విశాఖ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు ప్రతినిధి బృందాన్ని పంపాల్సిందిగా ఆహ్వానం
ఆస్ట్రేలియా(సిడ్నీ): న్యూ సౌత్ వేల్స్ (NSW) ప్రీమియర్ క్రిస్ మిన్స్‌తో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టార్టప్‌లు, గ్రీన్ టెక్నాలజీల్లో సహకారాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్–న్యూ సౌత్ వేల్స్ ఇన్నోవేషన్ & ఇండస్ట్రీ భాగస్వామ్యాన్ని ఏర్పాటుచేయాల్సిందిగా కోరారు.
‘ఇన్నోవేషన్, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో న్యూ సౌత్ వేల్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య ఒప్పందాన్ని(MoU)సులభతరం చేయండి. న్యూ సౌత్ వేల్స్ ఇన్నోవేషన్ క్లస్టర్లను ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఇన్నోవేషన్ & స్టార్టప్ హబ్‌లతో(విశాఖపట్నం, అమరావతి, అనంతపురం) అనుసంధానించే ఎక్స్చేంజి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వండి. రెనివబుల్ ఎనర్జీ, మెడిటెక్, అగ్రిటెక్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పనిచేస్తున్న న్యూ సౌత్ వేల్స్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమ కారిడార్లలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సాహించండి. క్లీన్ టెక్, కృత్రిమ మేధస్సు(AI), సస్టైనబుల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పరిశోధన & అభివృద్ధి (R&D) కోసం న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయాలు, ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థల మధ్య సహకారానికి ప్రోత్సాహం అందించండి.
విశాఖపట్నంలో జరగనున్న పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2025కి న్యూ సౌత్ వేల్స్ మంత్రి నేతృత్వంలో వ్యాపార ప్రతినిధి బృందాన్ని ఆంధ్రప్రదేశ్‌కు పంపించండి. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డును(APEDB) న్యూ సౌత్ వేల్స్ ఆసియా-పసిఫిక్ వాణిజ్య కార్యక్రమాల్లో చేర్చేందుకు సహకారం అందించండి. న్యూ సౌత్ వేల్స్ ఇన్నోవేషన్ ఏజెన్సీలు, ఆంధ్రప్రదేశ్‌లోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ల ద్వారా సంయుక్త ఇంక్యుబేషన్ కార్యక్రమాలను అన్వేషించాలి’ అని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో ఎన్ఎస్‌డబ్లు ఇన్నోవేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి అనౌలాక్ చాంథివోంగ్ కూడా పాల్గొన్నారు.
