- విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి.
- సామాజిక తత్వవేత్త ఓ.యు. రిటైర్డ్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య.
- వరంగల్ కె.యు.లో రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ సెమినార్ ప్రారంభం.
దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించే సంక్షేమ పథకాలు ప్రజల మౌలిక ప్రజల జీవితాల్లో విప్లవత్మక మార్పులు తీసుకురావాలని సామాజిక తత్వవేత్త, రచయిత ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య తెలిపారు. సోమవారం కాకతీయ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సెనెట్ హాల్ లో “భారతదేశంలో సరళీకరణ అనంతరం జనరంజక విధానాలు” అనే అంశంపై జాతీయ సెమినార్ ప్రారంభం అయ్యింది.

ఈ కార్యక్రమానికి సెమినార్ డైరెక్టర్, కె.యు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. రామచంద్రం అధ్యక్షత వహించారు. ఈ జాతీయ సెమినార్ ను ప్రారంభిస్తూ ప్రొఫెసర్ కంచ ఐలయ్య కీనోట్ ప్రవేశపెట్టగా, ముఖ్య అతిథిగా ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ కోదండరాం, గౌరవ అతిథి కె.యు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. ప్రతాపరెడ్డి, వక్తగా ప్రముఖ పత్రిక సంపాదకులు డాక్టర్ కే. శ్రీనివాస్, కె.యు. సోషల్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ బి. సురేష్ లాల్ హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ కంచ ఐలయ్య మాట్లాడుతూ నాటి దేశ ప్రధాని ఇందిరా గాంధీ 1971లో దేశంలో గరిభి హఠావో పేరిట సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. 1991 నుండి దేశంలో అమలవుతున్న సరళీకరణ విధానాలు వందలాది అగ్రవర్ణ ప్రైవేటు పెట్టుబడిదారుల వ్యాపార విస్తరణ కోసం 90 శాతం ఉపయోగపడగా, 10 శాతం మాత్రమే గ్రామీణ ప్రజలకు ఉపయోగపడిందని తెలిపారు. దీంతో సమాజంలోని అన్ని రంగాల్లో అసమానతలు పెరిగిపోయాయి అన్నారు.

ప్రజల్లో రోజురోజుకు పెరిగిపోతున్న నిరాశ, నిస్పృహ, అసంతృప్తులను చల్లార్చడానికి, ఓట్లు, సీట్లు, రాజకీయ అధికారం సుస్థిరం చేసుకోవడానికి సంక్షేమ పథకాలు తీసుకు తీసుకువచ్చారని తెలిపారు. మోడీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో 40% నిధులు కార్పొరేట్ పెట్టుబడిదారుల అభివృద్ధికి కేటాయిస్తున్నదని తెలిపారు. దేశంలోని పేదలకు ఉచితంగా విద్య, వైద్యం తో పాటు వృద్ధులు, వికలాంగుల అభివృద్ధికి బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించి అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రముఖ పత్రిక సంపాదకులు ‘డాక్టర్ కే.శ్రీనివాస్’ మాట్లాడుతూ 2004 నుండి 2014 వరకు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం సమాజంలోని అసమానతలను రూపుమాపడానికి సంక్షేమ పథకాలు, వివిధ రకాల చట్టాలు తీసుకువచ్చిందని, సంక్షేమ పథకాలపై ప్రజలకు హక్కు కల్పించిందని అన్నారు. కానీ నేడు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న మార్కెటీకీకరణలో సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా నిర్వీర్యమై పోతున్నాయని తెలిపారు.

ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ కోదండరాం. మాట్లాడుతూ ప్రజలను పేదరికం, ఆకలి చావులు, ఆత్మహత్యల నుండి విముక్తి చేసేవే నిజమైన సంక్షేమ పథకాలని అన్నారు. నేడు దేశంలో మోడీ ప్రభుత్వం అమెరికా కనుసన్నాల్లో నూతన ఆర్దిక, సరళీకరణ విధానాలు అమలు చేస్తున్నాడని, అమెరికా, యూరప్ దేశాలతో చేసుకున్న వ్యాపార వాణిజ్య ఒప్పందాలు దేశ ప్రజల ప్రయోజనాలకు తీవ్ర నష్టకరంగా మారే ప్రమాదం ఉన్నదన్నారు.
దేశ ఎగుమతులపై జీరో సుంకాలు విధిస్తూ, అమెరికా- యూరప్ వ్యవసాయ, వ్యాపార వస్తూత్పత్తుల దిగుమతులపై 18 శాతం సుంకాలు చెల్లించడం, సంవత్సరానికి 550 మిలియన్ డాలర్ల వస్తువులు దిగుమతి చేసుకోవాలని ఒప్పందం చేసుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదకరమని అన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకొవటంతో వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధి కుంటుపడుతున్నదని, రాజ్యాంగ బద్ధ సంస్థలు అనుసరిస్తున్న విధానాలతో దేశ ఫెడరల్ వ్యవస్థ సంక్షోభంలో పడుతున్నదని అన్నారు. ఈ జాతీయ సెమినార్ లో వివిధ పరిశోధకులు సమర్పించిన సెమినార్ ఆర్టికల్స్ వాల్యూమ్ ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సంకినేని వెంకటయ్య, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ గడ్డం కృష్ణయ్య, రిటైర్డ్ ప్రొఫెసర్ సిహెచ్ దినేష్ కుమార్, జి.వీరన్న, డాక్టర్ హరిప్రసాద్, అధ్యాపకులు డాక్టర్ వడ్లకొండ సత్యనారాయణ, డాక్టర్ నాగరాజు, డాక్టర్ తిరుపతి, డాక్టర్ సంజీవ్, రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
