నిఖార్సైన జర్నలిజ(Journalism)మే శ్వాసగా జీవించిన సీనియర్ జర్నలిస్ట్, ప్రతిపక్షం(Pratipaksham) దినపత్రిక వ్యవస్థాపకుడు(Founder), సంపాదకుడు (Editor) మహమ్మద్ ఫజల్ రహమాన్(Muhammad Fazal Rahman) క్యాన్సర్ వ్యాధి(Cancer Disease)కి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి(Nims Hospital)లో చికిత్స పొందుతూ మరణించడం విషాదకరం. ఆయన మరణంతో పత్రికా రంగం ఒక సమర్థవంతమైన సంపాదకుణ్ని కోల్పోయింది. మహమ్మద్ ఫజల్ రహమాన్ పోరాటాల పురిటిగడ్డ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారు. ఆయన ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండల పరిధిలోని అంతకపేట గ్రామంలో 1960లో జన్మించారు.
చిన్నప్పటి నుంచి సమాజాన్ని సునిశితంగా పరిశీలించారు. 1980లో ఆంధ్రప్రభ దిన పత్రికలో జర్నలిస్ట్‌గా ప్రజా అక్షర ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనతికాలంలోనే అనేక ప్రజా సమస్యలతోపాటు జర్నలిస్టుల సమస్యలను అక్షరీకరించి వెలుగులోకి తీసుకొచ్చి వాటి పరిష్కారాల దిశగా కృషి చేశారు. సామాజిక వెలుగుల ప్రసరణలతో ఆ క్రమంలోనే ఆయన 1990లో హుస్నాబాద్ పబ్లిక్ స్కూల్‌ని ప్రారంభించి ఎంతో మంది భావి పౌరులను తీర్చిదిద్దారు. మహమ్మద్ ఫజల్ రహమాన్ క్రమానుగతంగా ప్రజాతంత్ర, జీవగడ్డ, ఆంధ్రజ్యోతి, దిశ, ముద్ర మొదలైన దిన పత్రికల్లో వివిధ హోదాల్లో నాలుగున్నర దశాబ్దాలకు పైగా పనిచేశారు.
సమర్థుడైన పాత్రికేయుడిగా పేరొందారు. జర్నలిజంలో విశేష నైపుణ్యాన్ని పొందారు. సొంతగా ప్రతిపక్షం దిన పత్రికను ప్రారంభించి సంపాదకుడిగా కొనసాగారు. జర్నలిజంపైన ఉన్న మక్కువ, అంకితభావం మూలంగా ఆయన గొప్ప సంపాదకుడిగా రాణించారు. తెలుగు నేలలో అనేక దిన పత్రికలు ఉన్నా మరొక కొత్త దిన పత్రిక అవసరమా? అని కొందరు పనిగట్టుకొని విమర్శలు చేసినా మహమ్మద్ ఫజల్ రహమాన్ పట్టించుకోలేదు. ప్రతిపక్షం దిన పత్రికను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లారు. అనతి కాలంలోనే అశేష పాఠకుల ఆదరాభిమానాలను చూరగొన్నారు.
జర్నలిజంలో సరికొత్త శైలిని అనుసరించిన ఘనత ఆయనకే చెందుతుంది. ప్రజలే కేంద్రంగా, ప్రజా సమస్యలే పరిష్కారంగా సమర్థవంతంగా సంపాదకీయాలు రాశారు. ఇంటర్నెట్ యుగంలోనూ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో అందుకు అనుగుణంగా ప్రతిపక్షం దినపత్రికను నిత్య నూతనంగా తీర్చిదిద్దడంలో విశేష కృషి చేశారు. హుస్నాబాద్‌లో ప్రెస్ క్లబ్ ఆవిర్భావంలోనూ, హుస్నాబాద్ జర్నలిస్టుల సంఘం నిర్మాణంలో మహమ్మద్ ఫజల్ రహమాన్ క్రియాశీలక పాత్ర పోషించారు.
హుస్నాబాద్ యూత్ అసోసియేషన్, స్ఫూర్తి అసోసియేషన్‌లో యాక్టివ్‌గా పాల్గొని ఎందరికో మార్గదర్శిగా నిలిచారు. ఎన్నో అవరోధాలు, కష్టాలు ఎదురైనా మహమ్మద్ ఫజల్ రహమాన్ వాటన్నింటిని అధిగమించి, నిబద్ధతతో పురోగమించి నిజాయితీ గల జర్నలిస్ట్‌గా పేరు ప్రఖ్యాతులు గడించారు. భావి జర్నలిస్టులు మహమ్మద్ ఫజల్ రహమాన్ పాత్రికేయ కృషిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన జీవితం నిజాయితీకి నిలువుటద్దం. ఉపాధ్యాయుడుగా, రచయితగా, సంపాదకుడిగా భిన్న రంగాల్లో తనదైన శైలిలో విలక్షణ ప్రావీణ్యాన్ని(Versatile) కనబరచి అకాల మరణంతో భౌతికంగా దూరమయ్యారు.
- జె.జె.సి.పి.బాబూరావు
