Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeసాహిత్యంఅణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా ఫూలే

అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా ఫూలే

అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడి మహిళోద్ధరణకు కృషి చేసిన మహనీయుడు, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి(ఏప్రిల్ 11) సందర్భంగా వారిని, వారి సేవలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడెైన జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే మహారాష్ట్ర లోని సతారా జిల్లాలో, మాలి కులానికి చెందిన కుటుంబంలో 1827 ఏప్రిల్‌ 11న జన్మించాడు.మొదట్లో కూరగాయలు అమ్మే వారి కుటుంబం కాలక్రమేణా పీష్వాల పరిపాలనాకాలంలో పూల వ్యాపారం చేయడంవల్ల వారి ఇంటి పేరు ఫూలేగా మార్పు చెందింది. చిన్నప్పటి నుండి ఆయనకు పుస్తక పఠనం అంటే చాలా ఇష్టం. శివాజి మహరాజ్, జార్జ్‌ వాషింగ్టన్‌ల జీవితచరిత్రలు ఆయనను ప్రభావితం చేయడంవల్ల దేశభక్తి, నాయకత్వ లక్షణాలు అలవాటయ్యాయి. థామస్‌ రచించిన ‘మానవ హక్కులు’ పుస్తకం అతని ఆలోచనలను ప్రభావితం చేసింది. అమెరికా స్వాతంత్య్రపోరాట చరిత్ర అతనిని ఎంతో ప్రభావితం చేయడమే కాకుండా మానవత్వపు విలువలెైన స్వేచ్ఛ, సమానత్వం గురించి లోతుగా ఆలోచింపచేసింది. 1848లో జరిగిన తన బ్రాహ్మణ స్నేహితుడి వివాహంలో ఫూలే, అవమానానికి గురి అవడం వల్ల ఆ క్షణం నుండి కుల వివక్షతపై పోరాడాలని నిశ్చయించుకున్నాడు. జ్ఞాన సంపదకు అందరికీ అవకాశం ఇవ్వక పోవడానికి ఆయన అభ్యంతరం తెలిపాడు. సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని భావించిన ఫూలే స్త్రీలు విద్యావంతులు కావాలని అనుకున్నాడు.. ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రి ఫూలేను విద్యావంతురాలును చేశాడు. 1848 ఆగస్టులో బాలికలకు పాఠశాల స్థాపించాడు. ఈ పాఠశాలలో అన్ని కులాలకు ప్రవేశం కల్పించాడు. జోతిరావ్‌ఫూలే తనభార్య సావిత్రి సహాయంతో పిల్లలకు పాఠాలు బోధించేలా చేశాడు. ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు సర్వసాధారణంగా జరిగేవి. ముసలివారికిచ్చి పెళ్ళి చేయడంవల్ల చిన్నతనంలోనే మహిళలు వితంతువులయ్యేవారు. వీరు మళ్ళీ వివాహం చేసుకోవడానికి సమాజం అంగీకరించేదికాదు. అందువల్ల వితంతు పునర్వివాహాల గురించి ఫూలే ప్రజల్లో చెైతన్యం తీసుకువచ్చాడు. స్వయంగా వితంతువులకు వివాహాలు జరిపించాడు. 1873 సంవత్సరంలో సత్య శోధక సమాజాన్ని స్థాపించాడు. ఆయన విగ్రహారాధనను ఖండించాడు. లింగవివక్షతను ఫూలే విమర్శించాడు. సమానత్వం, స్వేచ్ఛ, ఐకమత్యంతో కూడిన సమసమాజాన్ని ఆకాంక్షించాడు.వితంతు మహిళల, అనాథ శిశువుల కోసం 1853లో సేవాసదన్ ప్రారంభించాడు. సత్యశోధక్ సమాజ్ తరపున ప్రారంభించిన ‘దీనబంధు’ వారపత్రికలో రెైతులు, కార్మికుల సమస్యలు, బాధలు వివరించేవాడు. ఈయన రాసిన గులాంగిరి అనే పుస్తకంలో కుల వ్యవస్థ, బానిసత్వం మరియు సామాజిక అన్యాయం గురించి లోతుగా వివరించాడు. అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలన, మహిళోద్ధరణకు విశేష కృషి చేసిన మహాత్మ జ్యోతిభా ఫూలే 1890లో మరణించారు.

  • బొల్లం బాలకృష్ణ, కరీంనగర్, 9989735216
RELATED ARTICLES
- Advertisment -

Latest News