Sunday, February 22, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంEncroachment | రోడ్డు మీదే అక్రమ వైన్‌షాపులు..

Encroachment | రోడ్డు మీదే అక్రమ వైన్‌షాపులు..

శేరిలింగంపల్లి సర్కిల్కు జోనల్ కమిషనర్ ఉన్నట్టా.. లేనట్టా..?

  • కొండాపూర్‌ రాజరాజేశ్వరి కాలనీలో రోడ్డు మధ్య అక్రమ వైన్‌షాపుల షెడ్లు
  • టీపీ సిబ్బంది కనుసన్నల్లోనే అక్రమ నిర్మాణాలు..
  • జోనల్‌, సర్కిల్‌ అధికారుల జోక్యం కోరుతున్న స్థానికులు..
  • వెంటనే నిర్మాణాలు తొలగించాలని డిమాండ్‌..
  • అక్రమ నిర్మాణ నోటీసులకు ఇచ్చే 15 రోజుల గడువు..
  • వైన్‌షాప్‌ నిర్వాహకులకు కవచంగా మారిందని ప్రజల ఆందోళన..

శేరిలింగంపల్లి సర్కిల్‌ పరిధిలోని కొండాపూర్‌ రాజరాజేశ్వరి కాలనీ ఇటీవల అక్రమ నిర్మాణాలకు కేంద్రబిందువుగా మారింది. రోడ్డుకు ఇరువైపులా, ఎలాంటి అనుమతులు లేకుండా, రెండు వైన్‌షాపుల షెడ్లు త్వరగతిన నిర్మాణం పూర్తవుడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టౌన్‌ ప్లానింగ్‌ (టీపీ) విభాగంలోని కింది స్థాయి సిబ్బంది కనుసన్నల్లోనే ఈ పనులు సాగుతున్నాయన్న ఆరోపణలు ప్రజల్లో మరింత చర్చనీ యాంశంగా మారాయి. కాలనీ వాసుల వివరాల ప్రకారం..

- Advertisement -

రోడ్డుకు అంచునే కాకుండా, రోడ్డుమధ్యభాగానికి అట్టే ఆనుకుని షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు వైన్స్‌ నిర్వహకులు.. రవాణాకు తీవ్ర అంతరాయం కలిగించే ఈ నిర్మాణాలను ప్రభుత్వం స్పష్టంగా నిషేధించినప్పటికీ, టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది మాముళ్లకు తలొగ్గి, అక్రమ నిర్మాణాలపై వైపు చూడటం లేదంటూ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేస్తే కనీసం 15 రోజుల గడువు ఇవ్వాలి.

అయితే ఆ గడువు చట్టబద్ధమైన చర్యలకు రక్షణగా మారుతున్నదని కాలనీ వాసులు మండిపడుతున్నారు. ఈ 15 రోజుల వ్యవధిలోనే మొత్తం షెడ్‌ నిర్మాణం పూర్తి చేసే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం ‘ది లిక్కర్‌ స్టోర్‌’ పేరుతో కేవలం 10 మద్యం బాటిళ్లు పెట్టి ఓపెన్‌ చేసినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి నిర్మాణం లేకున్నా కార్యకలాపాలు మొదలుపెట్టడం వెనుక ఏదో ఆంతర్యం ఉందని, ఇంకా పూర్తిగా షెడ్‌ నిర్మాణం పూర్తి కాకముందే, రెండో వైన్‌షాప్‌ ‘స్పిరిట్జ్‌ వైన్‌ మార్ట్‌’ కూడా పని ప్రారంభించినట్లు సమాచారం.

‘‘నిర్మాణం మధ్యలోనే వ్యాపారం ప్రారంభించటం ఏంటి? ఇది ఎవరి ధైర్యం?’’ అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు షాపుల నిర్మాణ పనులు వేగంగా సాగుతుండగా, శేర్లింగంపల్లి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. టౌన్‌ ప్లానింగ్‌ చైన్‌మెన్‌ కళ్లముందే, అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే, అధికారుల అండదండలు ఎంతమేరకు ఉన్నాయో మనం ఇట్టే అర్థం చేసు కోవచ్చు.

ఈ విషయంపై కాలనీ అసోసియేషన్‌ జోనల్‌ కమిషనర్‌ కు ఫిర్యాదు చేసినప్పటికి వారి నుండి ఎలాంటి స్పందన రాకపోవడంపై ప్రజల్లో విపరీతమైన అనుమానాలు పెంచు తోంది.. అసలు శేర్లింగంపల్లికి జోనల్‌ కమిషనర్‌ ఉన్నారా? లేరా? అక్రమాలు కళ్లముందు జరుగు తున్నా ఎందుకు స్పందిం చడం లేదంటూ నిలదీస్తున్నారు… ఇప్పటికైనా జోనల్‌ కమిషనర్‌ స్వయంగా పరిశీలించి, అక్రమ వైన్‌షాపుల నిర్మాణాలను వెంటనే తొలగించి, వారికి సహకరించిన టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News