ఎస్సారెస్పీ రెండో దశకు బీఎన్ రెడ్డి పేరు పెట్టాలి
సూర్యాపేట జిల్లా పేరును బీఎన్ రెడ్డి జిల్లాగా మార్చాలి
ఏఐకెఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుసుంబ బాబురావు
నర్సంపేట, నవంబర్ 16(ఆదాబ్ హైదరాబాద్): వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు (Telangana Peasant Armed Struggle Fighter), అమరజీవి (Immortal) భీమిరెడ్డి నరసింహా రెడ్డి (Bheemireddy Narasimha Reddy-BN Reddy) ఆదర్శాలను, త్యాగాలను భవిష్యత్ తరాలకు అందించాలని అఖిల భారత రైతు సమాఖ్య(AIKF) జిల్లా ప్రధాన కార్యదర్శి కుసుంబ బాబురావు డిమాండ్ చేశారు.
సూర్యాపేట జిల్లా పేరు(Suryapet District Name)ను బీఎన్ రెడ్డి జిల్లాగా మార్చి ఎస్సారెస్పీ(Srsp) రెండో దశ కాలువకు ఆయన పేరు పెట్టాలని కోరారు. నర్సంపేట పట్టణంలోని ఓంకార్ భవన్‌లో ప్రజా సంఘాల సమావేశం యూపీఎన్ఎం జిల్లా కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి అధ్యక్షతన జరిగింది. ఈ నెల 19న రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే రాష్ట్ర ధర్నా(Dharna) ప్రచార, కరపత్రాలను ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన సమావేశంలో బాబురావు మాట్లాడుతూ.. నైజాం రజాకార్ల దోపిడీ, పీడనలతో అణచివేతకు గురై ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేసేందుకు బీఎన్ రెడ్డి నాయకత్వంలో గ్రామ స్వరాజ్యాలను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. లక్షలాది ఎకరాలను పేదలకు పంచి సర్వం త్యాగం చేసిన త్యాగధనులను, వారి ఆదర్శాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన గురుతరమైన బాధ్యత పాలకులపై ఉందని తెలిపారు.
అయితే.. దీన్ని విస్మరించి చరిత్రలో ఎలాంటి గుర్తింపు, త్యాగాలు లేని వ్యక్తులను స్మరించేలా చేస్తున్నారంటే ఇంతకన్నా ఘోరం మరొకటి ఉండదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేలా పాఠ్యాంశంలో చేర్చాలని డిమాండ్ చేశారు.
ఆ మహా నాయకుల స్మృతి చిహ్నాలను కూడా ఏర్పాటుచేయాలని కోరారు. శ్రీరాంసాగర్ రెండో దశ కాలువ నిర్మించి ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు సాగు, తాగు నీరు అందించటం కోసం ఎంతో పోరాడి నాటి పాలకులపై ఒత్తిడి తెచ్చి సాధించిన బీఎన్ రెడ్డి పేరును ఎస్సారెస్పీ రెండో దశ కాలువకు పెట్టకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా తక్షణమే నామకరణం చేయాలని కోరారు. ట్యాంక్ బండ్‌పై బీఎన్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని, స్మృతి వనాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 19న ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూపీఎన్ఎం, ఏఐఎఫ్‌డీడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శులు కన్నం వెంకన్న, వంగల రాగసుధ, ఏఐసీటీయూ జిల్లా కోశాధికారి మహమ్మద్ మసూక్, రైతు వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ నాయకులు కలకోట్ల యాదగిరి, దామ సాంబయ్య, కొల్లేటి సీతారాములు, మహమ్మద్ అలీ సాబ్, విద్యార్థి సంఘం జిల్లా నాయకులు జన్ను రమేష్ తదితరులు పాల్గొన్నారు.
