2014 నుంచి తమ ప్రభుత్వం చేస్తున్న కృషి వల్ల దేశంలోని మావోయిస్టుల ప్రభావిత జిల్లాల సంఖ్య 125 నుంచి 11కు తగ్గిందని ప్రధాని మోదీ అన్నారు. గత మూడేళ్లలో 303 మంది మావోయిస్టులు లొంగిపోయారని, 303 రైఫిళ్లు, భారీ స్థాయిలో మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మావోయిస్టుల దాడులు, వారి సానుభూతిపరుల వల్ల ఇప్పటిదాక ఎంతో నష్టపోయిన ప్రాంతాలు 60-70 ఏళ్లలో తొలిసారి దీపావళి పండుగను జరుపుకుంటున్నాయని తెలిపారు. మావోయిస్టుల హింసకు త్వరలో ముగింపు పడనుందని, ఇది మోదీ గ్యారంటీ అని పేర్కొన్నారు. ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా ఒకటని, ద్రవ్యోల్బణం రేటు 2 శాతానికి తక్కువగా, జీడీపీ వృద్ధి 7 శాతానికి పైగా ఉందని వెల్లడించారు. గత మూడేళ్లలో సరాసరి వృద్ధిరేటు 7.8 శాతంగా ఉందని తెలిపారు.
