బడులను బాగు చేయండి
బాలల భవిష్యత్తుకు బాటలు వేయండి
విద్యా హక్కు.. కేవలం చట్టం కాదు..
ప్రతి చిన్నారికి పుట్టుకతో వచ్చే హక్కు
దాన్ని కాలరాసే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు
విద్యా శాఖ ఉన్నతాధికారుల తనిఖీల్లో బయటపడ్డ వాస్తవాలు
తెలంగాణ రాష్ట్రంలోని విద్యా రంగం దుస్థితిని బట్టబయలు చేసింది
39 పాఠశాలల్లోని 16 పాఠశాలల్లో మాత్రమే బోధన జరుగుతోందట
వీటిలో పిల్లలే లేని పాఠశాలలు కొన్నయితే.. ఉపాధ్యాయులు లేనివి మరికొన్ని
పాలకుల పక్షపాతం, అధికారుల నిర్లక్ష్యం, ఉపాధ్యాయుల కొరత, బాధ్యతలేమి..
ఇవన్నీ కలిసొచ్చి రాష్ట్ర విద్యా రంగాన్ని అచేతనంగా, నిర్వీర్యంగా మార్చేశాయి?
ప్రభుత్వం ఇకనైనా మేలుకోపోతే పిల్లల భవిష్యత్తు చీకటిలోనే?
హైదరాబాద్: ఒకప్పుడు విద్యా దేవాలయాలు(Study Temples)గా భావించిన ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు తలుపులు మూసుకున్న భవనాలుగా మారిపోయాయి. చదువుల పట్ల ఎవరికీ ఆకాంక్ష తగ్గలేదు. కానీ.. ఆ చదువు నేర్పే వ్యవస్థే మసకబారిపోయింది. పిల్లల చేతుల్లో పుస్తకాలున్నా (Books) వారి మనసుల్లో ఆశల్లేవు. కారణం ఒక్కటే.. నెరిసిపోయిన విద్యా శాఖ (Education Department). విద్య పట్ల ప్రభుత్వం, విద్యా శాఖ అధికారులు నిర్లక్ష్యం చూపితే, ఉపాధ్యాయులు (Teachers) ఉత్సాహం కోల్పోతే, బోధన ఒక విధి నిర్వహణగా మారిపోతే, భవిష్యత్తు తరాలు చీకటి(Dark)లోకి నెట్టివేయబడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
రాష్ట్ర భవిష్యత్తు పునాది (Foundation) పాఠశాలల్లోనే నిర్మితమవుతుంది. ఆ పునాదులు బలహీనమైతే భవిష్యత్తు కూడా ఆందోళనకరంగా మారుతుంది. నేటి తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి చూస్తే ఆ భయమే నిజమవుతోందనిపిస్తోంది. ఒకప్పుడు ‘గురుకుల విద్యా సంస్థల స్ఫూర్తి’, ‘సర్కారీ పాఠశాలల ప్రతిష్ఠ’ అంటూ గర్వించే స్థాయిలో ఉన్న మన విద్యా వ్యవస్థ ఇప్పుడు నిర్వహణ లోపాలతో, నిర్లక్ష్యంతో, సమీక్షా యంత్రాంగం స్తబ్దతతో క్షీణత దిశగా పయనిస్తోంది. నాణ్యమైన విద్య అందించకపోతే ఎంతటి సంక్షేమ పథకాలు అమలుచేసినా పిల్లల భవిష్యత్తు చీకటిలోనే ఉంటుంది. విద్యా శాఖ ఈ సత్యాన్ని గుర్తించకపోవడం నిజంగా బాధాకరం.
- వాసు, స్టేట్ బ్యూరో, ఆదాబ్ హైదరాబాద్
నర్సంపేట, గుండ్లపల్లి మండలాల్లో ఇటీవల విద్యా శాఖ ఉన్నతాధికారుల తనిఖీల్లో బయటపడిన వాస్తవాలు ఒక్కొక్కటి విద్యా రంగంలోని దుస్థితికి నిదర్శనం. 39 పాఠశాలల్లోని 16 పాఠశాలల్లో మాత్రమే బోధన సక్రమంగా జరుగుతోందట. మిగతావి ‘హాజరు రికార్డుల్లో’ ఉన్నా ‘విద్యార్థుల మనసుల్లో’ లేవు. కొన్నింటిలో పిల్లలే లేని పాఠశాలలు, మరికొన్నింటిలో ఉపాధ్యాయులే లేని పాఠశాలలు. ఈ దృశ్యం ఒక విధంగా విద్యా శాఖ శవపేటికలా మారిందనిపిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం, ఉపాధ్యాయుల కొరత, బాధ్యతలేమి విద్యా రంగాన్ని నిశ్చేతనంగా మార్చేశాయి. పాఠశాలల గోడలు నిలిచినా.. బోధన విలువలు కూలిపోయాయి. పిల్లలు భౌతికంగా హాజరు రికార్డుల్లో ఉన్నా, వారి మనసుల్లో మాత్రం పాఠశాలల స్థానం నశిస్తోంది. ఇది కేవలం ఒక గ్రామ, మండల, జిల్లా సమస్య కాదు. మొత్తం రాష్ట్ర విద్యా వ్యవస్థను కుదిపేస్తున్న సమస్యగా రూపుదిద్దుకుంది.
ఉపాధ్యాయుల కొరత.. విద్యార్థుల నిరుత్సాహం..
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధాన సమస్య ఉపాధ్యాయుల కొరత. ఖాళీలు భర్తీ చేయకపోవడం వల్ల ఉన్నవారిపై భారం పెరుగుతోంది. ఒకే ఉపాధ్యాయుడు 3 తరగతులకు పాఠాలు చెప్పే పరిస్థితి నెలకొంది. దీనివల్ల బోధన నాణ్యతపై దుష్ప్రభావం పడుతోంది. పిల్లల్లో నిరుత్సాహం పెరుగుతోంది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థుల వలస పెరుగుతోంది.
అధికార యంత్రాంగం స్తబ్దత..
విద్యా శాఖలో ఉన్నతాధికారులు పర్యవేక్షణకు వెళ్లేంతవరకే చైతన్యం కనబడుతుంది. ఆ తర్వాత మళ్లీ మూగ నాటకం మొదలవుతుంది. తాత్కాలిక నివేదికలు, బలవంతపు సర్వేలు, డేటా సర్దుబాట్లు ఇవే విద్యా శాఖ ప్రగతి సూచికలుగా మారాయి. కానీ.. నేల స్థాయి వాస్తవం మాత్రం మారడం లేదు. ముఖ్యంగా మండల స్థాయిలో ఉన్న అధికారుల నిర్లక్ష్యం పరిస్థితిని మరింత దయనీయంగా మారుస్తోంది. పాఠశాలల్లో భౌతిక సదుపాయాల పరిశీలన, హాజరు పట్టికల పరిశీలన, బోధన ప్రమాణాల అంచనా ఇవన్నీ కాగితం మీదే మిగిలిపోతున్నాయి.
పిల్లల భవిష్యత్తుతో ఆటలు
కొన్ని చోట్ల పాఠశాలలు విద్యార్థుల్లేక మూతపడ్డాయి. కానీ.. అక్కడ ఉపాధ్యాయుల పేర్లు మాత్రం కొనసాగుతున్నాయి. ఇది కేవలం పరిపాలనా లోపం కాదు. ప్రజాధనం దుర్వినియోగం కూడా. ఒక పక్క విద్యా హక్కు చట్టం(ఆర్టీఈ)ని పెద్దగా ప్రచారం చేస్తూ మరో పక్క ఆ హక్కును కాపాడే పాఠశాలలే నిర్లక్ష్యానికి గురవడం వ్యతిరేకాత్మకం. విద్యా వ్యవస్థ పట్ల పిల్లల్లో, తల్లిదండ్రుల్లో విశ్వాసం కోల్పోయేలా వ్యవస్థే ప్రవర్తిస్తే అది అభివృద్ధి కాదు. ప్రమాద సంకేతం.
అభివృద్ధి కంటే ‘అభ్యాసం’ ముఖ్యం..
ప్రభుత్వం ప్రతి బడ్జెట్‌లో విద్యా రంగానికి భారీ కేటాయింపులు ప్రకటిస్తోంది. కానీ ఆ నిధులు ఎంతవరకు గమ్యానికి చేరుతున్నాయో ఎవరూ పరిశీలించటం లేదు. కొత్త భవనాలు, బల్లలు, పుస్తకాలు ఇవన్నీ అవసరం. కానీ.. వాటి కంటే ముఖ్యం బోధన నాణ్యత. ఒక మంచి ఉపాధ్యాయుడు లేకపోతే ఎంత అద్భుతమైన భవనం ఉన్నా అది “ఖాళీ గోడల పాఠశాల”గానే మిగులుతుంది. పాఠశాలల్లో చదువును ‘సంస్కారం’గా మలచే ప్రయత్నం జరగాలి. పిల్లల్లో ఆలోచనా శక్తి, సృజనాత్మకత, సామాజిక స్పృహ పెంపొందించడమే నిజమైన విద్య. కానీ.. ప్రస్తుత వ్యవస్థలో పాఠాలు జపించడం, పరీక్షల కోసం చదవడం మాత్రమే మిగిలింది..
సమస్యల మూలం.. జవాబుదారీతనం లేకపోవడం..
ప్రతి శాఖలోనూ బాధ్యత వహించేవారు ఉంటారు. కానీ.. విద్యా శాఖలో ‘జవాబుదారీతనం’ అనే పదం ఇప్పుడు సగం చనిపోయినట్లుంది. పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉన్నా ఎవరూ బాధ్యత వహించడం లేదు. ఒక పాఠశాలలో ఉపాధ్యాయులు లేని విషయం బయటపడితే తాత్కాలిక బదిలీతో విషయం ముగుస్తోంది. కానీ.. వ్యవస్థాపరమైన మార్పు మాత్రం రాకుండాపోతోంది. ప్రతి జిల్లాలో విద్యాధికారులు క్రమానుగతంగా పాఠశాలల పరిశీలన చేయాలి. పాఠశాలల పనితీరుపై ర్యాంకింగ్ విధానం తీసుకురావాలి. అలాగే పాఠశాలల లోపాలపై తల్లిదండ్రుల ఫీడ్‌బ్యాక్‌ను పరిగణలోకి తీసుకోవాలి. ఇవి జరిగితేనే విద్యా రంగం తిరిగి ప్రాణం పొందుతుంది.
సర్కారు సంకల్పం కాగితం మీదేనా..
రాష్ట్ర ప్రభుత్వం “మన ఊరు–మన బడి” వంటి పథకాలతో పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెబుతోంది. కానీ.. ఆ కృషి ఎక్కడ కనబడుతోంది? గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా అనేక పాఠశాలలు మలమూత్రాల దుర్వాసనలోనే ఉన్నాయి. తాగునీరు, శౌచాలయాలు, సౌర దీపాలు ఇవన్నీ “ప్రతిపాదనల” దశలోనే ఉన్నాయి. ప్రగతిపథం, బడికి బస్సు, పాఠశాలల డిజిటలైజేషన్ ఇవన్నీ అద్భుతమైన ఆలోచనలు. కానీ.. వాటిని అమలు చేసే వ్యవస్థ బలహీనంగా ఉంటే అవి ఫొటో సెషన్లకే పరిమితమవుతాయి.
ప్రభుత్వం ముందున్న సవాళ్లు..
మొదట.. ఖాళీ ఉపాధ్యాయ స్థానాలను తక్షణమే భర్తీ చేయాలి. రెండు.. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు, బోధనా నాణ్యతను మానిటర్ చేసే డిజిటల్ వ్యవస్థ తీసుకురావాలి. మూడు.. పాఠశాలల్లో స్థానిక సమాజం పాలుపంచుకునేలా స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలకు ఎక్కువ అధికారాలు ఇవ్వాలి. నాలుగు.. బోధనలో నైపుణ్యాభివృద్ధి కోసం ప్రతి ఉపాధ్యాయుడికి ఏటా కనీసం ఒక శిక్షణా శిబిరం తప్పనిసరి చేయాలి.
ఇవి అమలయ్యే వరకు విద్యా రంగం అభివృద్ధి ఊహ మాత్రమే..
పాఠశాల అనేది పిల్లల కలల ఆరంభం. ఆ కలల్ని సాకారం చేయడం విద్యా శాఖ బాధ్యత. కానీ.. ఆ శాఖే నిర్లక్ష్యం చూపితే పిల్లల కలలు ఛిద్రమవడం ఖాయం. “విద్యా హక్కు” కేవలం చట్టం కాదు. అది ప్రతి చిన్నారి పుట్టుకతో వచ్చే హక్కు. ఆ హక్కును కాపాడటమే ప్రభుత్వానికి అసలు పరీక్ష. పాఠశాలల గోడలు పడి పోతున్నా పిల్లల మనసులు పడిపోకూడదు. ప్రభుత్వ యంత్రాంగం మెలకువ చూపి విద్యా శాఖలో సజీవత నింపి “నెరిసిన విద్యా శాఖ”ను మళ్లీ “ప్రేరణాత్మక విద్యా శాఖ”గా మార్చగలిగితే అదే నిజమైన తెలంగాణ విజయగాథ అవుతుంది.
