VOAల ధర్నాకు మద్దతు తెలిపిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
వారి హక్కుల సాధన కోసం లాఠీ దెబ్బలు తినేందుకైనా సిద్ధం
వీవోఏల జీతం రూ.8 వేల నుంచి రూ.26 వేలకు పెంచాలని డిమాండ్
వీవోఏల హక్కుల సాధన కోసం లాఠీ దెబ్బలు తినేందుకైనా సిద్ధమని తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఇందిరాపార్క్ లోని ధర్నా చౌక్ లో వీవోఏలు చేపట్టిన ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు VOA(విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్)లకు 26 వేలు జీతం పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అసలు అధికారంలోకి వస్తామని వారికే నమ్మకం లేకుండెనని, అందుకే ఇష్టానుసారం హామీలు ఇచ్చారని విమర్శించారు. అనుకోకుండా తప్పుదారిన అధికారంలోకి వచ్చారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి(Revanth)కి ఇచ్చిన హామీలు గుర్తు లేవని కవిత మండిపడ్డారు.

ఆమె ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. రేవంత్‌కు ఒక్క సోనియమ్మ తప్ప తెలంగాణ సోయి లేదు. జై తెలంగాణ అనకుండా జై సోనియమ్మ అంటున్నాడు. సోనియమ్మ కాదు జీతాలు పెంచాలంటూ ధర్నా చేస్తున్న ఈ తల్లులను చూడాలని సీఎం ను కోరుతున్నా. 8 వేలు ఉన్న VOAల జీతం రూ. 26 వేలు చేయాల్సిందే. వారి జీతం పెంచే వరకు వారికి జాగృతి అండగా ఉంటుంది. VOAలు ఎన్నో పనులు చేస్తారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లలోని 64 లక్షల మందికి రూ.20 వేల కోట్ల రుణాలు అందించటంలో VOAలదే కీలక పాత్ర. ఈ ప్రభుత్వాన్ని జీతం పెంచమని వేడుకోవాల్సిన అవసరం లేదు. పిడికిలెత్తి డిమాండ్ చేయాల్సిందే. VOA అక్కా చెల్లెళ్లు భయం భయంగా ఆందోళనలు చేయాల్సిన పని లేదు. ధైర్యంగా నిరసన తెలుపాల్సిందే.

మీరు లేకుంటే 64 లక్షల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లలో మహిళలు ఊరుకుంటారా? ఈ ప్రభుత్వం నడుస్తదా? మీ శక్తిని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మీరు చేస్తున్న పనికి మాత్రమే సరైన వేతనం ఇవ్వాలని అడుగుతున్నారు. ఇంత పనిచేస్తున్న మనకు ఎందుకు యూనిఫాం లేదు? ఏడాదికి కచ్చితంగా రెండు జతల యూనిఫాంలు ఇవ్వాల్సిందే. యూనిఫాం ఉంటే ఆ గౌరవం వేరే ఉంటుంది. మనం కోరుకుంటున్నది ఆత్మగౌరవం, సరైన వేతనం మాత్రమే. మిమ్మల్ని ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడితే వారికి అండగా నేను ఉంటా.
జీతం పెంచుతామని ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నా. ఈ ప్రభుత్వం VOA ఆడబిడ్డలను మాత్రమే కాదు. తెలంగాణలోని అందరూ మహిళలను మోసం చేసింది. వారికి ఇస్తా అన్న రూ. 2500 లేవు. పెన్షన్ పెంపు ఇప్పటికీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ లో ఉన్నవాళ్లకు మాత్రమే ఇళ్లు ఇస్తున్నారు. తెలంగాణలోని ప్రతి పేదవారికి ఇళ్లు ఇవ్వాల్సిందే. ఈ ప్రభుత్వం మొండి, మతిమరుపు, మోసపూరిత ప్రభుత్వం. అందుకే మన డిమాండ్ల కోసం గట్టిగా అడగాల్సిందే. VOAలు ఎలాంటి కార్యాచరణ తీసుకున్న సరే నేను ముందుంట. VOA ఆడబిడ్డలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా.
