- మార్చి 3 మంగళవారం నాడు హోళీ పండుగ..
ఫాల్గుణ మాసంలో పౌర్ణమికి ముందు రోజు రాత్రి చేసే అద్భుత కార్యక్రమం కామదహనం. దుష్ట శక్తులపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే కార్యక్రమం కామదహనం. ఈ కామదహనం ఉత్సవం జరుపుకోవడం వెనక రెండు పౌరాణిక గాథలు ఉన్నాయి. ఈ సందర్భంగా కామదహనం అంటే ఏమిటి? హోళికా పౌర్ణమి రోజు కామదహనం ఎందుకు చేస్తారు? తదితర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మార్చి 3, మంగళవారం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి కాబట్టి దానికి ముందురోజు రాత్రి అంటే మార్చి 2, సోమవారం రాత్రి కామదహనం కార్యక్రమాన్ని నిర్వహించాలి. కొన్ని ప్రాంతాల్లో పౌర్ణమి రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
హిరణ్య కశ్యపుడనే రాక్షసరాజు కుమారుడు ప్రహ్లాదుడు అపార విష్ణు భక్తుడు. విష్ణు ద్వేషి అయిన హిరణ్యకశ్యపుని ఇది నచ్చేది కాదు. ప్రహ్లాదునిచే విష్ణుభక్తిని మాన్పించాలని హిరణ్యకశ్యపుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ప్రహ్లాదుని అనేక హింసలకు కూడా గురి చేస్తాడు. కానీ ప్రహ్లాదుడు నిరంతరం హరినామస్మరణ చేస్తుంటాడు. హిరణ్య కశ్యవునికి హోళికా అనే చెల్లెలు ఉంటుంది. ఈమెకు అగ్నిలో దహనం కాకుండా ఉండే వరం ఉంటుంది. రాక్షసరాజు తన చెల్లెలు హోళికను పిలిచి ఆమెతో ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిప్రవేశం చేయమని ఆదేశిస్తాడు.
అందువల్ల ప్రహ్లాదుడు అగ్నికి ఆహుతవుతాడు తన చెల్లెలుకు ఏమి కాదని హిరణ్యకశ్యపుని ఉద్దేశ్యం. అనుకున్నట్లుగా అన్ని సిద్ధమయ్యాయి. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమికి ముందు రోజు హోళికా ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్ని ప్రవేశం చేస్తుంది. కానీ విష్ణు భక్త పరాయణుడైన ఆ ప్రహ్లాదుని భక్తి ముందు అగ్ని కూడా నిలవలేక పోతుంది. విష్ణు భక్తునికి హాని తల పెట్టినందుకు ఆ అగ్నిలో హోళికా దహనమైపోతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా బయట పడతాడు. ఈ విధంగా దుష్ట శక్తులపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఆనతి నుంచి ఫాల్గుణ శుద్ధ పౌర్ణమికి ముందు రోజు రాత్రి కామదహనం పేరిట హోళికా దిష్టిబొమ్మను దహనం చేయడం ఆనవాయితీగా వస్తోంది.
శివపురాణంలో కామదహనం కు సంబంధించిన మరో కథ ఉంది. దక్షయజ్ఞంలో సతీదేవి దేహత్యాగం తరువాత పరమ శివుడు హిమవత్పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ యుగంలో సతీదేవి హిమవంతుని పుత్రికగా పార్వతిగా జన్మించి తపస్సు చేసుకుంటున్న శివునికి సేవలు చేస్తుం ఉంటుంది. అయితే శివపార్వతుల వివాహం జరిగి వారికి కలిగే పుత్ర సంతానం వల్ల మాత్రమే తారకాసురుడు మరణిస్తాడని వరం ఉంటుంది. అప్పటికే లోక కంటకుడైన తారకాసురుని ఆగడాలు మితిమీరడంతో దేవతలు శివపార్వతుల మధ్య ప్రేమను అంకురింపజేయడానికి మన్మధుని నియమిస్తారు.
మన్మధుడు తన చెరుకు విల్లుతో తపస్సు చేసుకుంటున్న శివునిపై పూలబాణాలు విసురుతాడు. ఆ శరాఘాతాలకు శివుడు తనకు సేవలు చేస్తున్న పార్వతిని చూసి మన్మధ తాపానికి గురవుతాడు. లిప్తకాలం పాటు మాత్రమే శివుని మనసు చెదరిన ఫలితంగా కుమారసంభవం జరుగుతుంది. అయితే తన తపస్సుకు భగ్నం కలిగించినందుకు శివుడు ఆగ్రహించి మన్మధుని తన మూడవ నేత్రంతో దహించి వేస్తాడు.
మనసులోని క్షణభంగురమైన కోరికలు దహించి జ్ఞానమార్గంలో ప్రయాణించాలని సూచించడానికి ప్రతీకగా కూడా హోలీ పండుగ ముందురోజు రాత్రి కామదహనం ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇదే హోలీ ముందురోజు రాత్రి నిర్వహించే కామదహనం వెనుక ఉన్న పురాణ గాధలు. ఈ హోలీ సందర్భంగా మనం కూడా దుష్టశక్తులను అగ్నికి ఆహుతి ఇచ్చి భక్తిమార్గంలో పయనిద్దాం.
