- మైనార్టీలను మోసం చేస్తున్న బిజెపి, వైసిపి
- పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిది బీజేపీతో అక్రమ పొత్తు అని ఆంధప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ బీజేపీకి దత్తపుత్రుడని విమర్శించారు. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏపీసీసీ మైనార్టీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా షర్మిల పాల్గొని మాట్లాడారు. సెక్యులర్ పార్టీ ముసుగులో మైనారిటీలను టీడీపీ, వైసీపీలు మోసం చేస్తున్నాయని ఆరోపించారు. మైనారిటీల ప్రయోజనాలు దెబ్బతీసే అన్ని బిల్లులకు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ కొడుకు అయ్యి ఉండి ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న బిల్లులకు జగన్ మద్దతు ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీలు మైనారిటీ-లను ఉద్ధరించింది శూన్యమని విమర్శించారు వైఎస్ షర్మిల. గత పదేళ్లుగా ఇచ్చిన ఒక్క హావిూని కూడా మోదీ ప్రభుత్వం ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. చంద్రబాబు, జగన్ ఇద్దరు మైనారిటీల పట్ల ద్రోహులేనని విమర్శించారు. 45, 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. ముస్లింలకు ఇస్లామిక్ బ్యాంక్ అని మోసం చేశారని షాకింగ్ కామెంట్స్ చేశారు షర్మిల. మతతత్వ బీజేపీ పాలనలో మైనార్టీలకు రక్షణ లేదని ఆరోపించారు.
మైనారిటీ హక్కుల పట్ల బీజేపీకి విలువ లేదని విమర్శించారు. హిందూ – ముస్లిం భాయి భాయి అనేది కాంగ్రెస్ సిద్ధాంతమని ఉద్ఘాటించారు. హిందూ – ముస్లిం, క్రిస్టియన్ మధ్య చిచ్చు పెట్టడం బీజేపీ సిద్ధాంతమని విమర్శించారు. చిచ్చు పెట్టీ ఆ మంటల్లో చలి కాచుకోవడం బీజేపీ సిద్ధాంతమని ఎద్దేవా చేశారు. మతం పేరుతో, విభజన పేరుతో బీజేపీ మంటలు పెడుతోందని ధ్వజమెత్తారు. మతాలుగా ఈ దేశాన్ని బీజేపీ విభజిస్తోందని ఆక్షేపించారు వైఎస్ షర్మిల. ముస్లిం చట్టాల్లో బీజేపీ వేలు పెడుతోందని వైఎస్ షర్మిల మండిపడ్డారు. సీఏఏ, వక్ఫ్ బోర్డు సవరణ, ఆర్టికల్ 370, అయోధ్య రామమందిరం లాంటి వివాదాలతో ముస్లిం మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీశారని ఫైర్ అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో బ్రిటిషర్.. విభజించు పాలించు లాంటి బ్రిటీ-ష్ సిద్ధాంతాలను అమలు చేస్తున్నారని ఆరోపించారు. మణిపూర్, గోద్రా అల్లర్లు ఇందుకు నిదర్శనమని చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైసీపీలు పూర్తిగా బీజేపీ పార్టీలేనని విమర్శించారు. 45, 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. టీడీపీ, జనసేన బహిరంగ పొత్తు అని విమర్శించారు వైఎస్ షర్మిల. ముస్లింలకు ఇస్లామిక్ బ్యాంక్ అని, మైనారిటీ సబ్ ఎª`లాన్ అని, ముస్లిం నిరుద్యోగులకు రూ. 5 లక్షల సహాయమని, వడ్డీ లేని రుణాలని మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో, దేశంలో మైనారిటీల హక్కులు కాపాడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఉద్ఘాటించారు. ముస్లింలు, క్రిస్టియన్లు కాంగ్రెస్ పార్టీని విశ్వశిస్తున్నారని.. వారి నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ మళ్లీ తిరిగి తమకు వచ్చేలా ప్రతి ఒక్కరూ కష్టపడాలని షర్మిల పిలుపునిచ్చారు.