Tuesday, March 3, 2026
Homeకరీంనగర్Students' Club | స్టూడెంట్స్ క్లబ్ విధానం రాష్ట్రానికి స్ఫూర్తిదాయకం

Students’ Club | స్టూడెంట్స్ క్లబ్ విధానం రాష్ట్రానికి స్ఫూర్తిదాయకం

  • రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమలు చేయాలి
  • విద్య, వైద్య రంగానికి మరిన్ని నిధులు ఇస్తాం
  • ప్రతి ఏడాది సైకిళ్ల పంపిణీ, పరీక్ష ఫీజు చెల్లిస్తాం
  • జిల్లా కలెక్టర్ కు అభినందనలు
  • కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి, అన్ని రంగాల్లో వారు రాణించేందుకు కరీంనగర్ జిల్లాలో వినూత్నంగా చేపట్టిన స్టూడెంట్స్ క్లబ్బుల ఏర్పాటు విధానం రాష్ట్రానికి స్ఫూర్తిదాయకమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ విధానాన్ని రాష్ట్రమంతా అమలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని వెల్లడించారు.

జిల్లాలోని 172 పాఠశాలల్లో ఏర్పాటు చేసిన, స్నేహిత, ఈకో స్పోర్ట్స్, కాన్షియస్ నెస్, రిటరల్లి ల్యాథర్న్ క్లబ్బులలో సభ్యులుగా ఉన్న 2566 మంది విద్యార్థులకు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ టీ షర్టులను, బ్యాడ్జీలను అందించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో 578 పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్లను అందజేశారు.

- Advertisement -

కళాభారతిలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరై విద్యార్థులకు టీ షర్టులు, బ్యాడ్జీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన క్లబ్బుల విధానం ద్వారా విద్యార్థుల్లో లీడర్ షిప్, ప్రశ్నించే తత్వం పెరుగుతుందని అన్నారు. విద్యారంగ సమస్యలను వారు అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకుంటారని తెలిపారు.

ఈకో క్లబ్ విధానం ద్వారా వ్యవసాయం, అనుబంధ రంగాలు, మార్కెటింగ్ పై విద్యార్థులకు అవగాహన వస్తుందని, తద్వారా వారు భవిష్యత్తులో రాణించే అవకాశం ఉందని తెలిపారు. డ్రగ్స్, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలని, భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలిపారు. కరీంనగర్లో ఏర్పాటుచేసిన క్లబ్ ల విధానం రాష్ట్రా వ్యాప్తంగా స్ఫూర్తిదాయకమని, ఈ విధానాన్ని అన్ని పాఠశాలలో అమలు చేయాలని ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహిస్తూ డ్రాపౌట్స్ ను తగ్గిస్తున్న జిల్లా కలెక్టర్ ను, విద్యాశాఖ అధికారులను అభినందించారు.

విద్య, వైద్య అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలన్నా అందజేస్తామని, మరిన్ని సిఎస్ఆర్ నిధులను తెప్పించి అభివృద్ధికి ఉపయోగిస్తామని అన్నారు. ప్రతి ఏడాది తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేస్తానని, ప్రతి సంవత్సరం 10వ తరగతి పరీక్ష ఫీజు తానే చెల్లిస్తానని వెల్లడించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు గ్యాస్ స్టవ్ లు, కుక్కర్లు అందజేస్తామని అన్నారు. విద్యారంగ అభివృద్ధికి వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళుతున్న జిల్లా కలెక్టర్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు.

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ పాఠశాలలో ఏర్పాటుచేసిన ప్రతి క్లబ్ విద్యార్థికి ప్రత్యేక బాధ్యత ఉందని తెలిపారు. స్నేహిత క్లబ్ ద్వారా బాలికల అభివృద్ధి, లైంగిక వేధింపుల నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తద్వారా తమకు జరిగిన వేధింపులపై నిర్భయంగా విద్యార్థులు ఫిర్యాదు చేసే స్థాయికి వచ్చారని అన్నారు. సైన్స్ పై అవగాహన కోసం ఈకో క్లబ్ ఏర్పాటు చేశామని, విటమిన్ గార్డెన్ ల ద్వారా వ్యవసాయం, ఉత్పత్తి, మార్కెటింగ్ మంటి వాటిపై అవగాహన తెప్పిస్తున్నామని తెలిపారు.

క్రీడారంగ అభివృద్ధికి స్పోర్ట్స్ క్లబ్, మాదకద్రవ్యాల నిరోధానికి కాన్షియస్నెస్ క్లబ్బులు ఎంతగానో దోహదం చేస్తున్నాయని వెల్లడించారు. ఇంగ్లీష్ భాషతో పాటు పలు భాషల్లో పట్టుకోసం లిటరల్లీ లాంథర్న్ క్లబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. తద్వారా టెడ్ టాక్స్ షోలో జిల్లాకు చెందిన 14 మంది అంతర్జాతీయ న్యూయార్క్ వేదికపై నిలిచారని అన్నారు. కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో ఉచిత సైకిళ్ల పంపిణీ, ఎల్పిజి కనెక్షన్లు, పరీక్ష ఫీజు చెల్లింపు ద్వారా విద్యార్థులు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిఈఓ మొండయ్య, విద్యాశాఖ కోఆర్డినేటర్లు మిల్కూరి శ్రీనివాస్, అశోక్ రెడ్డి, కృపారాణి, ఎంఈఓలు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News