Monday, October 27, 2025
ePaper
HomeతెలంగాణLiquor Shop | 60 వేల దరఖాస్తులు మాత్రమే..

Liquor Shop | 60 వేల దరఖాస్తులు మాత్రమే..

  • భారీగా పడిపోయిన మద్యం షాపుల దరఖాస్తులు సంఖ్య..
  • గతేడాది లక్షా 32వేలు..
  • ఇప్పటివరకు ఒక్కో షాపునకు సగటున 23 దరఖాస్తులు
  • అప్లికేషన్ ఫీజుగా సర్కారుకు 18 వందల కోట్లు, గతేడాది 2,645 .. 3 235 లాటరీ పద్ధతిలో కేటాయింపు

సెప్టెంబర్ 25న తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణకోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి విదితమే.. 2025 డిసెంబరు 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు రెండేళ్ల వ్యవధికి సంబంధించి మద్యం దుకాణాల అనుమతుల కోసం మార్గదర్శకాలను ఆబ్కారీ శాఖ జారీ చేసింది. అక్టోబరు 18 వరకు దరఖాస్తులకు అవకాశం ఇచ్చారు. శనివారం సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు 60 వేల దరఖాస్తులు వచ్చాయి. ప్రారంభం నుంచి మందకొడిగా దరఖాస్తుల పర్వం కొనసాగింది. ఇక శుక్రవారం (అక్టోబర్ 17) ఒక్క రోజే 25 వేల దరఖాస్తులు వచ్చాయి. శనివారం మరో పది వేల మంది వైన్స్ షాపుల కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల చొప్పున నాన్ రిఫండెబుల్ ఫీజును వసూలు చేసింది.

దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి 18 వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన మద్యం టెండర్లకు లక్షా 32 వేల దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా 2,645 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సారి రూ.3 వేల కోట్ల అప్లికేషన్ ఫీజు వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2023లో అసెంబ్లీ, 2024లో పార్లమెంటు ఎన్నికలు ఉండటంతో భారీగా దరఖాస్తులు వచ్చాయనే వాదన ఉంది. దీనికి తోడు అప్లికేషన్ ఫీజు కూడా రూ.రెండు లక్షలుగా ఉండటం కూడా కారణమంటున్నారు. ఈ సారి దానిని రూ.3 లక్షలకు పెంచారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అయినప్పటికీ దర ఖాస్తుల సంఖ్య బాగా పడిపోవడం గమనార్హం. అక్టోబర్16 వరకు 20 రోజుల్లో సుమారు 25 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.

శుక్రవారం రాత్రివరకు మరో 25 వేల దరఖాస్తులు రావడంతో మొత్తం దరఖాస్తులు 50వేల వరకు చేరాయి. శనివారం మరో పది వేల దరఖాస్తులు వచ్చాయి. ఇదిలా ఉండగా హైదరాబాద్ లోని ఒక మద్యం దుకాణానికి కేవలం ఒకే ఒక్క దరఖాస్తు వచ్చినట్టు తెలిసింది. రిజర్వుడ్ దుకాణాలకూ గతంతో పోల్చితే దరఖాస్తులు తగ్గినట్టు సమాచారం. వ్యాపారులు సిండికేట్లుగా మారి కొన్నే దరఖాస్తులు వేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈనెల 23న లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయిస్తారు. ప్రభుత్వం మొత్తం 2,620 మద్యం దుకాణాలకుగాను.. 15శాతం దుకాణాలను గౌడ సామాజిక వర్గానికి, 10శాతం ఎస్సీలకు, 5శాతం ఎస్టీలకు రిజర్వు చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న 2,620 దుకాణాల గడువు నవంబరు 30తో ముగుస్తుంది. డిసెంబరు 1 నుంచి కొత్త దుకాణాల నిర్వహణ మొదలవుతుంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News