- ముగిసిన జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం
- బరిలో 58 మంది అభ్యర్థులు
- ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ
- గెలుపు పై ఎవరిధీమా వారిదే..
- పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి
- అమలులోకి ఆంక్షలు..!
- డ్రోన్లతో పర్యవేక్షణ, క్రిటికల్ కేంద్రాల వద్ద పారామిలిటరీ
- నవంబర్ 14న ఫలితాలు
జూబ్లీహిల్స్ శాసనసభ ఉపఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం 6. గంటలకు అధికారికంగా ముగిసింది. దీంతో గత కొన్ని వారాలుగా వేడెక్కిన రాజకీయ సందడికి తెరపడింది. చివరి నిమిషం వరకు అన్ని ప్రధాన పార్టీలు తమ గెలుపు కోసం హోరాహోరీగా శ్రమించాయి. రోడ్డు షోలు, బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లు, ఇంటింటి ప్రచారాలతో ప్రతి పార్టీ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ ఉపఎన్నికలో గెలుపు ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతటా నెలకొంది. నిజానికి తెలంగాణ అంతటా ఈ ఉపఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ముఖ్యంగా కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తన మంత్రులు స్వయంగా రంగంలోకి దిగగా, బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా పలువురు నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ నేతృత్వంలో సీనియర్ నాయకులు బరిలోకి దిగి వ్యూహాత్మకంగా పని చేశారు. ప్రతి పార్టీ కూడా డివిజన్ వారీగా లెక్కలు వేసుకుంటూ, ఓటర్లను ప్రభావితం చేయడానికి విస్తృత ప్రణాళికలు రచించాయి. ప్రచార చివరి దశలో డైలాగ్ వార్ మరింత వేడెక్కి, రాజకీయ రంగాన్ని రగిలించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రచారం ముగిసిన వెంటనే నియోజకవర్గంలో ఆంక్షలు అమలులోకి వచ్చాయి.
సాయంత్రం 6 గంటల తర్వాత స్థానికేతరులు నియోజకవర్గాన్ని వెంటనే విడిచిపోవాలని ఈసీ ఆదేశించింది. ఆదివారం సాయంత్రం నుంచి జూబ్లీహిల్స్ పరిధిలోని వైన్స్, పబ్బులు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నవంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఈ ఉపఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం నియోజకవర్గంలో ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
పోలింగ్ కోసం 139 సెంటర్లలోలో 407 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు అధికారులు 2,060 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉంటారని ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు, ప్రతి బూత్లో 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయని, మొత్తం 561 కంట్రోల్ యూనిట్లు, 595 వీవీ ప్యాట్స్, 2,394 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉంచినట్లు వివరించారు పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత అమలులో ఉంటుందని జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ వెల్లడిరచారు. మొత్తం 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు గుర్తించినట్లు తెలిపారు. వీటిలో పారామిలిటరీ బలగాలు బందోబస్తులో ఉండగా, ఇతర కేంద్రాల్లో లోకల్ పోలీసులు విధుల్లో ఉంటారని వివరించారు.
మొత్తం 1,761 మంది పోలీసు సిబ్బంది, 8 కంపెనీల సీఐఎస్ఎఫ్ బలగాలు భద్రతా చర్యల్లో పాల్గొంటాయని తెలిపారు. అదనంగా 139 డ్రోన్లతో నిరంతర మానిటరింగ్ చేయనున్నారు. ఇప్పటివరకు 27 ఎన్నికల ఉల్లంఘన కేసులు నమోదయ్యాయని, 230 రౌడీ షీటర్లను బ్కెండ్ ఓవర్ చేసినట్లు ఆయన వెల్లడిరచారు. 3 కోట్ల 60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం వైన్ షాపులు నవంబర్ 11 సాయంత్రం వరకు మూసి ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేసారు సైలెన్స్ పీరియడ్లో నలుగురికంటే ఎక్కువ మంది ప్రచారంలో పాల్గొనరాదని స్పష్టం చేశారు.
వాట్సాప్ ద్వారా బల్క్ మెసేజ్లు పంపడం నిషేధమని తెలిపారు. స్థానికేతరులను వెంటనే నియోజకవర్గం విడిచిపోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ సమయం లో ఓటింగ్ శాతం వివరాలను ప్రతి రెండు గంటలకు ఒకసారి ప్రకటిస్తామని ఈసీ అధికారులు తెలిపారు ఓట్ల లెక్కింపు నవంబర్ 14న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో 42 టేబుల్స్ వద్ద 10 రౌండ్లలో జరగనుంది. ఫలితాలు 14న వెలువడనున్నాయి. ఓటర్లందరూ ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు కోరారు.
