బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన చిత్రాల్లో ’క్రిష్’ విశేష ఆదరణను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కొనసాగింపుగా ’క్రిష్ 3’ తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది. ఈ ఫ్రాంచైజీలోనే ’క్రిష్ 4’ రానుంది. దీనికి హృతిక్ రోషన్ దర్శకత్వం వహించనున్నారు. అయితే భారీ బడ్జెట్ కారణంగా దీని షూటింగ్‌ను ప్రారంభించలేకపోతున్నట్లు హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాజాగా దీనిపై ఆయన అప్‌డేట్ ఇచ్చారు. బడ్జెట్‌పై అవగాహన వచ్చిందన్నారు. తాము ఎంత ప్రయత్నించినా ఈ సినిమాకు బడ్జెట్ సమకూరడం లేదని అందుకే ఇది ఆలస్యమవుతోందని గతంలో రాకేశ్ తెలిపారు. నాలుగో భాగాన్ని మరింత గ్రాండ్‌గా తీయాలని ఒకవేళ బడ్జెట్ తగ్గించాలని చూస్తే.. ఈ చిత్రం ఓ సాధారణ కథలా అయిపోతుందని చెప్పారు. తాజాగా దీనిపై ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘స్కిప్ట్ రాయడానికి పెద్దగా సమయం పట్టదు. కానీ, బడ్జెట్ విషయంలో ఒత్తిడి వల్లే ఇన్ని రోజులు ముందుకువెళ్లలేకపోయాం. ఇప్పుడు ఈ సినిమాకు ఎంత బడ్జెట్ అవుతుంది అనే దానిపై మాకు అవగాహన వచ్చింది. ప్రస్తుతం దీని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయంపట్టొచ్చు. వచ్చే ఏడాదిలో చిత్రీకరణను ప్రారంభిస్తాం. 2027లో దీన్ని మీ ముందుకు తీసుకురావాలని భావిస్తున్నామని తెలిపారు. ’క్రిష్’ సిరీస్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రాకేశ్ రోషన్ నాలుగో భాగానికి కూడా తెరకెక్కించనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. వాటికి చెక్ పెడుతూ తన కుమారుడు హృతిక్ రోషన్ దర్శకత్వంలో ’క్రిష్ 4’ వస్తుందని తెలిపారు. ఇక ఈ సిరీస్ చిత్రాలు వరుసగా 2003, 2006, 2013 సంవత్సరాల్లో విడుదలైన విషయం తెలిసిందే.