- ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, చైర్మన్ పాలాయి శ్రీనివాస్
ఎట్టకేలకు నర్సంపేట మార్కెట్ కు మార్క్ ఫెడ్ సంస్థ కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేసింది. ఇటీవల నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మార్క్ఫెడ్ అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతిపత్రం ఇవ్వడంతో సెంటర్ మంజూరు అయింది.
దీంతో వరంగల్ జిల్లాలోని నర్సంపేట మార్కెట్ యార్డ్‌లో తెలంగాణ మార్క్‌ఫెడ్, నర్సంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…
రైతులు పండించిన మొక్కజొన్నకు సరైన ధర లభించేలా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ పంటను విక్రయించుకునేలా అన్ని సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించడంతో పాటు తేమ శాతం, నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. మొక్కజొన్నలో తేమ శాతం (మాయిశ్చర్) 14 శాతానికి మించకుండా ఉండాలని తెలిపారు.
క్వింటాల్‌కు రూ. 2400 ధర ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ పేర్కొన్నారు.
రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించాలని సూచించారు. రైతులకు సమయానికి చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
మార్కెట్ యార్డ్‌లో తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు, షెడ్లు వంటి మౌలిక వసతులు కల్పించి రైతులకు అనుకూల వాతావరణం ఏర్పాటు చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, డిసిఓ నీరజ, డిఎం మార్క్ ఫెడ్ రంజిత్ రెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ రవిచంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
