ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) స్పందించారు. బాలకృష్ణ తనపై చేసిన వ్యాఖ్యలను టీవీలో చూశానని చెప్పారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తాను ఎందుకు, ఎలా సమావేశం అయ్యారనే విషయాలపై స్పష్టత ఇచ్చారు.
పలువురు నటీనటులు, నిర్మాతలు, దర్శకులు టికెట్ల ధరల సమస్యపై అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సంప్రదింపులు జరపాలని కోరడంతో, చొరవ తీసుకుని ప్రభుత్వంతో చర్చించాలని నిర్ణయించుకున్నట్లు చిరంజీవి(Megastar Chiranjeevi) వివరించారు. నాటి మంత్రి పేర్ని నాని ఆహ్వానంతో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసానని చెప్పారు. లంచ్ చేస్తూ జగన్ కు సినిమా పరిశ్రమల సమస్యల గురించి వివరించానని స్పష్టం చేసారు. తన చొరవ వల్లే గత ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అంగీకరించింది అని అన్నారు. ఈ నిర్ణయం వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు ఎంతో లాభపడ్డారని , తన సినిమా ‘వాల్తేరు వీరయ్య’, అలాగే బాలకృష్ణ సినిమా ‘వీరసింహారెడ్డి’ వంటి పెద్ద చిత్రాలకు మంచి కలెక్షన్లు రావడానికి ఇది చాలా ఉపయోగపడిందని ఆయన అన్నారు.