- కాంగ్రెస్కు ఓటేస్తే సిరిసిల్ల జిల్లాను తీసేస్తారు
- నాపై కోపంతో బతుకమ్మ చీరలు బంద్ చేశారు
- నేతన్నల బతుకుతెరువుపై దెబ్బ కొట్టారు.
- మరోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేస్తేనే తగిన అభివృద్ధి
- మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించండి
- సిరిసిల్ల ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ వెల్లడి
‘ఓవైపు అభివృద్ధి చేసిన బీఆర్ఎస్, మరోవైపు ఇచ్చిన హామీలు మరచిన కాంగ్రెస్, ఎప్పుడో ఒకసారి దేవుని పేరు చెప్పుకుని వచ్చే బీజేపీ పార్టీలు ఉన్నాయి. ఎవరికి ఓటు వేయ్యాలో మీరే నిర్ణయించుకోండి’ -కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు. గురువారం సిరిసిల్ల పట్టణం బివైనగర్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే సిరిసిల్ల జిల్లాను తీసేస్తారని ఆయన విమర్శించారు. ‘ఓవైపు అభివృద్ధి చేసిన బీఆర్ఎస్, మరోవైపు ఇచ్చిన హామీలు మరచిన కాంగ్రెస్, ఎప్పుడో ఒకసారి దేవుని పేరు చెప్పుకుని వచ్చే బీజేపీ పార్టీలు ఉన్నాయి.
ఎవరికి ఓటు వేయ్యాలో మీరే నిర్ణయించుకోవాలి’ అని కేటీఆర్ అన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పోటీ గత పదేళ్లలో ప్రజల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన బీఆర్ఎస్ పార్టీకి, గడిచిన రెండేళ్లలో ఉన్న సంక్షేమ పథకాలను ఎత్తివేసిన కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్నదని కేటీఆర్ చెప్పారు. మరోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేస్తేనే తగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభమవుతాయని, ఆ దిశగా ఈ మున్సిపల్ ఎన్నికలతోనే కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేసుకునే కార్యక్రమం ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పార్టీని గనుక ఈ మున్సిపల్ ఎన్నికల్లో నిలదీయకుంటే, ఇచ్చిన హామీల మోసంపైన ప్రశ్నించకుంటే, మరో మూడు సంవత్సరాల దాకా అంటే శాసనసభ ఎన్నికల వరకు ప్రజలకి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే అధికారం, అవకాశం రాదని చెప్పారు. ఇప్పుడు గనుక ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసేలా సురుకు పెట్టకుంటే కాంగ్రెస్ పార్టీ తన మోసాలను కొనసాగిస్తుందని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు తులం బంగారం ఇస్తానన్నారు.
కానీ, వాళ్లు ఉన్న పుస్తెలు ఎత్తుకు పోయే రకం. నాపై కోపంతో బతుకమ్మ చీరలు బంద్ చేశారు. నేతన్నల బతుకుదెరువుపై దెబ్బ కొట్టారు. దేవుని గుడి వద్ద ఉండి అడుక్కుతినేవారిలాగా, దేవుని పేరుతో ఓట్టడుక్కోవడానికి మాత్రమే బీజేపీ వారే వస్తారు. అలానే కాంగ్రెస్ కు ఓటేస్తే సిరిసిల్ల జిల్లాను తీసేస్తారు. తులం బంగారం వచ్చిన వారు కాంగ్రెస్ కు ఓటెయ్యండి, రానివారు బీఆర్ఎస్కు ఓటెయ్యండి. సిరిసిల్ల బతుకుదెరువు లేకుండా చేసినోడికి, గట్టి బుద్ది చెప్పాలి’ అని కేటీఆర్ తెలిపారు.
ఈ సందర్భంగా స్థానిక వార్డుల ప్రజలను, పట్టణ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇప్పటికే అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. మున్సిపల్ ఎన్నికల కోసం మరోసారి అబద్దాలు చెబతోందని విమర్శించారు. కాంగ్రెస్ మాటలు నమ్మి ఓటు వేస్తే మరోసారి మోసపోయినట్లు అవుతుందని చెప్పారు. కేటీఆర్ ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
‘మున్సిపల్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుబంధు వేస్తానని చెబుతున్నారు. కానీ ఇప్పటికీ ఎన్ని పంట కాలాలు గడిచాయి..? ఎన్నిసార్లు రైతుబంధు వేసిండో చెప్పాలి. రైతుబంధు రైతన్నల ఖాతాలో వేయడానికి ముఖ్యమంత్రికి మున్సిపల్ ఎన్నికలు ఏ విధంగా అడ్డు వస్తున్నాయి? కేవలం ఎన్నికలు అయిపోయేంత వరకు ఆశ చూపించి, మరొకసారి మోసం చేయడానికే రేవంత్ రెడ్డి ఈ మాట చెబుతున్నారు.
అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి కార్యక్రమా లను కూడా పక్కన పెట్టారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అందరినీ మోసం చేస్తున్నది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మళ్లీ కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ఓటువేస్తే.. మళ్లీ మోసపోవడం ఖాయం’ అని కేటీఆర్ అన్నారు. ‘ముఖ్యమంత్రికి చేతిలో అధికారం, అవకాశం ఉన్నప్పుడు మాజీ సీఎం కేసీఆర్ను తిట్టవలసిన అవసరం ఏమున్నది? చేతనైతే ప్రజలకు మంచి చేయాలి, ఇచ్చిన హామీ లు అమలు చేయాలి.
కానీ కేసీఆర్ను తిట్టవలసిన అవసరం ఏముంది..? ప్రతి అంశంలో అడ్డగోలుగా మాట్లాడటం, అబద్దాలు ఆడటం తప్పించి, ఈ రెండేళ్ళలో ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. కేసీఆర్ ఏర్పాటు చేసిన చిన్న జిల్లాలను తీసివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. ఈ ఎన్నికల్లో జిల్లా కేంద్రాలను రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మాటలు చూసి ఓటు వేయాలి. జిల్లాలు ఎత్తివేస్తామని చెప్పిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటువేస్తే అది మంచా, చెడా అన్న విషయాన్ని గుర్తించి ఓటు వేయాలని కేటీఆర్ సూచించారు.
