మద్యం సిట్టింగ్ కోసం షెడ్ల నిర్మాణాలు
కొరవడిన అధికారులు పర్యవేక్షణ
మునిసిపల్ ఆదాయానికి గండి
మేడ్చల్, డిసెంబర్ 3(ఆదాబ్ హైదరాబాద్): మేడ్చల్ మునిసిపాలిటీ (Medchel Municipality) పరిధిలో అక్రమ నిర్మాణాలు (Illegal Constructions) పలువురికి కాసులు కురిపిస్తున్నాయి. గత కొంతకాలంగా మునిసిపాలిటీ పరిధిలో ఇష్టానుసారంగా తాత్కాలిక షెడ్ల (Sheds) నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అక్రమ నిర్మాణాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి (Government Income) భారీగా గండిపడుతోంది.
ఇలాంటి నిర్మాణాలను అడ్డుకొని చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేడ్చల్ మునిసిపాలిటీ.. జాతీయ రహదారి (National Highway) అనుకొని ఉండటంతో చుట్టుపక్కల అనేక విద్యా సంస్థలు, పరిశ్రమలు ఉండటం వల్ల వందల రకాల వ్యాపార సముదాయాలకు కావాల్సిన షెడ్ల నిర్మాణాలు వెలుస్తున్నాయి.
ఇదే ప్రాంతంలో రోజూ ఏదో ఒక చోట అక్రమ షెడ్లు వెలుస్తుండటం, అలాంటి వ్యాపార కేంద్రాలకు ట్యాక్స్‌ను విధించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం, అక్రమ నిర్మాణాలపై రెట్టింపు పన్నులు విధించకపోవడంతో అధికారులపై అనేక అనుమానాలకు తావిస్తోంది.

నూతన మద్యం పాలసీలో దుకాణాలు దక్కించుకున్న కొందరు వ్యాపారులు మద్యం సిట్టింగ్‌ల కోసం ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రికి రాత్రి అక్రమ షెడ్ల నిర్మాణాలు చేస్తున్నారు. సామాన్యుడు చిన్న ఇల్లు నిర్మించుకుంటే వంద రకాల పత్రాలు కోరే అధికారులకు జాతీయ రహదారిని అనుకొని అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలు కనిపించకపోవడం విడ్డురంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు.
కొరవడిన పర్యవేక్షణ
మేడ్చల్ మునిసిపాలిటీ పరిధిలో కొన్ని ముఖ్య కూడళ్లు, ప్రధాన రోడ్లపై అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా వెలుస్తున్నాయి. కొందరు.. మునిసిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతుల్లేకుండానే రేకులపై కప్పులతో ఏకంగా షాపులనే నిర్మించి వాటిని వ్యాపార, వాణిజ్య సంస్థలకు అద్దెకు ఇస్తూ రూ.లక్షల్లో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ కొరవడటంతో మునిసిపాలిటీ ఏటా రూ.లక్షల్లో రాబడిని కోల్పోతోంది. మేడ్చల్‌లో అనేక కాలనీలు వెలియడంతో లక్షలాది మంది ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రధాన రోడ్లపై కొందరు భవన యజమానులు స్థానిక మునిసిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా రేకులపై కప్పులతోపాటు షట్టర్లు బిగించి వందలాది షాపులను నిర్మిస్తున్నారు.
దీంతో ఎక్కడ చూసినా అనుమతుల్లేని షెడ్లు దర్శనమిస్తున్నాయి. వాటిని వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలకు నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అద్దెకిస్తూ ఏటా రూ.లక్షల్లో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను కట్టడి చేయాల్సిన టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించిన దాఖలాలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. మునిసిపల్ సిబ్బంది చేతివాటంతో మునిసిపాలిటీ భారీగా ఆదాయాన్ని కోల్పోతోంది.
వాస్తవానికి మునిసిపాలిటీ పరిధిలో ఇల్లు (రెసిడెన్షియల్), దుకాణాలు(కమర్షియల్) నిర్మించే ముందు స్థల యజమాని అన్ని ధ్రువీకరణ పత్రాలు సమర్పించి మునిసిపల్ అధికారుల నుంచి అనుమతి పొందాలి. ఆ తర్వాతే నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంటుంది.
నిర్మాణం పూర్తయ్యాక డోర్ నంబర్‌తోపాటు అసెస్‌మెంట్ చేయించుకొని ఏటా ఆస్తి పన్ను చెల్లించాలి. కానీ.. మేడ్చల్‌లో వెలుస్తున్న షెడ్లకు అలాంటి నిబంధనలు వర్తించడంలేదని, అధికారులకు అక్రమార్కులకు ఉన్న ఒప్పందం ఏంటో అనే ప్రశ్నలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.
