నవరసాల సారమే జీవనం. అందులో ఏ రసం పాలు తక్కువైనా సమస్య లేదు గానీ హాస్యరసం పాలు మాత్రం అస్సలు తక్కువ కాకూడదు. అది లోపిస్తే జీవితమంతా వేదనే. నేటి యాంత్రిక జీవనంలో, పోటీ ప్రపంచంలో మన జీవితాల్లో హాస్యరసం పాలు క్రమంగా తగ్గిపోతోంది. ఆవేశం, ఆగ్రహం, అసంతృప్తి, అహం, మానసిక ఒత్తిడి వంటివి నవ్వును, నవ్వే గుణాన్ని మింగేస్తున్నాయి.
ప్రపంచ నవ్వుల దినోత్సవం(World Laughter Day) తొలిసారిగా 1998 జనవరి 10న మన దేశంలోని ముంబైలో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా నవ్వు యోగా ఉద్యమాన్ని ప్రారంభించిన డాక్టర్ మదన్ కటారియా(Dr.Madan Kataria) ఈ దినోత్సవాన్ని ఏర్పాటుచేశారు. మొదట జనవరి రెండో ఆదివారం జరుపుకునేవారు. జనవరిలో చలి ఎక్కువగా ఉంటుందన్న హాస్యప్రియుల కోరిక మేరకు లాఫ్టర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ దీన్ని మే మొదటి ఆదివారం జరుపుతూ వచ్చింది. అయితే జనవరి 10న మొదటిసారి ఈ దినోత్సవాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది భారతదేశం, భారతీయుడే కావడం విశేషం.
ముంబైకి చెందిన ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ మదన్ కటారియా ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని సృష్టించారు. ‘నవ్వు ఒక యోగం’ అనే కాన్సెప్ట్‌ను ప్రపంచానికి చాటిన ఆయన భారతీయుడే కావడం గమనార్హం. వ్యక్తులు తమను తాము మార్చుకోవడానికి, ప్రపంచాన్ని శాంతియుతంగా, సానుకూలంగా మార్చడానికి అవసరమైన శక్తివంతమైన భావోద్వేగం నవ్వు ఒక్కటే. నవ్వు అనేది ఒక వ్యక్తి ముఖ కవళికలపై, భావోద్వేగాలపై ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో మదన్ కటారియా నవ్వు యోగా ఉద్యమాన్ని ప్రారంభించాడు.
మొదట్లో నవ్వుల క్లబ్(Laughter Club)గా ప్రారంభమైన ఈ వేడుక తర్వాత కాలంలో 65 దేశాల్లో 6 వేల క్లబ్బుల వరకు విస్తరించింది. నవ్వడం వల్ల శరీరంలో ఉన్న రోగాలన్నీ మటుమాయమైపోతాయని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. నవ్వడం వల్ల జీవితంలోని ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చని వారంటున్నారు. రోజులో కనీసం నాలుగైదు సార్లయినా మనసారా నవ్వడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. ఒక మనిషి సంతోషంగా ఉంటే అతని కుటుంబం సంతోషంగా ఉంటుంది. అలా కుటుంబాలన్నీ సంతోషంగా ఉంటే సమాజమంతా సంతోషంగా ఉంటుంది. అప్పుడు ప్రపంచమంతా సంతోషంగా ఉంటుందనేది ఈ నవ్వుల దినోత్సవ నిర్వహణ వెనక ఉన్న భావన.
హాస్యానికి పుట్టినిల్లు భారత్
మన దేశంలో హాస్యానికి తొలి నుంచీ పెద్దపీటే. రాజుల ఆస్థానాల్లో విదూషకులు కేవలం మహారాజులను నవ్వించడానికే ఉండేవారు. తెనాలి రామకృష్ణుడు, బీర్బల్ పండించిన హాస్యం అజరామరం. ఈ రెండు తరహా కథలు నవ్వుతోపాటు ఆలోచననూ కలిగిస్తాయి. నిజానికి నవ్వుతో లేదా జోక్‍తో ఆలోచనను రేకెత్తించే హాస్యమే మరుపు రాకుండా మిగిలిపోతుంది. అక్బర్-బీర్బల్ కథలు ఎన్నో ఆలోచనలను రేకెత్తిస్తాయి. తెనాలి రామకృష్ణుడి కథలు తెలివిని పెంచుతాయి. పరమానందయ్య శిష్యుల కథలు కూడా మంచి హాస్యాన్ని పుట్టిస్తాయి. మన జానపద గీతాల్లోనూ హాస్యరసం పొంగి పొర్లుతుంది. ఇంకా పల్లెసుద్దుల్లో, పల్లెల్లో పనీపాటా చేసుకుంటూ పాడుకునే పాటల్లో ఎంతో సునిశిత హాస్యం దొర్లుతుంది.
పువ్వులు, పక్షులు, జంతువులు తమ స్వభావాలతో తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, పరిసరాలను ఆనందమయంగా చేసుకుంటాయి. వాటితో పోలిస్తే విచక్షణ, వివేకం కలిగిన మానవులం ఈ జీవితాన్ని, ఎందుకు సంతోషకరం చేసుకోలేం. ఈ సృష్టిలో పైసా ఖర్చు లేనిది చిరునవ్వు మాత్రమే. కానీ.. దాన్ని కొనితెచ్చు కోవాల్సినంత దుస్థితిలో మానవ జీవితాలు ఉన్నాయి.
ఈ రోజుల్లో వస్తున్న సగం జబ్బులకు ఒత్తిడే కారణం. 70 శాతం రోగాలు ఒత్తిడితోనే కలుగుతున్నాయనేది వైద్య అధ్యయనాల సారాంశం. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, డిప్రెషన్(కుంగుబాటు), అలర్జీ, ఇన్సోమియా, ఆతృత, పెప్టిక్ అల్సర్.. ఇవన్నీ ఒత్తిడి వల్ల వచ్చేవే. నవ్వుల టానిక్ మాత్రమే వీటికి ఔషధం. ఉదయం లేస్తూనే ఒక చిరునవ్వును ముఖంపైకి తెచ్చుకుంటే ఇవన్నీ మటుమాయమైనట్టే. నవ్వుతో రోగనిరోధక వ్యవస్థకు అవసరమైన లింపాజైట్స్ ఉత్పత్తి పెరుగుతుంది. ముక్కు, శ్వాసకోశాల్లోని పొరల్లో మెరుగుదల ఉంటుంది. శరీరంలో సహజరోగ నిరోధక హార్మోన్ల ఉత్పత్తి పెరిగి ఆర్థరైటిస్, స్పాండలైటిస్, మైగ్రేన్ లాంటి వ్యాధులకు ఉపశమనం లభిస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం, రక్తంలో ఆక్సిజన్ పరిమాణం పెరుగుతాయి. దీనివల్ల ఆస్తమా రోగులకూ మేలు జరుగుతుంది.
మనుషులు వేర్వేరు భాషలు, దేశాలకు చెందినవారైనా అందరికీ అర్థమయ్యే, అందరికీ వచ్చే యూనివర్షల్ లాంగ్వేజ్ మాత్రం నవ్వే. ఇది ఎవరూ నేర్చుకొనే అవసరం లేని భాష. అందరిలోనూ సహజ, స్వభావసిద్ధంగా ఉంటుంది. అయితే, ప్రతి మనిషీ తనలో సహజంగా ఉండే నవ్వును నవ్వడం లేదా దాన్ని ఉపయోగించడం నానాటికీ మరిచిపోతున్నాడు. పుట్టుకతోనే అబ్బే విద్య నవ్వు మాత్రమే. సకల జీవరాశిలో మనిషికి మాత్రమే నవ్వుకునే, నవ్వే గుణమూ, లక్షణమూ ఉన్నాయనుకోవడం అజ్ఞానం. చాలా గుణాల్లాగే నవ్వు కూడా మన చుట్టూ ఉన్న జీవరాశి అంతటిలో ఉన్నాయి. పువ్వులు వికసించడమే హాస్యం. పక్షుల కిలకిలరావాలే కిలకిలల నవ్వులు. జంతువులు చేసే కొన్ని శబ్దాలు నవ్వులకు సంకేతాలే. నవ్వు అనేది మనిషి అభ్యాసంతో నేర్చుకునే విద్య కాదు. జన్మతః లభించిన లక్షణం.
సెల్ ఫోన్లు(Cellphones) మానవ జీవితంపై ఎంతో ప్రభావం చూపుతున్నాయి. సెల్‍ఫోన్లు వచ్చాక మనుషుల మధ్య మాటలే కరువయ్యాయి. ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకుంటేనే కదా ఆ సంభాషణలో నుంచి హాస్యం పుట్టేది. ఇప్పుడు ఎవరికి వారు సెల్‍ఫోన్లతోనే మాట్లాడుతున్నారు. అరచేతిలోని సెల్ ఫోన్ మనసుకు నవ్వును తాకనివ్వడంలేదని ఎవరూ గుర్తించడం లేదు. వాట్సాప్‍లో పోస్టుల జోకులకే నవ్వుతున్నాం. స్వతహాగా నవ్వడం ఏనాడో మరిచిపోయాం. చింతలు, చికాకులు, అర్థంలేని లక్ష్యాల వైపు పరుగులతో మనిషిలో హాస్య ప్రియత్వ సహజ లక్షణం తగ్గిపోతోంది. నవ్వు ఇలా మహాభాగ్యమైపోయినందుకే లాఫింగ్ క్లబ్బులు వచ్చాయి. మనిషి కొత్తగా నవ్వడం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నవ్వు యోగమే కాదు. నవ్వు వ్యాయామం(Exercise) కూడా. ముఖంలో నవ్వు కనబడాలి అంటే ముఖంలోని ముప్పై రెండు కండరాలు కదలాలట. నవ్వడం కూడా ఒక వ్యాయామం. ఒక్క నవ్వుతో 32 కండరాలను కదిలించడం అంటే అది ఎంత గొప్ప వ్యాయామం కాక మరేమిటి. చక్కని నవ్వు వల్ల ముఖ కవళికలు మెరుగవుతాయి. ముఖ కండరాల్లో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. వృద్ధాప్య ఛాయలు, ముడతలను దరి చేరనివ్వదు. మనసు స్వచ్ఛంగా ఉన్న వాళ్లకే స్వచ్ఛమైన నవ్వు వస్తుంది.
యోగాతో పోలిస్తే నవ్వడం చాలా సులువు. యోగా అంటే కొన్ని భంగిమలు ప్రదర్శించాలి. దీనికి అవేమీ అవసరం లేదు. పెదాలను కాస్త కదిలిస్తే చాలు. మానసిక ఒత్తిడిని నవ్వు తగ్గిస్తుంది. హాయిగా నవ్వడం వల్ల ఒత్తిడి దిగిపోయి రిలాక్స్ కలుగుతుంది. కుంగుబాటు (డిప్రెషన్) నుంచి నవ్వు బయటపడేస్తుంది. ఉద్విగ్నత, భావోద్వేగాలను నవ్వు సమస్థితిలో ఉంచుతుంది. ఇవి అదుపులో ఉంటేనే ఇతరులతో సంబంధ బాంధవ్యాలు సవ్యంగా చేయగలుగుతారు. అంటే మనసులో ఎటువంటి కల్మషం లేని వారు మనసారా స్వచ్ఛంగా నవ్వగలరు.
(జనవరి 10న ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా)
- రామకిష్టయ్య సంగనభట్ల
