- వ్యవసాయ భూమిలో అక్రమ ఇటుక బట్టి దందా..?
- భయంతో పరుగులు తీసిన కూలీల పిల్లలు
- మామూళ్ల మత్తులో అధికారుల మౌనం..?
సర్వే నంబర్లు 58, 59 కు చెందిన సుమారు 9 ఎకరాల వ్యవసాయ భూమిలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే అక్రమంగా ఇటుక బట్టి నిర్వహణ కొనసాగుతుండటం సంచలనంగా మారింది. పంటలు పండాల్సిన నేలపై ఇప్పుడు బట్టిలు వేలుస్తుండడం స్థానికులను ఆగ్రహానికి గురిచేస్తోంది.
వ్యవసాయ భూమిని ఇతర అవసరాలకు మార్చాలంటే రెవెన్యూ శాఖ, పంచాయతీ, కాలుష్య నియంత్రణ విభాగాల అనుమతులు తప్పనిసరి. అయితే ఇక్కడ అలాంటి అనుమతులు ఏవీ లేవని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. భూమిని లోతుగా తవ్వి ఇటుక మట్టి సేకరణ చేయడం వల్ల భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడుతోందని రైతులు వాపోతున్నారు. పంటల దిగుబడి తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బట్టిల పొగలో మగ్గుతున్న బాల్యం
ఇటుక బట్టిల వద్ద పనిచేస్తున్న కూలీల పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. పాఠశాలల్లో ఉండాల్సిన చిన్నారులు మట్టి ముద్దలు చేసి బట్టిల వద్దే తిరుగుతుండటం హృదయ విదారకం. సఘటన స్థలానికి వెళ్లి పిల్లల ఫోటోలు తీసేందుకు ప్రయత్నించగా, మా ఓనరు కొడుతాడు” అంటూ భయంతో పరుగులు పెట్టిన చిన్నారుల మాటలు అక్కడి భయానక వాస్తవాన్ని బయటపెడుతున్నాయి.
బాల కార్మిక నిషేధ చట్టాలు ఉన్నా, అమలు ఎక్కడ చిన్నారుల భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
బట్టిల నుంచి ఎగిసిపడుతున్న దట్టమైన పొగ, దుమ్ము కారణంగా సమీప ప్రాంతాల్లో శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.
సర్వే నంబర్లు స్పష్టంగా ఉన్నప్పటికీ, దాదాపు 9 ఎకరాల విస్తీర్ణంలో అక్రమ కార్యకలాపాలు బహిరంగంగానే సాగుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామస్థులు వెంటనే దర్యాప్తు చేసి, అక్రమ బట్టిని మూసివేసి, చిన్నారులను పాఠశాలలకు పంపించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పంటలు పండాల్సిన పొలాల్లో పొగలు పుస్తకాలు పట్టాల్సిన చేతుల్లో మట్టి కుకునూరుపల్లి మండలం మంగోల్ గ్రామంలో జరుగుతున్న ఈ అక్రమ ఇటుక బట్టి వ్యవహారం చట్టాలకే సవాల్ విసురుతోంది. చూడాలి మరి అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారా లేక చిన్నారుల బాల్యం ఇలాగే బట్టిల పొగలో కలిసిపోతుందా?
