- హైకోర్టు యథాస్థితి ఉత్తర్వులను బేఖాతరు చేసిన అక్రమ నిర్మాణం
- న్యాయస్థాన ఉత్తర్వులను దాచిపెట్టిన జీహెచ్ఎంసీ అధికారులు
- ఐదు నెలలుగా అక్రమ నిర్మాణదారునికి రక్షణ కవచమా?
హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లో ఉన్న నీలోఫర్ కేఫ్కు సంబంధించిన అక్రమ నిర్మాణ వ్యవహారం ఇప్పుడు కేవలం జీహెచ్ఎంసీ నిర్లక్ష్యానికే కాకుండా, తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వుల ఉల్లంఘనకు కూడా నిదర్శనంగా మారుతోంది. అక్రమ నిర్మాణంపై ఎలాంటి మార్పులు చేయవద్దంటూ హైకోర్టు స్పష్టంగా తాత్కాలిక ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వాటిని పక్కన పెట్టి నిర్మాణ పనులు యథావిధిగా కొనసాగుతుండటం తీవ్ర చర్చకు దారితీస్తోంది.
ఈ వ్యవహారానికి సంబంధించి 2025 సంవత్సరానికి చెందిన రిట్ పిటిషన్ నంబర్ 25090ను గాడ్ స్పీడ్ ఇన్ఫ్రావెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లో ఉన్న ప్రాపర్టీ నంబర్లు 8– 2-685/పీ 2 నుండి పీ 5 విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు జారీ చేసిన 2025 జూలై 5 తేదీ ఉత్తర్వులు (ఆ౦సీ నం.111/టౌన్ ప్లానింగ్/డిప్యూటీ కమిషనర్/సర్కిల్-18/ఖైరతాబాద్/జీహెచ్ఎంసీ/2025) చట్ట విరుద్ధమని, రాజ్యాంగంలో పొందుపరిచిన వ్యక్తిగత స్వేచ్ఛ, ఆస్తి హక్కులకు విరుద్ధమని ప్రకటించాలని పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు.

యథాస్థితి ఆదేశాలు ఉన్నా… క్షేత్రస్థాయిలో వేరే పరిస్థితి
కేసు విచారణ సందర్భంగా జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది తదుపరి విచారణ నాటికి అధికారుల నుంచి సూచనలు తెచ్చుకోవాలని కోర్టు ఆదేశించింది. అదే సమయంలో, కేసు తుది తీర్పు వచ్చే వరకు సంబంధిత ప్రాపర్టీపై ఎలాంటి మార్పులు చేయకుండా యథాస్థితి కొనసాగించాలని హైకోర్టు స్పష్టమైన తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ తేదీగా 2025 సెప్టెంబర్ 22ను నిర్ణయించింది.
అయితే, ఈ యథాస్థితి ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. న్యాయస్థాన ఆదేశాలను బేఖాతరు చేస్తూ అక్రమ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్న ఫిర్యాదులు వెలుగులోకి వస్తున్నాయి. ఇది నేరుగా ఉన్నత న్యాయస్థాన అవమానానికి సమానమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

హైకోర్టు దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు?
అత్యంత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే, హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వుల విషయం పూర్తిగా తెలిసినప్పటికీ, జీహెచ్ ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు, సంబంధిత స్థాయి న్యాయ సలహాదారులు ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లకుండా ఉద్దేశ్య పూర్వకంగా మౌనం పాటిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి.
గత ఐదు నెలలుగా అక్రమ నిర్మాణదారునికి అన్ని విధాలుగా సహకరిస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. న్యాయస్థానం స్పష్టంగా ఆదేశించినప్పటికీ నిర్మాణ పనులను నిలిపివేయలేదు, నిర్మాణ స్థలాన్ని సీజ్ చేయలేదు, కోర్టుకు ఎలాంటి నివేదికను సమర్పించలేదు దీంతో, న్యాయవ్యవస్థను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
షోకాజ్ నోటీసులు – స్పీకింగ్ ఆర్డర్లు
హైకోర్టు ఉత్తర్వులు… అన్నీ నిరుపయోగమా?
ఇప్పటికే జీహెచ్ఎంసీ జారీ చేసిన షోకాజ్ నోటీసులు, వివరణా త్మక ఉత్తర్వులు, ఇప్పుడు హైకోర్టు జారీ చేసిన యథాస్థితి ఆదేశాలు కూడా అమలు కాకపోవడం చూస్తే, చట్టాలు కేవలం ఫైళ్లలోని కాగితాలకే పరిమితమయ్యాయా? అన్న అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇది కేవలం ఒక అక్రమ నిర్మాణానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. న్యాయస్థాన ఆదేశాల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి, పాలనా వ్యవస్థలో జవాబుదారీతనం లోపించడం, వ్యవస్థలో అవినీతి ప్రభావం, అన్న అంశాలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.
ఇది న్యాయస్థాన అవమాన కేసుగా మారుతుందా?
హైకోర్టు జారీ చేసిన యథాస్థితి ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ నిర్మా ణం కొనసాగితే, న్యాయస్థాన అవమానానికి సంబంధించిన కేసు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అలాంటి పరిస్థితి వస్తే, అక్రమ నిర్మాణ దారులతో పాటు, చర్యలు తీసుకోని జీహెచ్ఎంసీ అధికారులపై కూడా వ్యక్తిగత బాధ్యత తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
ఎవరి కోసం ఈ మౌనం?
కోర్టు ఉత్తర్వులు, చట్టపరమైన నోటీసులు, వరుస ఫిర్యాదులు అన్నీ ఉన్నప్పటికీ చర్యలు లేకపోవడాన్ని చూసి, “ఈ మౌనం ఎవరి ప్రయోజనాల కోసం?” “ప్రభుత్వానికి రావాల్సిన ఆదా యం, ప్రజా ప్రయోజనం కంటే వ్యక్తిగత లాభాలే ముఖ్యమా?” అన్న ప్రశ్నలు నగరవ్యాప్తంగా వినిపిస్తున్నాయి.
ఇప్పటికైనా తెలంగాణ హైకోర్టు ఈ వ్యవహారాన్ని సీరియస్గా పరిగణించి, యథాస్థితి ఉత్తర్వుల ఉల్లంఘనపై వివరణ కోరాలని, అక్రమ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని, నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడ్డ అధికారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు, పౌర సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే, న్యాయస్థాన ఉత్తర్వులకే విలువ లేకుండా చేసే ప్రమాదకరమైన సంప్రదాయం నెలకొంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
