ఎస్సీ కార్పొరేషన్‌లో అంబేద్కర్ చిత్రపటానికి జరిగిన అవమానానికి ప్రభుత్వం సీరియస్.. బదిలీ వేటు.
ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి అడ్లూరి ప్రెజర్
కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం సైతం ఎండీ చర్యలపై అసహనం
నిజాయితీ మాటున భారీ నిర్లక్ష్యానికి గురైన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్(Sc Corporation)లో నెలకొన్న వివాదాలకు ప్రభుత్వం (Government) చివరకి క్లైమాక్స్ ఇచ్చినట్టైంది. ఈ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్(Ambedkar) చిత్రపటానికి అవమానం జరిగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించి, ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (Md) క్షితిజను బదిలీ చేసినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. “ఆదాబ్ ఎఫెక్ట్”(Aadab Effect)గా మారిన ఈ పరిణామం అధికార వర్గాల్లో కలకలం రేపింది. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటాన్ని గౌరవించని ఘటనకు సంబంధించిన ఫిర్యాదులు ఎస్సీ వర్గాల నుంచి విస్తృతంగా వెల్లువెత్తడంతో ప్రభుత్వం దృష్టి సారించింది.
ఉప ముఖ్యమంత్రి, మంత్రుల ఒత్తిడి కీలకం..
ఈ వ్యవహారంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సీరియస్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. అంబేద్కర్ భావజాలాన్ని అవమానించేలా జరిగిన ఈ ఘటన క్షమించరాదని, కార్పొరేషన్‌లో సంస్కరణలు అవసరమని వారు ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేశారు.
చైర్మన్ ప్రీతం సైతం అసహనం..
కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం సైతం ఎండీ వ్యవహారశైలిపై ఎప్పటినుంచో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. చైర్మన్ అభిప్రాయాలను పక్కనపెట్టి ఇక్కడి అధికారులు కొద్దిమంది ఎస్సీ కార్పొరేషన్‌లో విచ్చలవిడి నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఎం.డిపై గత కొన్ని నెలలుగా వినిపిస్తున్నాయి.
నిజాయితీ మాటున నిర్లక్ష్యం!
కార్పొరేషన్‌లో “నిజాయితీ” ‘పేరుతో ఫైల్స్ నిలిపివేత, ప్రాజెక్టులు ఆలస్యం, పేద ఎస్సీ లబ్దిదారులకు రుణాలు అందకపోవడం, దళిత నిరుద్యోగులకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల నిలిపివేత, బిల్లులను తొక్కిపెట్టడం, బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బి.ఆర్.ఓ)లను ప్రభుత్వానికి పంపకుండా దళిత ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందకుండా దాచిపెట్టే కొన్ని ప్రయత్నాలు ఇక్కడ జరిగినట్లు విమర్శలు వినబడుతున్నాయి. ప్రమోషన్ల ప్రక్రియలో అవకతవకలు, ఇష్టారాజ్యంగా అధికారుల వాహనాలు వాడకం, దళితుల సొమ్ముతో అధికారులు చేస్తున్న దర్పాలు వంటి అంశాలు విస్తృతంగా విమర్శలకు గురయ్యాయి. ఆర్థిక వనరులు ఉన్నా అవి లక్షిత వర్గాలకు చేరకపోవడం వల్ల ప్రభుత్వ ప్రతిష్టకు నష్టం జరిగిందని అధికారులు అంగీకరిస్తున్నారు.
అంబేద్కర్ చిత్రపటానికి అవమానం – తుది ముద్ర
అంబేద్కర్ చిత్రపటానికి అవమానం జరిగిన ఘటన ఆగ్రహానికి నాంది అయింది. సంఘాలు, పౌర సంఘాలు, పత్రికా వర్గాల నిరసనలతో తీవ్రరూపం దాల్చింది. ఈ కేసులో దళిత మానవ హక్కుల వేదిక (డి.హెచ్.ఆర్.ఎఫ్) రాష్ట్ర కార్యదర్శి మహేష్ తమ్మడి నేషనల్ ఎస్సీ కమిషన్‌లో ఫిర్యాదులు చేశారు. క్షితి బదిలీ జరిగే వరకు ప్రభుత్వంపై పట్టుబట్టి ఇలాంటి సంఘాలు వెనుకడుగు వేయకుండా దళిత జాతి అభ్యున్నతి, ఆత్మగౌరవ కోసం పనిచేయడం గమనించదగ్గ విషయం.
