రేవంత్ పాలన
- జూబ్లీహిల్స్లో తోక కట్ చేయడం ఖాయం
- ఇచ్చిన హామీలు తుంగలో తొక్కిన నేతలు
- కాంగ్రెస్కు ప్రజలు ఎందుకు ఓటేయాలి
- మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆహానా పెళ్లంట సినిమా తరహాలో రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని.. కోడిని వేలాడదీసి పచ్చడి మెతుకులు పెడతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి పదవి ఇచ్చిందే ప్రజలు అని.. అది మర్చిపోయి రాజులా ఫీలవుతున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ తోక కత్తరించేందుకు రెడీగా ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారని అన్నారు. అసలు కాంగ్రెస్కు ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. తెలంగాణ టీడీపీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ నాయుడు.. ఆయన సతీమణి, టీడీపీ నాయకురాలు సుజాతతో పాటు పలువురు నేతలు శనివారం నాడు గులాబీ పార్టీలో చేరారు. పెద్దఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆ నేతలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు కేటీఆర్. వేసిన నామినేషన్ విత్అడ్రా చేసుకొని మరీ బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్న ప్రవీణ్ కు ఆయన అభినందనలు తెలియజేశారు.

శ్రీనివాస్ నాయుడు చాలా కాలం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని.. ఐదేళ్ల కిందటే రావాల్సిన నాయకుడు ఇప్పుడు వచ్చారని అన్నారు. మన పార్టీ నుంచి గెలిచి మేయర్ అయిన వ్యక్తి ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఏ పనులు చేయట్లేదని.. ఇక మేయర్ మనకు ఏం పనులు చేస్తుందని దుయ్యబట్టారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని గ్యారెంటీ కార్డులు ఇచ్చి అరచేతిలో స్వర్గం చూపించారని ఫైర్ అయ్యారు. ఆడబిడ్డ పెళ్లికి కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తే.. తులం బంగారం కూడా ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి మాట తప్పారని అన్నారు. ఇప్పుడు తులం బంగారం ఇవ్వకపోగా..
మెడలో గొలుసు కూడా లాక్కెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రీ బస్ ఇస్తున్నామని చెప్పి భార్యకి ఫ్రీ ఇచ్చి.. భర్త నుంచి డబుల్
ఛార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కేసీఆర్ అమలు చేశారని.. అలాగే కేసీఆర్ కిట్ ఇచ్చారని కొనియాడారు. తమ హయాంలో ఆడపిల్ల పుడితే రూ.13వేలు, అబ్బాయి పుడితే రూ.12 వేలు ఇచ్చామని గుర్తు చేశారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ హయాంలో జరిగాయని అన్నారు.
కాంగ్రెస్ పాలనలో కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరలు.. ఇలా అన్ని పథకాలు బంద్ అయ్యాయని ఆగ్రహించారు. ఎన్నికలు వస్తే ఎవరైనా ఏం చేస్తారో చెప్తారు.. కానీ బెదిరిస్తారా? అని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ నాశనం చేశారని.. రెండేళ్లలో ఏం మంచిపని చేశారో చెప్పాలన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ పేదల ఇళ్లు కూలగొడుతున్నారని + అయ్యారు. హైడ్రా, బుల్డోజర్ పేరుతో పేదలపై జులుం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన ఏ ఒక్క హామీనీ ఈ ప్రభుత్వం అమలు చేయలేదని కేటీఆర్ దుయ్యబట్టారు. బీసీ, ఎస్సీ డిక్లరేషన్ అంటూ నోటికొచ్చిన 420 హామీలు ఇచ్చారని మండిపడ్డారు. మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో చనిపోతే ఈ నెల 11న బైపోల్ ఎన్నిక వచ్చిందన్నారు.
ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు కేసీఆర్ టికెట్ ఇచ్చారని చెప్పారు. భర్త చనిపోయి మాగంటి సునీత ఏడిస్తే.. దాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు డ్రామా అంటున్నారని చెప్పారు. ఒక ఆడబిడ్డ ఏడిస్తే కూడా ఇంత అన్యాయంగా మాట్లాడతారా? అని ప్రశ్నించారు. ఆడబిడ్డను అవమానిస్తున్న వారికి బుద్ధి చెప్పాల్సిందేనన్నారు. అధికారంలోకి రాగానే మేయర్, ఇతర నేతలు కాంగ్రెస్లో చేరినా ప్రజలు తమతోనే ఉన్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ విజయంతోనే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం కావాలని.. కేసీఆర్ను మళ్లీ సీఎం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతో సునీత ఘన విజయం సాధించబోతున్నారని చెప్పారు.
బీఆర్ఎస్ సీన్
- నిరుద్యోగులకు ఆశ చూపి పదేళ్ళు భోగం
- ఐదేళ్లు మహిళా మంత్రి లేకుండా నడిపిన చరిత్ర
- బీఆర్ఎస్, బీజేపీలది లోపాయకారి ఒప్పందం
- కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన పీసీసీ చీఫ్
అహనా పెళ్ళంట మాట బీఆర్ఎస్ పార్టీకి సరిగ్గా సరిపోతుందని కౌంటర్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చారు. సినిమాలో మాదిరి కోడిని వేలాడదీసి ఆశ చూపినట్లు నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపి.. కేబినెట్లో ఐదేళ్లు మహిళా మంత్రి లేకుండా ప్రభుత్యం నడిపిన నీచ చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని దుయ్యబట్టారు. ఈమేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ తో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ ప్రాధాన్యత లేని అభ్యర్థిని నిలబెట్టిందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెలవడానికి బీఆర్ఎస్ సహకరించిందని ఆరోపించించారు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ రుణం తీర్చుకోవడానికి బీజేపీ ప్రాధాన్యత లేని అభ్యర్థిని నిలబెట్టిందని దుయ్యబట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి నిర్ణయంలో గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ పాత్ర ఉందని ఆరోపించారు. రాష్ట్రపతి అధ్యక్ష పదవిని నుంచి మొదలుకొని ట్రిపుల్ తలాక్ వరకు బీజేపీకి కేసీఆర్ మద్దతు ఇచ్చారని అన్నారు. డబ్బుతో ఓట్లను కొలవడమనేది అనైతిక చర్య అని పేర్కొన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే రూ.5 వేలు తీసుకోండి.. బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి? అంటూ కేటీఆర్ మాట్లాడటం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్యగా పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ తక్షణమే కేటీఆర్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మెజార్టీ అమలు చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేసి ఓట్లు అడుగుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని అమాయకులైన నిరుద్యోగులను బలిగొన్న చరిత్ర బిఆర్ఎస్ పార్టీదని ఫైర్ అయ్యారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబంలో వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సాయం చేసిందని.. ఆ రుణాన్ని బీజేపీ ఇప్పుడు తీర్చుకుం టుందని ఆరోపించారు. అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికలో బీజేపీ డమ్మీ క్యాండిడేట్ ను పెట్టిందని విమర్శించారు. యూసుఫ్ గూడలో ఏర్పాటు చేసిన మీటింగ్లో లో ఆయన బీజేపీ, బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఫేక్ హామీలతో మోసం చేసిందని అన్నారు.
ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చారో చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పారు. ఐదేండ్లు మీ మంత్రి వర్గంలో మహిళా మంత్రి ఎందుకు లేరో చెప్పాలని ప్రశ్నించారు. రెండు పార్టీల మధ్య ఉన్న లోపాయి కారి ఒప్పందంతోనే బీజేపీ డమ్మీ అభ్యర్థిని పెట్టిందని ఆరోపించారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తే విమర్శిచడేంటని మండిపడ్డారు.
