జవహర్ నగర్ పరిధిలోని సర్వే నెంబర్ 268 గల ప్రభుత్వ భూమిపై మళ్లీ అక్రమాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి, ఆ స్థలం చెరువు శిఖం భూమిగా నిర్ధారించారు. ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరగకుండా ఉండేందుకు అక్కడ రెవెన్యూ హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేశారు.
అయితే ఇటీవల ఆ హెచ్చరిక బోర్డు కనిపించకుండా పోవడంతో స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది. బోర్డు తొలగింపు వెనుక ఎవరు ఉన్నారు అనే అంశంపై అధికారులు తక్షణమే దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల మార్పులు జరిగినప్పటికీ అక్రమాలపై నిర్లక్ష్యం కొనసాగుతుందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ భూములు ప్రజా అవసరాలకు వినియోగించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జవహర్ నగర్ ప్రాంతంలో ఇప్పటివరకు ప్రభుత్వ ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీ లేదని, విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సర్వే నెంబర్ 268లోని ప్రభుత్వ భూమిని పరిరక్షించి, అక్కడ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ లేదా ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖలు సమగ్ర సర్వే నిర్వహించి, చెరువు శిఖం భూమిని కాపాడుతూ ప్రజా ప్రయోజనాలకు అనుకూలంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
