- సుప్రీం లీడర్ అయతుల్లా ఆలీ ఖమేనీ హతం..
ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే ఆ దేశపు సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తోపాటు ఇరాన్ రక్షణ మంత్రి జనరల్ అమిర్ నసీర్జాదే, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ అబ్దోల్ రహీమ్ మౌసావి, ఖమేనీ కుమార్తె, మనవడు, అల్లుడు, కొడుకు మృతిచెందారు. ఇరాన్ రక్షణ మండలి సమావేశాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన వైమానిక దాడిలో రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్ మరణించారు.
రక్షణ మంత్రి మరణించినట్లు ఇప్పటికే వార్తలు వెలువడినా ఇరాన్ అధికారిక ఆదివారం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. సాయుధ దళాలకు చెందిన పలువురు కమాండర్లు కూడా మరణించారని, వారి పేర్లను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. మరోవైపు అమెరికాతో కలిసి చేపట్టిన సంయుక్త దాడుల్లో భాగంగా ఇరాన్‌పై శనివారం ఒక్కరోజే 1,200కి పైగా బాంబులను జారవిడిచినట్లు ఇజ్రాయెల్ వైమానిక దళం ప్రకటించింది.
కాగా తమ దేశంపైకి ఇరాన్ 137 క్షిపణులు, 209 డ్రోన్లను ప్రయోగించిందని యూఏఈ రక్షణశాఖ వెల్లడించింది. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయని తెలిపింది. దుబాయ్‌లో డ్రోన్ల శకలాలు ఇళ్లపై పడటంతో ఇద్దరు గాయపడ్డారు. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌లో దాదాపు 40 భవనాలు ధ్వంసమయ్యాయి. 200 మంది నివాసితులను అధికారులు సురక్షితంగా తరలించారు.
