- చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన మాజీ సీఎం జగన్..
- విజనరీ నాయకత్వంలో ఏపీ వెనుకబడి పోయింది..
- అబద్దాలు ఆగకుండా కొనసాగుతున్నాయి..
ఏపీ సీఎం చంద్రబాబు పనితీరుపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. ప్రచారం ఎక్కువ.. పని తక్కువ అన్నట్లుగా చంద్రబాబు విజన్ ఉందని ఎద్దేవా చేశారు. పన్నుల ఆదాయంలో దేశంలో ఏపీ 22వ ర్యాంకులో ఉందని.. అయినప్పటికీ చంద్రబాబు మోసాలు, అబద్ధాలు ఆగకుండా కొనసాగుతున్నాయని విమర్శించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటుందనేందుకు ప్రభుత్వ ఆదాయాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయని జగన్ తెలిపారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కల్పిత జీఎస్‌డీపీ గణాంకాలతో ప్రజలను మభ్యపెట్టి, రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందనే తప్పుడు భావన కలిగిస్తోందని పేర్కొన్నారు.
2024–25లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 11.75 శాతం ( నామినల్ జీఎస్‌డీపీ )గా ఉందని, జాతీయ వృద్ధిరేటు 9.8శాతం మాత్రమేనని; అలాగే 2025 –26లో రాష్ట్ర వృద్ధి 10.75శాతంగా ఉంటుందని, జాతీయ వృద్ధిరేటు 8.0 శాతం మాత్రమేనని చంద్రబాబు ప్రభుత్వం సోమవారం ప్రకటించిందని తెలిపారు. దీని ప్రకారం 2023–24 నుంచి 2024–25 మధ్య రెండేళ్ల కాలానికి సగటు వార్షిక వృద్ధిరేటు 11.09 శాతంగా చూపిస్తోందన్నారు.
అంతేకాదు, వాస్తవ జీఎస్‌డీపీ వృద్ధి పరంగా ఈ ఏడాది రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో ఉందని కూడా ప్రభుత్వం చెబుతోందని పేర్కొన్నారు. అయితే ఇవేవీ స్వతంత్ర సంస్థలు విడుదల చేసిన గణాంకాలు కావు, ఇవి పూర్తిగా చంద్రబాబు కార్యాలయంలో తయారుచేసిన అంకెలే. వాటినే వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
