ఆగ్నేయ బంగాళాఖాతంలో (Bay Of Bengal) వాయుగుండం కొనసాగుతుందని, ఇది గడిచిన 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో కదులుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ (Disaster Management Authority) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతానికి వాయుగుండం పోర్ట్ బ్లెయిర్ కి 510 కి.మీ, చెన్నైకి 890 కి.మీ, విశాఖపట్నం(Vishakapatnam)కి 920 కి.మీ, కాకినాడ(Kakinada)కి 920 కి.మీ, గోపాల్‌పూర్ కి 1000 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ రేపటికి తీవ్రవాయుగుండంగా, సోమవారం ఉదయానికి తుపానుగా, మంగళవారం ఉదయానికి తీవ్రతుపానుగా బలపడుతుందని వివరించారు. మంగళవారం సాయంత్రం/రాత్రి సమయంలో మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. తీరము దాటే సమయములో గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందన్నారు. మత్స్యకారులు (Fishermen) వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.
సోమ, మంగళవారాల్లో తుపాను ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandra Babu) గారి ఆదేశానుసారం ముందస్తు సహయక చర్యల కోసం 8 ఎన్డీఆర్ఎఫ్, 9 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాల్లో సిద్ధంగా ఉంచమన్నారు తెలిపారు. ఇప్పటికే ప్రభావం చూపే జిల్లాల యంత్రాంగానికి తుపాను ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) అమలుపై సూచనలు ఇచ్చామన్నారు. సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగసిపడనున్నందున నదులు, సముద్ర తీరాల్లో చేపలు పట్టడం, అన్ని బోటింగ్ కార్యకలాపాలు బుధవారం వరకు నిలిపివేయాలని, అలాగే బీచ్‌లకు పర్యాటకుల ప్రవేశం కుడా నిషేధించాలని కోస్తా జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు.
ప్రజలు సోషల్ మీడియా వదంతులను నమ్మొద్దని, అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర సమాచారం, సహయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ లోని టోల్ ఫ్రీ 112, 1070, 18004250101 నంబర్లు సంప్రదించాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అలెర్ట్ గా ఉండాలన్నారు. తుపాను సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేసారు.
రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. సోమ, మంగళవారాల్లో వాతావరణం క్రింది విధంగా ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.
సోమవారం(27-10-25) :
- బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
- కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
మంగళవారం (28-10-25) : - కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
- ఉత్తరాంధ్ర, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
