపు తీసుకెళ్లే ఆలోచనతో ఇలాంటి సదస్సుల ద్వారా ఒక రోడ్‌మ్యాప్ తయారుచేస్తున్నామని వెల్లడించారు. ఈ జాతీయ సదస్సుకు సంబంధించిన అంశాలపై ప్రముఖుల పరిశోధనాత్మక వ్యాసాలతో సావనీర్ రూపొందించామని, ఇక్కడి డిబేట్స్ ప్రతిపాదనలను కోల్ ఇండియా, నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్, సింగరేణితోపాటు ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ పరిశ్రమలకు పంపిస్తామని అన్నారు. సదస్సులో కోల్ ఇండియా, సింగరేణి, ఎన్‌టీపీసీ, వెన్సార్ కన్‌స్ట్రక్షన్, జీటీఎస్ మైనింగ్ కన్సల్టెన్సీ ప్రతినిధులతోపాటు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. మైనింగ్ ఫ్యాకల్టీ ఎల్.కృష్ణ, ప్రోగ్రాం ఆఫీసర్ కె.సత్యలక్ష్మి సదస్సు నిర్వహణను పర్యవేక్షించారు.
