దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) సోమవారం ఆలంపూర్‌లోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానానికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ అధికారులు, అర్చక స్వాములు పూర్ణకుంభంతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ముందు స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మూలవిరాట్‌కు అభిషేకం చేశారు.
అనంతరం మంత్రి కొండా సురేఖ(Konda Surekha), అలంపూర్ ఎమ్మెల్యే విజయ మరియు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి & కమిషనర్ శైలజ రామయ్యర్ తో కలిసి జోగుళాంబ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం స్వామి వారి, అమ్మవార్ల కల్యాణోత్సవంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠమైన జోగులాంబ ఆలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంపూర్ణ సహకారంతో ఆలయాన్ని, పరిసర ప్రాంతాలను ప్రధాన పుణ్యక్షేత్రం మరియు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ. 340 కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టును మూడు దశల్లో చేపడతామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్‌పర్సన్ సరిత తిరుపతయ్య, ఆలయ ఈవో, ఆలయ చైర్మన్, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు మరియు భక్తులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు: