- రామచంద్ర రావు సమక్షంలో కాషాయకండువా కప్పుకున్న నాయకులు..
గురువారం రోజు బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సమక్షంలో, బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, బిజెపి కూకట్‌పల్లి ఇన్‌చార్జ్ మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో పెద్దఎత్తున యువతతో పాటు వివిధ పార్టీల కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి బిజెపి రథసారధి ఎన్. రాంచందర్ రావు గారు పార్టీ కండువా కప్పి సాదరంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, బిజెపి కూకట్‌పల్లి ఇన్‌చార్జ్ మాధవరాం కాంతారావు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందే, బిజెపి భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్, సీనియర్ నాయకులు శ్రీధర్, పార్టీ సీనియర్ నాయకులు పోరెడ్డి కిషోర్, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యంగా పార్టీలో చేరిన వారిలో, బీఆర్ఎస్ నుంచి గతంలో కార్పొరేటర్‌గా పోటీ చేసిన లంకల రమేశ్ రెడ్డి, విజేశ్వర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, అలాగే యూత్ కాంగ్రెస్ నాయకులు శివశoకర్, వేణుగోపాల్ రెడ్డి, శివప్రసాద్, నరేష్ కుమార్ తో పాటు న్యాయవాది శివకుమార్, వారి బృందం గురువారం రోజు భారతీయ జనతా పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు పెద్దఎత్తున భారతీయ జనతా పార్టీ కుటుంబంలో చేరిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. వివిధ పార్టీల నుంచి, ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో బిజెపిలో చేరడం.. పార్టీపై మరింత పెరుగుతున్న ప్రజా విశ్వాసానికి నిదర్శనం. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో జరుగుతున్న సుపరిపాలనను చూసి, దేశం కోసం, ధర్మం కోసం, మన సంస్కృతి, ఐక్యత, అఖండత కోసం బిజెపి మాత్రమే భారతదేశాన్ని రక్షించగలదనే నమ్మకంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.
అది దేశానికి గర్వకారణమైన ఒక ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఈవెంట్. అయితే… ‘ఏ 1 ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ వంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కార్యక్రమం ఢిల్లీలో జరుగుతున్న సమయంలో, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి అర్ధనగ్నంగా నిరసన తెలపడం అత్యంత సిగ్గుమాలిన చర్య. ఇది దేశ ప్రతిష్ఠను ప్రపంచం ముందు దిగజార్చే పని. అది దేశానికి గర్వకారణమైన ఒక ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఈవెంట్. అయితే ఆ ఏఐ సమ్మిట్‌ను కాంగ్రెస్ పార్టీకి అబ్యూస్ ఇండియా, అగైనెస్ట్ ఇండియా, యాంటీ ఇండియా కార్యక్రమంగా మార్చుకుంది.
యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన ఆ నిరసన యాదృచ్ఛికం కాదు. అది పూర్తిగా రాహుల్ గాంధీ చేయించిన సిగ్గుమాలిన చర్య. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇండీ అలయెన్స్ కూటమి భాగస్వామ్య పార్టీలు సైతం బహిరంగంగానే వ్యతిరేకించాయి. రాజకీయంగా విభేదాలు ఉండవచ్చు. కానీ దేశ గౌరవాన్ని దెబ్బతీసేలా, అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను అవమానించేలా ప్రవర్తించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.
ఇప్పటికైనా రాహుల్ గాంధీ దేశ యువతకు, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కుహనా లౌకికవాదులు, కుహనా మేధావులు.. అంటే అర్బన్ నక్సల్స్.. దేశ వ్యతిరేక శక్తులుగా మారి, విద్యార్థులను దేశానికి వ్యతిరేకంగా పనిచేసేలా తయారు చేస్తున్నారు. విశ్వవిద్యాలయాలను రాజకీయ అడ్డాలుగా మార్చుతున్నారు. ‘ఆపరేషన్ కగార్’ తో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నక్సలైట్లు లొంగిపోతున్నారు. తెలంగాణలో కూడా టాప్ మోస్ట్ మావోయిస్టు నేతలు సరెండర్ అయ్యారు. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు లభిస్తున్న స్పష్టమైన ఫలితం.
గత 45 ఏండ్లుగా మావోయిస్టులు ప్రజలకు చేసింది హింస మాత్రమే. పోలీస్ ఇన్ఫార్మర్ల పేరుతో నిరపరాధ ప్రజలను హత్య చేయడం, బిజెపి నాయకులపై దాడులు చేయడం తప్ప వారు ప్రజల కోసం చేసింది ఏమీ లేదు. వారి ఉద్యమం భూస్వాములను కాపాడడానికే పరిమితమైంది తప్ప, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కాదు. భారత ప్రభుత్వం 2026 మార్చి 31లోపు దేశాన్ని నక్సలిజం నుంచి పూర్తిగా విముక్తం చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది.
వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకున్న ఆపరేషన్ కగార్ వంటి చర్యలతో సత్ఫలితాలు ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో మావోయిస్టులు తుపాకులు వదిలి లొంగిపోతున్నారు. జాతీయ భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘ప్రహార్’ పేరిట దేశంలో తొలి సమగ్ర ఉగ్రవాద నిరోధక విధానాన్ని తీసుకొచ్చింది. ఉగ్రవాద హింసను నిరోధించేందుకు, దేశీయ-విదేశీ ముప్పులను ఎదుర్కొనేందుకు ఇది కీలక అడుగు.
కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా అంతమవుతోంది. చైనా లాంటి దేశాల్లోనే దాని ప్రభావం తగ్గిపోతోంది. రష్యా చీలిపోయింది. ఈ వాస్తవాన్ని అర్బన్ నక్సల్స్ గుర్తించాలి. విశ్వవిద్యాలయాల్లో పిల్లలకు చదువు చెప్పాలి గానీ, దేశద్రోహులుగా తయారుచేయకూడదు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయొద్దని హెచ్చరిస్తున్నాను. తెలంగాణను కూడా మావోయిస్ట్ ముక్త్ గా చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా పూర్తి కట్టుబాటుతో పనిచేస్తోంది.
