- అధికారుల అండతో అక్రమార్కుల దందా..
- బలికానున్న అమాయక ప్రజలు!
- ఎల్బీనగర్ జోన్ టౌన్ ప్లానింగ్ అధికారులను సస్పెండ్ చేయాలి
- హెచ్ఎంసి యాక్ట్ 1955 ప్రకారం చర్యలు తీసుకోవాలి..
- అక్రమ నిర్మాణాన్ని తక్షణమే కూల్చివేయాలి
- జీహెచ్ఎంసీ కమిషనర్ కు ప్రజల డిమాండ్
కంచే చేను మేసినట్లు’.. రక్షించాల్సిన అధికారులే భక్షకులుగా మారుతు న్నారు. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూములను కాపాడాల్సిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగమే, అక్రమార్కులతో కుమ్మక్కై ఇండస్ట్రీయల్ బఫర్ జోన్లను కబ్జాదారులకు అప్పనంగా కట్టబెడుతోంది. కాప్రా సర్కిల్ పరిధిలోని నాచారం అన్నపూర్ణ కాలనీ సర్వే నెం. 106, 107 లోని కీలకమైన ఇండస్ట్రియల్ ఏరియా బఫర్ జోన్ స్థలం కబ్జాకు గురవుతున్న వైనంపై ‘ఆదాబ్ హైదరాబాద్’ గతంలో ప్రచురించిన కథనానికి స్పందన వస్తున్నా. అధికారుల చర్యలు మాత్రం శూన్యం.

అసలు స్కామ్ ఇదే:
ముందు అనుమతి.. ఆపై కూల్చివేత.. నట్టేట మునుగుతున్న ప్రజలు ఈ వ్యవహారంలో అత్యంత దారుణమైన కోణం మరొకటి ఉంది. అక్రమార్కులు కేవలం భూమిని కబ్జా చేయడమే కాదు, అవినీతి అధికారుల అండదండలతో అక్కడ వేగంగా అక్రమ నిర్మాణాలు (అపార్ట్మెంట్లు) చేపడుతున్నారు. ఆ తర్వాత, ఏ పాపం తెలియని అమాయక ప్రజలకు, మధ్యతరగతి కుటుంబాలకు ఆ ఫ్లాట్లను అంటగట్టి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. సొంత ఇల్లు కొనాలన్న కల నిజం అవుతుందని ఆశపడిన ప్రజలు, కష్టపడి పైసా పైసా కూడబెట్టిన సొమ్మును ఈ అక్రమ నిర్మాణాల్లో పెడుతున్నారు. అక్రమార్కులు, అధికారులు తమ జేబులు నింపుకున్నాక, ఏదో ఒక దశలో అది ‘బఫర్ జోన్’ అని అధికారులు ఆలస్యంగా గుర్తించి చర్యలకు ఉపక్రమిస్తారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అల్టిమేట్గా ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు సర్వస్వం కోల్పోయి మోసపోతున్నారు. ముడుపులు తీసుకున్న అధికారులు క్షేమంగా ఉంటున్నారు, అక్రమంగా నిర్మాణం చేపట్టిన బిల్డర్లు లాభాలతో క్షేమంగా ఉంటున్నారు. చివరగా నష్టపోయేది కేవలం ప్రజలు మాత్రమే. ఈ విధంగా ప్రజలు మోసపోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా జీహెచ్ఎంసీ అధికారులే కారణమని ప్రజలు మండిపడుతున్నారు.

అధికారుల అండతోనే అక్రమాలు
అక్రమార్కులు విసిరే ‘ఎంగిలి మెతుకుల’కు ఆశపడిన కొందరు ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ అధికారులు, కనీసం క్షేత్రస్థాయి పరిశీలన జరపకుండానే నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేశారు. ఈ అక్రమాలపై ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా, ఇంతవరకు ఆ ఆక్రమ అనుమతులను రద్దు చేయకపోవడం వెనుక పెద్ద ‘కుంభకోణం’ దాగి ఉందని స్పష్టమవుతోంది. అధికారులు ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తూ కబ్జాదారులకు సహకరిస్తున్నారని స్థానికులు, ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. “దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు”, పత్రికల్లో వార్తలు వచ్చాక, ఫిర్యాదులు వెల్లువెత్తాక కూడా అధికారులు చర్యలు తీసుకోకపోవడం వారి అవినీతికి నిదర్శనమని కృష్ణారెడ్డి అనే ఫిర్యాదుదారు ఆరోపిం చారు. గతంలో ఇదే స్థలంలో నిర్మాణం చేపట్టాలని చూస్తే రెవెన్యూ అధికారులు అడ్డుకొని కూల్చివేతలు కూడా జరిపారని, అలాంటి సున్నితమైన బఫర్ జోన్ స్థలానికి టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలా అనుమతులు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారానికి స్థానిక కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్, ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అండగా నిలుస్తూ, అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని,అందుకే వారు చర్యలకు వెనుకాడుతున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

కమిషనర్ గారూ.. ఇంకెప్పుడు స్పందిస్తారు?
ఈ మొత్తం వ్యవహారంపై జీహెచ్ఎంసీ కమిషనర్ తక్షణమే దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు’ కాకుండా, అమాయక ప్రజలు మోసపోకముందే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజా ప్రయోజనాలకు విఘాతం కల్పిస్తూ, హెచ్ఎంసి యాక్ట్ 1955 కు విరుద్ధంగా అనుమతులు జారీ చేసిన ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలోని బాధ్యులైన టౌన్ ప్లానింగ్ అధికారులను తక్షణమే విదుల నుండి తొలగించి (సస్పెండ్ చేసి), వారిపై కఠినమైన శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అంతేకాకుండా, బఫర్ జోన్లో అక్రమంగా చేపట్టిన నిర్మాణాన్ని వెంటనే కూల్చివేసి, ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని, దొంగ పత్రాలు సృష్టించిన అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు ఉన్నతాధికారులను గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

