- హైదరాబాద్, బెంగుళూరు జట్లకు బౌలింగ్ కష్టాలు..
- చెన్నై తరఫున ఆడనున్న చౌటా సంజు సాంసన్..
మరో పదిరోజుల్లో మొదలుకానున్న ఐపీఎల్-19వ సీజన్‌కు ముందు ఆరంభ మ్యాచ్ ఆడనున్న డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు బౌలింగ్ కష్టాలు తప్పేలా లేవు. ఈ జట్లకు ఆడుతున్న ఆస్ట్రేలియా పేస్ ద్వయం పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరమవనున్నారని తెలుస్తున్నది. గత రెండు సీజన్లుగా ఎస్‌ఆర్‌హెచ్‌కు సారథిగా వ్యవహరిస్తున్న కమిన్స్..
వెన్ను గాయం కారణంగా నిరుటి యాషెస్ సిరీస్ నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అతడింకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. ఇక తొడ కండరాలు, కాలి మడమ గాయంతో ఐదునెలలుగా ఆటకు దూరమైన హాజిల్‌వుడ్ సైతం ఇంకా పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించలేదు. ఐపీఎల్ రెండో అంచెలో ఈ ఇద్దరూ ఆయా జట్లతో కలిసే అవకాశమున్నట్టు వార్తలొస్తున్నాయి.
ఈనెల 28 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ కోసం ఆయా జట్ల క్రికెటర్లు సన్నాహాలు షురూ చేశారు. దేశవాళీ క్రికెటర్లు ఇప్పటికే ప్రాక్టీస్‌లో చెమటోడుస్తుండగా, అంతర్జాతీయ క్రికెటర్లు తమ తమ ఫ్రాంచైజీలతో చేరుతున్నారు. సీజన్‌కు ముందు డిఫెండింగ్ చాంపియన్ ఆర్‌సీబీకి హాజిల్‌వుడ్ రూపంలో ఎదురుదెబ్బ తాకగా, ఎస్‌ఆర్‌హెచ్ కొన్ని మ్యాచ్‌లకు ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది.
గత సీజన్ల లాగే చెన్నై ఐకాన్ ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వెలువడుతుండగా, ‘ముంబై చా రాజా’ రోహిత్‌శర్మ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. రాజస్థాన్ రాయల్స్‌తో తన బంధాన్ని తెంచుకున్న చెటా సంజూ శాంసన్..ఈసారి చెన్నై తరఫున అదరగొట్టేందుకు సై అంటున్నాడు.
