Friday, April 10, 2026
Homeసాహిత్యంJyotirao Phule | పీడిత జన బాంధవుడు జ్యోతి రావు ఫూలే

Jyotirao Phule | పీడిత జన బాంధవుడు జ్యోతి రావు ఫూలే

  • ఏప్రిల్ 11… మహాత్మా ఫూలే జయంతి

భారత జాతిపిత మోహన్ దాస్ గాంధీ కన్నా ముందే “మహాత్మునిగా”” భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ చే, “”గురువుగా” భావింప బడి, ప్రకటింప బడి, జన నీరాజనాలు అందుకున్న జ్యోతిరావు ఫూలే భారత ప్రప్రథమ సామాజిక తత్వవేత్త. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, అణచివేతకు గురవుతున్న ప్రజలకు ఆత్మస్థైర్యం అందించేందుకు, వారి హక్కుల కోసం, నిరంతరం అననుకూల పరిస్థితులలో పోరాటాలు చేసి సత్య ధర్మ శోధక మండలిని స్థాపించి, పలు సమస్యల పరిష్కారానికి కృషిచేసిన మహనీయుడు ఫూలే.

సామాజిక తత్వవేత్తగా, ఉద్యమకారునిగా, సంస్కరణవాదిగా, సాంఘిక సేవా తత్పరునిగా, బాలికా విద్య ప్రోత్సాహకునిగా, మహిళా హక్కుల పరిరక్షకునిగా, కార్మిక పక్షపాతిగా, దీన జన బాంధవునిగా, లింగ వివక్షకు వ్యతిరేకిగా అణగదొక్కబడిన వర్గాల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారు ఫూలే. 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్ర ( బ్రిటిష్ ఇండియా)లో జన్మించిన ఫూలే. తండ్రి గోవిందరావు పీష్వాల కాలంలో పూల వ్యాపారం చేయడం వల్ల వారికి ఫూలే అని పేరు వచ్చింది. చిన్నతనంలో చదువు మానేసి, తిరిగి పుణేలో 1941లో క్రైస్తవ ముస్లిం మిత్రుల సహకారంతో , స్కాటిష్ మిషన్ లో చేరి విద్యాభ్యాసం కొనసాగించారు.

- Advertisement -

పుస్తకపఠనం పై మక్కువ ఎక్కువ చూపారు. చదువుకునే సమయాన 1948లో బ్రాహ్మణ స్నేహితుని వివాహానికి హాజరైన సందర్భంగా బిసి “మాలి” కులానికి చెందిన పూలే కుల వివక్ష కు లోనై తీవ్ర మానసిక వ్యధ చెందారు. సదాశివ బిల్లాల్ గోవింద్ అనే బ్రాహ్మణ మిత్ర పరిచయం, సాన్నిహిత్యం, “థా మస్” రచన మానవ హక్కుల ప్రభావం, ఆయనపై ఎంతగానో ప్రభావం చూపింది. కులం, వర్గం, ప్రాంతం, లింగాది, వివక్షతలకు అవిద్యే కారణమని భావించి, తన భార్య సావిత్రిని బడికి పంపా రాయన. 1848 ఆగస్టులో బాలికల పాఠశాలను 51–52 లో మరో రెండు పాఠశాలలను ఆదర్శ దంపతులు స్థాపించారు.

1853లో దేశంలోనే మొదటిదిగా పూలే వితంతువుల అనాధ శిశువుల కోసం సేవా సదనం స్థాపించారు. శ్రామిక ప్రజల కోసం 1855లో ‘రాత్రి బడి’ని స్థాపించారు.1864లో “బాలహత్య ప్రతిబంధక్ గృహ” గర్భస్రావ వ్యతిరేక కేంద్రాన్ని స్థాపించి, వితంతువులెైన గర్భిణీ స్త్రీలకు అండగా నిలిచారు.1868లో తన ఇంటి దగ్గరున్న స్నానాల తొట్టి వద్ద స్నానం చేసేందుకు అంటరాని వారికి కూడా అనుమతి ఇచ్చారు. బాల హత్య ప్రతిబంధక్ గృహలో జన్మించిన బ్రాహ్మణ వితంతు కుమారున్ని 1872 లో దత్తత స్వీకరించారు. తాను అనుభవించిన కుల వివక్ష ఇతరులకు అనుభవానికి రాకూడదని ఆకాంక్షించారు.

సహ ధర్మ చారిణి సావిత్రి తో కలిసి 40 ఏళ్ల పాటు నిర్వహించిన సామాజిక ఉద్యమాలు, ఫూలే దంపతులకు పేద జనోద్ధారకులుగా సమాజంలో గుర్తింపు తెచ్చాయి. ఎక్కడ అన్యాయం, వివక్ష చోటు చేసుకుంటే, అక్కడ ఉద్యమం నడిపారు. అణగారిన వర్గాలకే కాదు, బాధితులైన అగ్రకుల వితంతు పునర్వివాహాలకు విశేష కృషి సలిపారు. బ్రాహ్మణ వితంతువులకు శిరో ముండనాలు చేయమని క్షురకులచే సమ్మెలు చేయించారు.1871 లో సత్యశోధన పక్షాన దీనబంధు పత్రిక నడిపాడు. సహపంక్తి భోజనానికి సంసిద్ధత ప్రకటించారు. 1873 సెప్టెంబరు 24న సత్య శోధక సమాజాన్ని ఫూలే స్థాపించాడు. దేశంలోనే ఇది మొట్టమొదటి సంస్కరణోద్యమం.

బొంబాయి నిర్మాణానికి తెలంగాణ నుండి వలస వెళ్ళి ఎదిగిన మున్నూరుకాపులే అధికం. బొంబాయిలో సత్యశోధక్ సమాజ్ శాఖ పుట్టింది సయాజీ నాగు మున్నూరుకాపు ఇంటిలోనే. ఫూలే సామాజిక సంస్కరణోద్యమానికి తుదిశ్వాస వరకు చేదోడు వాదోడై నిలిచిన జాయా కారాడీ లింగు తెలంగాణం కన్న మున్నూరు కాపు బిడ్డ. కారాడి లింగు తండ్రి జాయా ఎల్లప్పలింగు ముంబైలో భవన నిర్మాణ కాంట్రాక్టరు. ఫూలే కొంతకాలం భవన నిర్మాణ కాంట్రాక్టరుగా పనిచేశారు. అప్పుడే ఆయనకు ముంబై తెలుగు ప్రజల పితామహునిగా ప్రసిద్ధులైన కాంట్రాక్టరు రామయ్య వెంకయ్య అయ్యవారితో పరిచయమైంది.

వెంకయ్య ఫూలేను ముంబైకి ఆహ్వానించి, తోటి కాంట్రాక్టర్లతో కలిసి సత్యశోధక సమాజాన్ని విస్తరింప జేయడానికి, పాఠశాలలను ఏర్పాటుచేసి నడపడానికి ఆర్థిక, హార్దిక సహాయాలను అందించారు. సత్యశోధక సమాజానికి తెలుగువారి విరాళాలే ప్రధాన ఆర్థిక వనరుగా ఉండేవి. వెంకయ్య ఇల్లే అనాథ బాలల ఆశ్రమంగా ఉండేది. వారిని గొప్ప విద్యా వంతులుగా, సత్యశోధకులుగా చేసిన ఘనత వెంకయ్యదే. ఫూలే ప్రసిద్ధ గ్రంథం “గులాంగిరి” పుస్తక ప్రచురణ 1873లో వెంకయ్యనే ప్రచురించారు.

1882లో హంటర్ కమిషన్‌కు’ శూద్రాతి శూద్రులకు చదువు చెప్పించాల్సిన అవసరం ఉందని నివేదికలిచ్చి, అస్పృశ్యుల కోసం బ్రిటిష్ వారిచే పాఠశాలల్ని ఏర్పాటు చేయించారు. 83 లో కల్టివేటర్ విప్ కార్డ్ ( సేద్య గాడిపై చర్నాకోల) ముప్పై మూడు వ్యాసాల పుస్తకాన్ని సార్వజనిక సత్య ధర్మ పేరున ప్రచురించారు. బ్రాహ్మణేతరులచే జరిపించిన కులాంతర వివాహాలు చెల్లవని బ్రాహ్మణులు తీర్మానాలు చేస్తే, సత్యశోధన మండలి ద్వారా కోర్టుకు వెళ్లారు. 1990లో కోర్టు ఫూలే వాదనను సమర్థించింది.

తద్వారా ఫూలే అమితానందం చెందారు. ఆయన వ్రాసిన 33 ఆర్టికల్స్‌ గల “సార్వజనిక్‌ సత్యధర్మ” పుస్తకంలో కుటుంబ సృష్టి నియమాల గురించి వివరిస్తూ ప్రపంచం మొత్తాన్ని ఒక కుటుంబంగా వ్యక్తీకరించారు. సామాజిక ప్రజాస్వామ్యం సాధించటం భారత దేశానికి ముఖ్యమనే మహత్తర సందేశాన్ని అందించిన మహాత్మ ఫూలే తన గురువు అని డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ ప్రకటించారు. ఫూలేకు కేవలం కుల వ్యవస్థ వ్యతిరేకతే కాదు, సామ్రాజ్యవాద వ్యతిరేకత, కార్మికవర్గ, రైతాంగ పక్షంగా పోరాడే అవగాహన, కార్యాచరణ ఉన్నాయి.

అనారోగ్యానికి గురై పడకకే పరిమితం అయిన సమయాన, తాను మృతి చెందాక, ఎవరు ఏ బాధ్యతలు స్వీకరించాలో వివరించి సామాజిక ఉద్యమాలు, విస్తరింపచేసి, ప్రగతి మార్గంలో ప్రజలను తీసుకెళ్లాలని నొక్కి చెప్పి, తన ఆదర్శాలను కొనసాగించాలని హితవు పలికి 63వ ఏట 1890 నవంబర్ 28న గురువారం రాత్రి ప్రార్థనా గీతాల మధ్య దీర్ఘ నిద్రకు మహాత్మ ఫూలే ఉపక్రమించారు. భారతావనిలో గొప్ప సాంఘిక సంస్కర్తగా ఆచంద్ర తారార్కం మహాత్మ ఫూలే మిగిలి పోనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News