నీ గుణమే నీ అసలైన కీర్తి
నీ నీతియే నీ నిజమైన ఆస్తి
మనిషి కీర్తి కొరకు
ఆరాటపడుతాడు
అవార్డుల రివార్డుల
కొరకు ప్రయత్నిస్తాడు
అవార్డుల రేసులో
ఇతరులతో పోటీ
పడతాడు
ఓ మనిషి అవార్డుల కొరకు
నీ సహజ గుణాన్ని
వ్యక్తిత్వాన్ని మార్చుకోకు

ఇతరుల మెప్పుకోసం
నీ మేలిమి గుణాన్ని
వదులుకోకు
చప్పట్ల చప్పుడు కోసం
నీ సహజ వైఖరిని
మార్చుకోకు
అవార్డులు రివార్డులు
ప్రోత్సహమే కాని
అదే నీజీవిత గమ్యం
కారాదు
జనం మెప్పుకోసం
బతుకద్దు
నీమనసుకు నచ్చినట్లు
నీబుద్ధి మెచ్చినట్లు
జీవించడమే ముద్దు
నీ మనసే నీ భావి
జీవితానికి దిక్సూచి
బిరుదులకు పొంగిపోక
విమర్శలకు కుంగిపోక
అవార్డుల హైరానా
వలయంలో చిక్కుకొని
నీలో నిగూఢమైన
ప్రతిభ సామర్థ్యాలను
కీర్తి కండూతితో కప్పి
వేయకు
నీలోని ప్రతిభ సామర్ధ్యాలతో
ఆత్మవిశ్వాసంతో అడుగులు
ముందు కెయ్యాలి
నైపుణ్యాభివృద్ధిలో సారథిగా
ఎదుగాలి
సుస్థిరాభివృద్ధితో జాతి సంపద
సౌభాగ్యం పెంచాలి
ఎవ్వరు మెచ్చక పోయిన
పువ్వు తన సహజ గంధాన్ని
మార్చుకోదు
పూసిన పువ్వులన్నీ పూజకు
వెళుతాయన్న గ్యారంటిలేదు
మనిషి ఏ అవసరానికి
వాడుకున్న పువ్వు ప్రకృతి
సిద్ధంగా వచ్చిన
వాసనను వదులుకోదు
ఎవరి కొరకో సముద్రం
తన గాంభీర్యతను వీడదు
చెట్టును కొట్టిన నీడనివ్వక
మానదు
ప్రతిఫలాన్ని ఆశించక
జనహితమే పరమావధిగా
చెట్టు తన ప్రకృతి ధర్మాన్ని
పాటిస్తుంది
మేఘం గర్జించక మానదు
నీ గుణమే నీ అసలైన కీర్తి
నీ నీతియే నీకు అసలైన ఆస్తి
అవార్డులు వస్తుంటాయి
పోతుంటాయి
ఆకాశంలో మబ్బులు
వస్తుంటాయి పోతుంటాయి
ఆకాశం మాత్రం శాశ్వతం
సమాజంలో నీవు చేసే సేవ
నీవ్యక్తిత్వం రచనలు స్పూర్తి
దాయక సేవలు చరిత్రలో
నిరంతరం నిలిచిపోతాయి
అవార్డుల రివార్డుల కొరకు
ఆత్మగౌరవాన్ని వదులుకోకు
అడ్డదారులతో
అందలమెక్కబోకు
బిరుదుల బరువుల్లోపడి
నీవ్యక్తిత్వాన్ని కోల్పోకు
నీవ్యక్తిత్వమే నీగుర్తింపు
నీలోని మానవీయతే
నీ ఉనికి
నీలోని నిరాడంబరతే
నీ బలం నీ బలగం
గెలుపు అంటే మెడలో
మెరిసే పతాకం కాదు
గుండెల్లో మెరిసే నిజాయితీ
నిజాయితీయే నీజీవన
విధానం కావాలి
పరోపకారం ప్రగతిశీలత
నీ కార్యాచరణ కావాలి
నీ మంచి పనులు సత్ప్రవర్తన
నిబద్ధత నిస్వార్థం పట్టుదల
సంకల్పం త్యాగశీలత సౌహార్ధత
సమన్వయత సంఘీభావం చైతన్యం
నిన్ను చరిత్రలో ప్రభావశీల
స్థానంలో నిలుపుతాయి
నీ నీతి నిజాయితీ నిస్వార్థ
జీవన శైలితో సమాజానికి
దారి దీపమై నిలవాలి
ఉత్తమ సమాజ నిర్మాణానికి
స్పూర్తి కేంద్రమై వికసిత
భారత నిర్మాణానికి
అగ్రేసరుడిగా అడుగు
ముందుకు వేయాలి
జాతి సర్వోన్నతికై
ఉద్యుక్తులం కావాలి
