- పసిఫిక్ లో 6.7 తీవ్రతతో సంభవించిన భూకంపం
- ఇవాతె రాష్ట్ర తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు
- సంరకు తీర సముద్ర గర్భంలో భూకంప కేంద్రం
జపాన్ ఈశాన్య తీర ప్రాంతం ఆదివారం మరోసారి భూకంపం ధాటికి కుదేలైంది. పసిఫిక్ మహాసముద్రంలో రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల విస్తార ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం తరువాత ఇవాతె రాష్ట్ర తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీచేయడంతో ప్రజల్లో భయాందోళనలు చెలరేగాయి. కొన్ని ప్రాంతాల్లో సముద్ర అలలు ఎగసిపడటంతో తీర ప్రాంత ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించమని అధికారులు సూచించారు. జపాన్ వాతావరణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:03 గంటలకు సంధికు తీరానికి సమీపంలో సముద్ర గర్భంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది.
భూకంపం కారణంగా ఇవాతె రాష్ట్ర తీరానికి ఒక మీటరు ఎత్తులో సునామీ అలలు తాకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఒపునాటో, మియాకో తీరాల్లో ఇప్పటికే 10 సెంటీమీటర్ల ఎత్తు అలలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో పాటు తొహెూకు షింకన్సెన్ బుల్లెట్ రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే కొద్ది గంటలకే సర్వీసులను పునరుద్ధరించినట్లు జేఆర్ ఈస్ట్ సంస్థ ప్రకటించింది. ఈ ఘటనపై జపాన్ ప్రధానమంత్రి సనాయె తకైచి స్పందిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. “సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. దయచేసి తీరం నుంచి దూరంగా ఉండండి. ఊహించిన దానికంటే పెద్ద సునామీ రావచ్చు.
భూకంపం తర్వాత ప్రకంపనలు మళ్లీ సంభవించే అవకాశం ఉంది” అని ఆమె సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. మియాగి రాష్ట్రంలోని ఒనగావా అణు విద్యుత్ కేంద్రంలో ఎటువంటి నష్టం జరగలేదని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని తొహెూకు ఎలక్ట్రిక్ పవర్ సంస్థ స్పష్టం చేసింది. అయితే, రానున్న కొన్ని రోజుల్లో ఇదే తీవ్రత గల, లేకుంటే మరింత శక్తివంతమైన భూకంపాలు కూడా సంభవించే అవకాశం ఉందని వాతావరణ సంస్థ అధికారులు హెచ్చరించారు. సునామీ ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు సముద్రతీరాలకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.
